పెద్దచెరువు కాలువనూ ఆక్రమించారు! | Sakshi
Sakshi News home page

పెద్దచెరువు కాలువనూ ఆక్రమించారు!

Published Wed, Feb 25 2015 1:34 AM

పెద్దచెరువు కాలువనూ ఆక్రమించారు!

చిన్నకోడూరు : కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా పెద్దచెరువు కాలువనే కబ్జా చేసి లక్షలాది రూపాయల విలువైన నీటిపారుదల భూములు రియల్ వ్యాపారులు కబ్జా చే శారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంగనర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రాజీవ్ రహదారికి పక్కన విలువైన భూములు ఉన్నాయి. ఇదే సమయంలో రోడ్డు విస్తరణ జరగడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. ఈ క్రమంలో ఇబ్రహీంగనర్ పెద్దచెరువు కట్టుకాలువపై కన్నేసిన రియల్ వ్యాపారులు కాలువను చదును చేసి కబ్జా చేశారు. ప్రస్తుతానికి ఎకరాకు రూ. 40 లక్షల ధర పలుకుతుండడంతో కట్టు కాలువకు చెందిన 25 గుంటలను వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమించారు. దీంతో పెద్దచెరువుపై ఆధారపడిన గ్రామ రైతులకు ఈ కబ్జా సాగునీటి ప్రవాహానికి ఆటంకంగానే మారనుందని చెప్పాలి.

సంబంధిత కట్టు కాలువ కబ్జాను నియంత్రించి అధికారులు సమగ్రమైన చర్యలు చేపట్టి భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు స్పందించక పోవడంతో సదరు భూములు అక్రమార్కులు దర్జాగా ఆక్రమిస్తున్నారని వాపోతున్నారు. కబ్జాదారుల చెర నుంచి ఆ భూములు రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ పరమేశంను వివరణ కకోరగా ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు కాలువను పరిశీలించి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement