ఉస్మానియాలో కృత్రిమ మేధ!

AI Research Center In Osmania University - Sakshi

ఏఐ పరిశోధనలకు వేదిక కానున్న ఓయూ

టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో అందుబాటులోకి

మరో 15 రోజుల్లో ల్యాబ్‌ను ప్రారంభించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హవా కొనసాగుతోంది. అనేక కొత్త ఆవిష్కరణలకు కారణమవుతున్న ఈ కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించిన పరిశోధనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మారుతోంది. ఓయూ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో మరో 15 రోజుల్లో ఈ పరిశోధనలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్‌ పోలీసు, రవాణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగాలకు ఏఐ మరింతగా చొచ్చుకుపోనుంది. సమాజానికి ఎంతో అవసరమైన ఈ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ మిషన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంఎల్‌)ఉస్మానియా యూనివర్సిటీకి మంజూరైంది.

రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు కేంద్రం రూ.107 కోట్లు కేటాయించింది. ఇటీవల ఓయూకు మంజూరైన రూ.17 కోట్ల నుంచి రూ.కోటి వెచ్చించి ఓయూ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ఈ ల్యాబ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయం వేదికగా కృత్రిమ మేధస్సుపై అనేక పరిశోధనలు జరగనున్నాయి.

మానవ మేధస్సును అర్థం చేసుకుంటుంది
మానవ మేధస్సును అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కంప్యూటర్‌ వ్యవస్థ పని చేయడమే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఇందులో స్పీచ్‌ రికగ్నిషన్, విజువల్‌ పర్సెప్షన్, లాజిక్‌ అండ్‌ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి చాలా అంశాలు ఉంటాయి. ఏఐ సాయంతో అల్జీమర్స్‌ లాంటి జబ్బుల్ని కూడా నయం చేయొచ్చని పరిశోధనల్లో తేలింది. రోబోటిక్స్‌లోఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలకం.
ప్రొఫెసర్‌ రామచంద్రం, మాజీ వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఏఐతో కొన్ని ఉపయోగాలు
►గతంలో పదవీ విరమణ చేసిన వారు నెలవారీ పెన్షన్‌ తీసుకోవాలంటే ఆయా విభాగాల అధికారులు ఇచ్చిన గుర్తింపు సర్టిఫికెట్‌ సమర్పించాల్సి వచ్చేది. ఇది పదవీ విరమణ చేసిన వారికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ సంయుక్తంగా పెన్షనర్ల కోసం ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ టూల్‌ను రూపొందించింది. ఫొటో తీసి సంబంధిత యాప్‌కు పంపితే చాలు రెండు మూడు నిమిషాల్లోనే పనైపోతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తోనే సాధ్యమైంది. 
►పంటకు పట్టిన తెగుళ్లు, పురుగులను నివారించేందుకు రైతు తన చేలో నిలబడి.. స్మార్ట్‌ఫోన్‌లో పంటకు పట్టిన చీడను ఫొటో తీసి ఓ నంబర్‌కు పంపితే చాలు నివారణ చర్యలు సూచిస్తుంది.
►ఒక వాహనం మరో వాహనానికి చేరువలోకి వెళ్లినప్పుడు ఈ ఏఐ ద్వారా వాహనదారులను అలర్ట్‌ చేస్తుంది.
►ఏ జబ్బుకు, ఏ వయసు రోగికి, శరీర బరువు ఆధారంగా ఎంత మోతాదు మందు ఇవ్వాలో ఆ మేరకు నిర్దేశించి మందులు సూచిస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వాన్ని చూపిస్తుంది. ఏ సీజన్‌లో ఏ వ్యాధులు వస్తాయి.. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వ యంత్రాంగాలకు ముందే చేరవేస్తుంది.
►1956లో అమెరికా పరిశోధకుడు జాన్‌ మెక్‌కార్తీ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పదాన్ని సృష్టించారు. యంత్రాలు మనుషుల్లా పని చెయ్యడం, మాట్లాడగ లగడం, ఆలోచించగలగడమే దీని లక్ష్యం. ఇప్పుడిప్పుడే ఈ కల సాకారం అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఏఐపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నాయి. స్మార్ట్‌ మొబైళ్ల రాకతో, సామాన్యులు కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి దగ్గరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top