అలజడి

87 Members From Nizamuddin in Rangareddy - Sakshi

ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లొచ్చిన 87 మంది జిల్లావాసులు

ఆధ్యాత్మిక ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించిన

జిల్లా యంత్రాంగం అందరూ గాంధీ ఆస్పత్రికి..

ఆ తర్వాత హోం క్వారంటైన్‌

ఎవరికీ లక్షణాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన ఆధ్యాత్మిక ప్రార్థనలో జిల్లా చెందిన వారు పాల్గొని రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి Ððవెయ్యిమందికిపైగా పాల్గొని ఇటీవలే స్వస్థలాలకు వచ్చారు. ఈ జాబితాలో జిల్లాకు చెందిన వారు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంతో జిల్లాలో భయాందోళన పరిస్థితులునెలకొన్నాయి. మహమ్మారి కరోనా వైరస్‌ బారినపడి పలు జిల్లాలకు చెందిన వారు మరణించడంతో జిల్లా వాసుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

జిల్లా నుంచి 87 మంది మర్కజ్‌లో జరిగిన
ఆధ్యాత్మిక ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే ప్రాంతాలవారు కాగా.. 13 మంది మాత్రమే మున్సిపాలిటీలు, గ్రామాలకు చెందినవాళ్లని తేల్చారు. మైలార్‌దేవ్‌పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, సులేమాన్‌నగర్, జల్‌పల్లి, షాద్‌నగర్, నందిగామ, చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌  తదితర ప్రాంతాలవారు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది ప్రార్థనల్లో పాల్గొన్నారని, మరో పది శాతం మంది వారి తోటి ప్రయాణికులుగా పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.

84 మంది హోం క్వారంటైన్‌లో..
ప్రభుత్వమిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులు, జిల్లా రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఒక్కరోజులోనే వీరందరినీ గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి పంపారు. స్వలంగా వ్యాధి లక్షణాలు గల ఇద్దరి నుంచి మాత్రమే నమూనాలు సేకరించి పరీక్షించగా.. నెగెటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి వెల్లడించారు. మిగిలిన వారిలో వ్యాధి లక్షణాలు లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు. అలాగే 60 ఏళ్ల పైబడిన ముగ్గురిని మాత్రమే ముందు జాగ్రత్త చర్యగా గాంధీలో ఇన్‌పేషంట్లుగా చేర్చారు. మిగిలిన వారందరికీ ‘హోం క్వారంటైన్‌’ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కనీసం 14 రోజులు.. గరిష్టంగా 21 రోజులపాటు వీరంతా ప్రత్యేక గదిలోనే గడపాల్సి ఉంటుంది. 

కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆరా..
ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని విడతల వారీగా ఈనెల 18, 20 తేదీల్లో వచ్చారు. అప్పటికే కరోనా వ్యాప్తిపై విస్తృతంగా ప్రచారం జరగడంతో వీళ్లంతా ఇతరులకు దూరం పాటించినట్లు తెలిసింది. ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఎవరితో సన్నిహితంగా మెలగలేదని అధికారుల విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుజాగ్రత్తగా వీరి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఆరాతీశారు. దాదాపు 250 మందిలో ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు లేకపోవడంతోపాటు అనారోగ్యంగా లేరని తెలిసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయినా కొన్ని రోజులపాటు వీరిపై వైద్య సిబ్బంది కన్నేసి ఉంచుతారు. అలాగే ఈ కుటుంబాలు నివసిస్తున్న ఇరుగు పొరుగు వారి ఆరోగ్య పరిస్థితిని బుధవారం తెలుసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయిచింది. 

కలెక్టరేట్‌ నుంచి పర్యవేక్షణ..
ఢిల్లీలో జరిగిన జమాతే సభలో పాల్గొని వచ్చినవారి వివరాలను కలెక్టరేట్‌ నుంచి కమిషనర్‌ సజ్జనార్, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ఆరాతీశారు. కందుకూరు, రాజేంద్రనగర్‌ డివిజన్ల పరిధిలో హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని సర్వేలెన్స్‌ బృందాలు పరిశీలించాయని, వీరిలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులులేవని తెలిపారు. ఆమనగల్లు మండలంలో హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని వైద్య బృందాలు తనిఖీ చేశాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top