పేగుబంధం కలిసిన వేళ..!

30 years ago disappeared mother - Sakshi

మతిస్థిమితం కోల్పోయి 30 ఏళ్ల క్రితం తల్లి అదృశ్యం

అక్కున చేర్చుకున్న మహారాష్ట్రలోని సేవాసంకల్, శ్రద్ధ ఫౌండేషన్లు

ఆమె కోలుకున్నాక కుటుంబ సభ్యులకు అప్పగించిన శ్రద్ధ ఫౌండేషన్‌

ఖానాపురం: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 30 ఏళ్ల క్రితం బిడ్డలకు దూరమైన ఓ తల్లి అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. మతిస్థిమితం సరిగ్గా లేక కనిపించకుండాపోయిన ఆ మాతృమూర్తి శుక్రవారం ఇంటికి చేరింది. ఇక ఆశలు వదులుకున్నాక.. తమ తల్లి కళ్ల ముందే కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది కలనా.. నిజమా అని తల్లిని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి రామక్క, వెంకటయ్య దంపతులకు కుమార్తెలు పద్మ, యశోద, కుమారుడు బండి కృష్ణ ఉన్నారు.

వారిలో పద్మ, కృష్ణ ఖానాపురంలోనే నివాసం ఉంటున్నారు. రామక్క మతిస్థిమితం కోల్పోయి ఇంటి వద్ద ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. ఇలా ఆమె అదృశ్యమై ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. అయితే.. రామక్క రోడ్డు పక్కన మతిస్థిమితం కోల్పోయి ఉండగా మహారాష్ట్రలోని సేవా సంకల్‌ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఆ తర్వాత ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్‌ బాధ్యులు తీసుకొచ్చి వైద్యం చేయించారు. దీంతో కోలుకున్న రామక్క వివరాలను కనుక్కునే క్రమంలో తన తల్లిగారి గ్రామం వరంగల్‌ జిల్లా కోరుకొండపల్లి అని చెప్పింది. దీంతో ఫౌండేషన్‌ ప్రతినిధులు రహెన్, సురేఖ, ప్రదీప్, నితీష్, గణేష్‌ ఆమెను గురువారం ఉదయం కేసముద్రం మండలం కోరుకొండపల్లికి తీసుకొచ్చారు.

అయితే.. రామక్క కుటుంబ సభ్యులు వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురంలో ఉంటారని చెప్పడంతో వారు తిరిగి అంబులెన్స్‌లోనే వరంగల్‌కు వెళ్లారు. శుక్రవారం గూగుల్‌ మ్యాప్‌ సాయంతో ఖానాపురం చేరుకున్నారు. గ్రామానికి వచ్చి వివరాలు సేకరించే క్రమంలో ఆమె కుమార్తె పద్మ, కుమారుడు కృష్ణ రామక్కను గుర్తించి సంభ్రమాశ్చార్యానికి లోనై బోరున విలపించారు. ఇక లేదనుకున్న తల్లి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో ఆమెపై పడి వారు రోదిస్తున్న తీరును చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ‘మన ఇంటికి పోదాం పద బిడ్డా..’అంటూ రామక్క వారి కన్నీళ్లను తుడిచింది. తమ తల్లిని అక్కున చేర్చుకుని, అప్పగించిన శ్రద్ధ ఫౌండేషన్‌ బాధ్యులకు కుటుంబ సభ్యులు చేతులెత్తి నమస్కరించారు. రామక్కతోపాటు వెంకటేశ్వరమ్మ, బిందు, లక్ష్మిలను కూడా వారివారి కుటుంబాలకు అప్పగించేందుకు వెళ్తున్నట్లు ఫౌండేషన్‌ బాధ్యులు వెల్లడించారు. శ్రద్ధ ఫౌండేషన్‌ సభ్యుల కృషిని స్థానికులు అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top