శభాష్‌ హారిక

Anarghya NGO Harika Construct Water Tank For School Children - Sakshi

స్కూల్‌లో నీటి సౌకర్యం కోసం పట్టు

అధికారులను కలిసినా ఫలితం సున్నా

మంత్రి హరీష్‌ దృష్టికి తీసుకెళ్లడంతో 24 గంటల్లో తాగునీరు అందిన వైనం

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన హారిక ఇరంకి ‘అనర్ఘ్య’ పేరుతో ఎన్జీఓను రన్‌ చేస్తుంది. శివరాంపల్లి స్కూల్లో తాగేందుకు మంచినీరు వెసులుబాటు లేకపోవడంతో..ఆ విషయాన్ని అక్కడి విద్యార్థులు హారిక దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన హారిక అక్కడి ప్రధానోపాధ్యాయుడిని నిలిదీసింది. స్పందన లేకపోవడంతో మండల విద్యాశాఖా అధికారిని అడగ్గా..నిధులు లేవన్నాడు. స్కూల్‌కి మంచినీళ్లు సౌకర్యాన్ని కల్పించమని సంబంధిత శాఖ అధికారులను కోరగా..వాళ్లు కొత్త కనెక్షన్‌ కోసం రూ.78 వేలు అడిగారు. ఏం చేయోలో తెలియక అప్పుడు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న హరీష్‌రావును హారిక కలిసి విషయాన్ని వివరించింది. ఆ క్షణాన హారిక ఫోన్‌ నుంచి కాల్‌ చేసి..‘నేను మంత్రి హరీష్‌రావును మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ స్కూల్‌కి 24 గంటల్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి’ అంటూ హరీష్‌రావు ఫోన్‌లో అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా నీటి సమస్యతో అల్లాడిన ఆ స్కూల్‌కు 24 గంటల్లో మంచినీరు అందింది. ఇది ఆనందాన్నిచ్చిందని హారిక వివరించింది.  

8 మంది బాలికలకు రక్షణ  
సేవా కార్యక్రమాలే కాకుండా కొన్ని సాహసోపేత పనులకూ హారిక ముందుంది. ఆటోడ్రైవర్ల అకృత్యాలను ధైర్యంగా బాహ్య ప్రపంచానికి తెలియచేసి శభాష్‌ అన్పించుకుంది. దాని గురించి వివరిస్తూ ఆమె...‘శంషాబాద్, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో కొందరు ఆటోవాళ్లు స్కూల్‌ పిల్లల్ని తీసికెళ్లి, తీసుకురావడం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలికలకు వాళ్లకు మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు ఎనిమిదిమంది అమ్మాయిలు ఇంటికి రాకపోవడంతో..వాళ్ల తల్లులు రాత్రి 11.40 గంటల సమంయలో నాకు ఫోన్‌ చేశారు. నేను స్కూల్‌ టీచర్‌లకు ఫోన్‌ చేసి అడిగితే వాళ్లు ఈరోజు స్కూల్‌కి రాలేదంటూ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత రోజు ఇంటికి వచ్చిన వీళ్లతో నేను నాలుగు రోజుల పాటు ఫ్రెండ్‌గా మాట్లాడి ఎక్కడకు వెళ్లారని అడగ్గా..కొందరు ఆటోడ్రైవర్లు తమను తీసికెళ్లి అత్యాచారం చేశారంటూ బదులిచ్చారు. ఈ విషయంపై అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారందర్నీ అదుపులోకి తీసుకుని విచారించి కొందరిని అరెస్ట్‌ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. అప్పటి నుంచే నాకు వేధింపులు ఎక్కువ అయ్యాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.’ అని చెబుతూ ముగించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top