ఖమ్మం నుంచి 1,890 ట్రాక్టర్లలో...

1,890 tractors rally from khammam - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా రైతాంగం, టీఆర్‌ఎస్‌ శ్రేణులు సభకు 2 రోజుల ముందే వినూత్న రీతిలో బయలుదేరారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 1,890 ట్రాక్టర్లతో ప్రదర్శనగా శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. శ్రీనివాసరెడ్డి రైతులతో కలసి ట్రాక్టర్‌ను నడుపుతూ ప్రదర్శనగా రాజధానికి బయలుదేరారు. దాదాపు 30 కిలోమీటర్లకు పైగా పొడవు గల ఈ ప్రయాణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.

ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ట్రాక్టర్ల ప్రదర్శనకు ముందు గుమ్మడికాయ కొట్టారు. ట్రాక్టర్ల ప్రదర్శనతో ఖమ్మంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నాలుగున్నరేళ్ల పాటు రైతు సేవలో నిమగ్నమై ఉన్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు జిల్లా రైతాంగం పెద్దెత్తున ప్రగతి నివేదన సభకు బయలుదేరడం అభినందనీయమని మంత్రి అన్నారు.

రైతుల కోసం అహర్నిశలు శ్రమించే కేసీఆర్‌కు జిల్లా రైతాంగం తెలుపుతున్న కృతజ్ఞతే ట్రాక్టర్ల ప్రదర్శన ద్వారా ప్రగతి నివేదన సభకు వెళ్లడమని శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top