తెల్ల బంగారమే!

Agriculture Marketing Officials Announced MSP Of Cotton - Sakshi

పత్తి ఎమ్మెస్పీ క్వింటాకు రూ.5,450

మార్కెట్‌ ధర రూ.5,550

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారుల వెల్లడి..

తక్కువ పలికినాఎంఎస్పీకే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు

రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు: మంత్రి హరీశ్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పత్తికి ఆశాజనకమైన మద్దతు ధర లభిస్తుందని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450గా ఉందని..మార్కెట్లో వ్యాపారులు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చి.. రూ.5,550కి మించి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన అవసరం రైతులకు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దిగుబడులు తగ్గుతుండటంతోనే.. పత్తికి డిమాండ్‌ పెరిగిందని.. అందుకే మంచి ధర వస్తుందని వెల్లడించారు.

‘ఈసారి పత్తికి కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా.. మంచి ధర వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల దళారులు మాయమాటలు చెప్పినా.. రైతులు పత్తిని ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. తేమ శాతం సరిగా చూసుకుని అమ్ముకుంటే ఎక్కడా నష్టాలు రావు’అని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ‘ఒకవేళ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రండి’అని రైతులకు హరీశ్‌ పేర్కొన్నారు. గతేడాది ఎమ్మెస్పీ రూ. 4,320 ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దీన్ని రూ.5,450 పెంచడంతో రైతులకు మేలు జరుగుతుందని మార్కెటింగ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 
 
ఇప్పటికే లక్ష క్వింటాళ్లు.. 
ఈ ఏడాది తెలంగాణలో 35.92 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల ప్రకారం అంతకన్నా తక్కువ దిగుబడి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 30 లక్షల మెట్రిక్‌ టన్నుల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆశించకూడదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొందని వారు వెల్లడించారు. దిగుబడి తగ్గనున్నందునే.. మంచి ధర వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పత్తి తీతలు మొదలయ్యాయి. ముందస్తుగా పంటలు వేసినచోట్ల మొదటి తీత పూర్తయిన రైతులు పత్తిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష క్వింటాళ్ల వరకు పత్తి మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా గతేడాది 241 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 342 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో జిన్నింగ్‌ మిల్లుల ద్వారా 275, మార్కెటింగ్‌శాఖ ద్వారా 67 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు 7 కేంద్రాలను ప్రారంభించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top