-
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారాయన. తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్ఎస్వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్, రీ డిజైనింగ్ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్ఎస్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది. NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్‌లను ఎన్డీఎస్ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్ పెద్ద మిస్టేక్. అది కూలినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాల్స్, భీమ్స్‌లో రంధ్రాలు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. రీడిజైన్ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం. -
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్ చేశారు. తనపై వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని ట్వీట్ చేశారు.‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా ట్వీట్ చేశారు."Karmanye vadhikaraste, ma phaleshu kadachana"#IAS Spent 4 months in Tourism.Did my best!1.Brought in the long pending Tourism Policy 25-30, a first for the State. Will create a solid frame for direction & investment in neglected tourist circuits.2. Revamped the working… pic.twitter.com/2nUlVQO4W3— Smita Sabharwal (@SmitaSabharwal) April 29, 2025 కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. స్మితాపై బదిలీ వేటు వేసింది. ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. -
రజతోత్సవ సభతో నయా జోష్!.. కేసీఆర్ ప్లాన్ ఫలించినట్లేనా?
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ సభ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు, నేతల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనపై ఇప్పటికే అసంతృప్తి ఏర్పడ్డ నేపథ్యంలో ప్రజల దృష్టి బీజేపీవైపు కాకుండా బీఆర్ఎస్కు అధికారం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఏర్పడేందుకు కూడా వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉపయోగపడుతుంది.2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం అనూహ్యమే. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు, శాసన మండలి ఎన్నికల్లోనూ ఓటమే ఎదురు కావడంతో పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉండటం సహజం. రాజకీయ పార్టీలకు ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదుర్కొన్నాయి. 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 1989 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1991లో 13 సీట్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఒంటెద్దు పోకడల ఆరోపణలు, వ్యతిరేకత ఉందని తెలిసి సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడం వంటి అనేకానేక కారణాల వల్ల 2023 ఎన్నికల్లో పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదానైతే దక్కించుకుంది కానీ.. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కొంత నష్టం చేసింది.రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం, తదితర అంశాలపై విచారణ కమిషన్లు వేయడం కూడా పార్టీపై వ్యతిరేక ప్రచారం జరిగేందుకు అవకాశమిచ్చింది. దీన్ని అధిగమించడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్ ఈ రజతోత్సవ సభను వాడుకున్నారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించి, ప్రస్తుతం తెలంగాణ ఆగమవుతోందని, అది చూసి తనకు దుఃఖం వేస్తోందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమం నాటి సంగతులు, 1956 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు అన్నింటినీ ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి సెంటిమెంట్‌ను ప్రయోగించే యత్నం చేసినట్లు స్పష్టంగా బోధపడుతుంది. ఈ క్రమంలో 1956లో ప్రజలంతా తెలంగాణ, ఏపీలో కలపడానికి వ్యతిరేకించారని ఆయన చెప్పడం కొంత వక్రీకరించడమే అవుతుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ, ఆంధ్రలు కలవడానికి అంగీకరించని వారు కొంతమంది ఉండవచ్చు కానీ, హైదరాబాద్ శాసనసభలో ఉమ్మడి ఏపీకి అనుకూలంగా మెజార్టీ సభ్యులు మాట్లాడారు.అంతేకాదు.. అంతకుముందు ప్రముఖుల సారథ్యంలో తెలంగాణలో సైతం ఆంధ్ర మహాసభలు జరిగేవి. చరిత్రను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. 2009లో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేయడం కీలకమైన మలుపు. టీఆర్ఎస్కు అప్పట్లో ఇద్దరు ఎంపీలే ఉండేవారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం, తదనంతరం జరిగిన పరిణామాలలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు పలువురు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉండటం, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వంటి అంశాలు కలిసి వచ్చాయి.తెలంగాణ వాదంతో కాంగ్రెస్, టీడీపీలను కేసీఆర్ భయపెట్టగలిగారు. ఆ పార్టీలను తనదారిలోకి తెచ్చుకోగలిగారు. అంతవరకు ఉన్న రాజకీయ ఉద్యమం, ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితులు ఏర్పడడం కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి, తదితరులకు భిన్నంగా కేసీఆర్ పనిచేసిన మాట నిజం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికే కట్టుబడి రాజకీయం చేశారు. నిజానికి ఇదంతా గతం. ఇప్పుడు ఆ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలనే అని చెప్పడంలో హేతుబద్దత ఎంత ఉందన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, పొన్నం, సీతక్కలు ప్రశ్నించారు.అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తారు. అదే పని కేసీఆర్ చేశారు. బీజేపీపై మాత్రం నామమాత్రపు విమర్శలు చేశారనే చెప్పాలి. అంత భారీ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడటం కూడా విశేషమే. సాధారణంగా ఇలాంటి సభలలో నాయకుడు వచ్చేలోగా పలువురు నేతలు మాట్లాడుతుంటారు. ఈసారి అలా చేయలేదు. కాకపోతే పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు అయిన కేటీఆర్ ప్రాముఖ్యతను మరింత పెరిగేలా ఈ సభలలో జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. సభా వేదికపై కూడా కేసీఆర్‌తోపాటు ఆయన ఫోటో కూడా ఉంచారు. కేసీఆర్ తన స్పీచ్‌ను మరీ ఎక్కువ సేపు చేయలేదు. అంతేగాక.. పరుష పదాలతో కాంగ్రెస్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే యత్నం కూడా చేసినట్లు అనిపించదు. కాంగ్రెస్ పాలనపై గట్టి విమర్శలే చేస్తూ, ప్రధానంగా తెలంగాణ ఆగమైందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రైతులు పాట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించి వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రస్తావించకుండా ప్రసంగించడం కూడా చెప్పుకోదగిన అంశమే.కాంగ్రెస్ పార్టీ హామీలపై బాండ్లు రాసిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొన్ని వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చారు. తన పాలన గురించి చెబుతూ ప్రత్యేకించి రాష్ట్రంలో నీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించడంలో నెంబర్ వన్‌గా ఉన్నామని, భూముల విలువలు పెరగడానికి దోహదపడ్డామని, రైతుబంధును అమలు చేయడం ద్వారా రైతులకు మేలు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, పోలీసులకు రాజకీయాలు వద్దని ఆయన సూచించారు. ఆయా సందర్భాలలో సభలోని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న ఆరోపణలు, అధిక అప్పుల భారం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల జోలికి వెళ్లలేదు.కేసీఆర్ స్పీచ్ ముగిసిన వెంటనే మంత్రులు గట్టిగానే జవాబు ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయన చేసిన విమర్శలపై చర్చకు సిద్దమని అన్నారు. పొన్నం ప్రభాకర్ అయితే గ్రీన్‌మ్యాట్ వేసి ప్రజలు అధికంగా వచ్చినట్లు చూపే యత్నం జరిగిందని ఆరోపించారు. కాకపోతే గతంలో మాదిరి కాకుండా, ఇప్పుడు కనుచూపు మేర కుర్చీలు వేశారు. రాజకీయ సభల నిర్వహణలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏ పార్టీ సభ జరిగినా, గతంలో ఒకటి, రెండు బ్లాక్‌లు తప్ప, అంతా కిందే కూర్చునేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌పై విమర్శలు చేసిన మంత్రులలో పొంగులేటి, జూపల్లి గతంలో బీఆర్ఎస్ ప్రముఖులు. గత ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలిచారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకంటే చిన్నవాడు కావడం, కొందరు మంత్రులు గతంలో తన వద్ద పని చేసినవారు కావడం తదితర కారణాల వల్ల బహుశా ఆయన ఈగో సమస్య ఎదుర్కొంటున్నారని అది కేసీఆర్ స్పీచ్‌లో కనిపించిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. ఓవరాల్‌గా పరిశీలిస్తే రజతోత్సవ సభకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగానే ఉంది. కానీ, ఇదే వరంగల్‌లో ఉద్యమ సమయంలో ఇంతకన్నా భారీ బహిరంగ సభలే జరిగాయి. అయినా భారీ సభలే అన్నిటికి కొలమానం కావు. కాకపోతే జనంలో పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని పెంచడానికి రజతోత్సవ సభ కొంతమేర అవకాశం కలిగిస్తుంది. కేసీఆర్ ఒక్కరే మాట్లాడడం వల్ల ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కేసీఆర్ పూర్వపు స్పీచ్‌ల మాదిరి మరీ ఘాటుగా మాట్లాడలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదేమీ తప్పు కాదు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉన్నప్పటికీ, ఈ సభ ద్వారా తాను మళ్లీ బయటకు వచ్చి జనంలో తిరుగుతానని కేసీఆర్ చెబుతున్నారు. ఇప్పటికీ కేసీఆర్ గ్లామర్ పైనే బీఆర్ఎస్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇది కీలకం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దోచుకున్న డబ్బుతో కేసీఆర్ సభ
నల్లగొండ: పదేళ్లు దోచుకున్న డబ్బుతో బీఆర్ఎస్.. వరంగల్‌లో సభ నిర్వహించిందని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫ్టులకు, కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించారని ధ్వజమెత్తారు. రైతులను ప్రోత్సహిస్తున్నాం.. రాష్ట్రంలో ఏడాది కాలంలో 2.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని.. సన్నాలకు బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. దేశంలో పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అలాగే అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వడంలో బీఆర్ఎస్ విఫలమవగా తాము అర్హులందరికీ కార్డులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పగించారని.. 512 టీఎంసీలు ఏపీ తీసుకుంటే, తెలంగాణకు 299 టీఎంసీలే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. కానీ తామిప్పుడు 500 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలని కొట్లాడుతున్నామని చెప్పారు. తమ పాలనలోనే ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నాడు సోనియా కాళ్లు మొక్కి.. నేడు కాంగ్రెస్ విలన్ అంటావా: కోమటిరెడ్డి తెలంగాణ ఇచ్చిన తల్లి అంటూ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్ నేడు కాంగ్రెస్ పారీ్టనే విలన్ అనడం ఎంత వరకు సమంజసమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేడు అదే నోటితో కాంగ్రెస్‌ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితుడిని సీఎం చేస్తాన ని చెప్పి కేసీఆర్ మాటమార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అవినీతి డబ్బుతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఉత్తమ్, వెంకట్రెడ్డిలది సీఎం స్థాయి: రాజగోపాల్‌రెడ్డి కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. పదేళ్లు ఆయన ఏం చేశారో సమాధానం చెబుతామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నవారన్నారు. కోమటిరెడ్డి పదవు ల కోసం పాకులాడలేదని.. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. -
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయనలో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రిని అయిన రోజునే కేసీఆర్ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే ఏడాది కాలం సరిపోయిందని, ఇప్పుడంతా స్ట్రీమ్‌లైన్ (క్రమబద్ధీకరణ) చేస్తున్నామని చెప్పారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. బీఆర్ఎస్ సభ, మావోయిస్టుల సమస్య, కేసీఆర్ పాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాహుల్‌గాందీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై మాట్లాడారు. ఎవరో అడుగుతున్నారని అరెస్టులు ఉండవు ‘కేసీఆర్ ప్రసంగంలో పస లేదు. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ కంటే నేను గజ్వేల్‌లో పెట్టిన సభే హైలైట్. ఖమ్మంలో జరిగిన రాహుల్‌గాంధీ సభకు బీఆర్ఎస్ హయాంలో కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. కానీ మేం బీఆర్ఎస్ నేతలు అడిగినన్ని బస్సులు ఇచ్చాం. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. హరీశ్, కేటీఆర్‌లు చిన్నపిల్లలని నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్నే కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చెప్పాడు. మరి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? కేసీఆర్, మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లా డుతుంటారు. కేసీఆర్ తరహాలో నేను చట్టాన్ని అతిక్రమించి పనిచేయను. ఎవరో అడుగుతున్నా రని అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది లేదు. చట్టప్రకారమే అన్నీ జరుగుతాయి..’ ముఖ్యమంత్రి అన్నారు. ఏ పథకమైనా అర్హులందరికీ లబ్ధి చేకూరాలి ‘కేసీఆర్ తరహాలో లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నేను పెట్టలేను. షోపుటప్ స్కీంలు నాతో కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులందరికీ లబ్ధి కలిగేంతవరకు పనిచేస్తా. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఇప్పటివరకు ప్లానింగ్‌కే సమయం సరిపోయింది. ఇక నుంచి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల గ్రౌండింగ్ చేస్తాం. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడంలో కూడా మేము వెనుకబడ్డాం. ఏడాదిన్నరలోనే ఎన్నో పథకాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం. మేము అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. బీఆర్ఎస్ తరహాలో మాకు కూడా తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తారు. వాస్తవానికి నా పాలన, పథకాల అమలుపై ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది..’ అని రేవంత్ చెప్పారు. రాహుల్‌తో మంచి సంబంధాలున్నాయి ‘రాహుల్‌గాంధీతో నా స్నేహం గురించి నాకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో చెబితే వినాల్సిన పనిలేదు. ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి గురించి బయటి వారు ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన రాజకీయ యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది. వేరే ఆప్షన్ లేకే ఆ అధికారుల కొనసాగింపు పాలన అవసరాలను బట్టి అధికారులను వినియోగించుకుంటాం. కొందరు అధికారుల గురించి అన్ని విషయాలు తెలిసినా వేరే ఆప్షన్ లేకపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉంది కనుకనే మారుçస్తున్నాం. సీపీఐ, ఎంఐఎంకు అండగా ఉన్నా.. నేను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మర్చిపోను. నన్ను నమ్మిన సీపీఐకి, ఎంఐఎంకు అండగా ఉన్నా. అద్దంకి దయాకర్‌కు పదవి ఇప్పించగలిగా. దయాకర్ ఓపికతో ఉన్న కారణంగానే పదవి వచ్చింది. ఓపికతో ఉంటేనే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. అలా కాదని బయటకు వచ్చి స్లీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం తగ్గించినట్టే అవుతుంది. పదవి ఇవ్వలేని పరిస్థితికి, వారి మాటలకు చెల్లుకు చెల్లు అయినట్టు నేను ఫీల్ అవుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు హైదరాబాద్ వదిలి వెళ్లలేకపోతున్నారు. మీడియా చుట్టూ తిరిగేందుకే పరిమితం అవుతున్నారు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మావోయిస్టులపై పార్టీ నిర్ణయమే ఫైనల్ ‘ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మావోయిస్టుల విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం..’ అని రేవంత్ తెలిపారు. జానా నివాసంలో ‘కగార్’పై చర్చలు లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమానికి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆపరేషన్ కగార్ గురించి చర్చించారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి శాంతి చర్చల కమిటీ ఆదివారం తనతో సమావేశం కావడాన్ని, తాను చొరవ తీసుకుని కేంద్రాన్ని శాంతి చర్చలకు ఒప్పించేలా చూడాలని వారు కోరిన విషయాన్ని తెలియజేశారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా, కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనలపై ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. అక్కడి నుంచే ఏఐసీసీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలతో సీఎం మాట్లాడారని సమాచారం. కాగా శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు. -
‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు వస్తారా?’
హైదరాబాద్: తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని బీజేఎప్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్టని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా? అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎల్కతుర్తి సభలో సెటైర్లు వేశారు మహేశ్వర్ రెడ్డి. కొండంత రాగం తీసి.. దిక్కుమాలని పాట పాడినట్లు ఉంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఎద్దేవా చేశారు.‘తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని నిందించారు. బీబీ నగర్ లో ఎయిమ్స్ ఎవరిచ్చారు?, కేసీఆర్ పదేళ్లపాటు మావోయిస్టులను చర్చలకు ఎందుకు పిలవలేదు. అధికారం పోయాక మావోయిస్టులు గుర్తుకు వచ్చారా?, మావోయిస్టులను వెనకేసుకురావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చర్చలు జరిపినప్పుడు ఏమైంది?, మావోయిస్టులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు’ అని ధ్వజమెత్తారు.కేసీఆర్ పగటి కలలు కంటున్నారు..మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంస పాలన.. ఫెయీల్యూర్ పాలన.. కుటుంబ పాలన. కుటుంబ పాలనకు కాలం చెల్లింది. తెలంగాణకు అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టారు. కాళేశ్వరం కట్టి తెలంగాణ ప్రజల మీద భారం మోపారు. మొసలీ కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. -
‘కేసీఆర్.. మేం అనుకుంటే మీ కంటే డబుల్ మీటింగ్ పెడతాం’
నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి. నల్లగొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అంటున్నాడు. సోనియా గాంధీ కాలు మొక్కాడు కేసీఆర్. కేసీఆర్ నీది నోరా.. మోరీనా?, తెలంగాణను మొత్తం దోచుకుతిన్నారు. దళితుడిని సీఎం చేస్తానని , మూడెకరాలు ఇస్తానని మోసం చేయలేదా ?, కేసీఆర్.. మేం అనుకుంటే నల్గగొండలో నీకంటే డబుల్ మీటింగ్ పెడతాం. ధరణితో ఏం మోసాలు చేశారో అన్నీ బయటపడతాయి’ అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.తెలంగాణ.. బీఆర్ఎస్ సొంతం కాదుఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ సొంతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. ‘వందల కోట్ల అవినీతి సొమ్ముతో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి సీఎం స్థాయి నాయకులు. ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు. నిన్ను ఫాంహౌస్ కు ఎందుకు పరిమితం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. దమ్ముంటే రా.మీరు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఎలా దోచుకున్నారో లెక్కలు చెప్తున్నాం. వెయ్యి జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పదేళ్లలో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలో రైతులకు మేలు జరగలేదు. బీఆర్ఎస్ ఆగం చేసిన తెలంగాణను కాంగ్రెస్ గాడిలో పెడుతోంది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మంచి జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కాదు. తెలంగాణ కోసం కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు. నిన్నా మొన్న రాజకీయాల్లోకి వచ్చినోళ్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. -
‘కేసీఆర్, చంద్రబాబు నా దగ్గర పని చేశారు’
హైదరాబాద్: ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హెచ్(వి హనుమంతరావు) విమర్శలు గుప్పించారు. అది బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్ మీటింగే కానీ, అంతకు మించి ఏమీ లేదన్నారు. పార్టీలో ఉన్న వాళ్లు వెళ్లిపోతారేమో అని భయపడి సభ పెట్టారని, కేసీఆర్ డిక్టేటర్ పాలన చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేశారని వీహెచ్ మండిపడ్డారు.‘తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా?, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రజలు కేసీఆర్ ని తిరస్కరించారు. ప్రగతి భవన్, సెక్రటరియేట్ కట్టాలనే మంచి ఆలోచన కేసీఆర్ కు వచ్చింది. . కానీ ప్రజలను ఎవ్వరినీ అక్కడికి రానివ్వలేదు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మహారాష్ట్ర వెళ్లి కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు. హర్యానా, పంజాబ్ వెళ్లి డబ్బులు పంచి వచ్చారు కేసీఆర్. మీర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇలా కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేశారు’ అని వీహెచ్ ఆరోపించారు. ఇక యూత్ కాంగ్రెస్ లో కేసీఆర్, చంద్రబాబులు తన దగ్గర పని చేసిన వారేనంటూ వీహెచ్ స్పష్టం చేశారు. అయితే వాళ్లకు అవకాశం వచ్చింది.. తనకు రాలేదని కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు వీహెచ్. -
చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని, చివరి ఆరు నెలల్లోనే వీటిపై కచ్చితంగా చర్చ జరుగుతుందని అన్నారాయన. సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సహా పలు అంశాలపై స్పందించారు.ఎల్కతుర్తి సభలో కేసీఆర్(KCR) తన అక్కసు మొత్తం గక్కారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిల్లగాళ్లు అని ఆయన అన్నారు. మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు?. గతంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వని చరిత్ర వాళ్లది. కానీ, బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని మమ్మల్ని అడిగారు. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వమని చెప్పా. ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే.. వద్దంటామా?. .. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అనేక పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. నేను కమిట్మెంట్తో పనిచేస్తున్నా. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఇప్పించా. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం. వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ చెప్పింది చేస్తాడు అని ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తాం. అంతేగానీ.. కేసీఆర్ మాదిరి లాంచింగ్ క్లోజింగ్ పనులు చేయను. చిట్‌ఛాట్‌లో ఇంకా..ఆపరేషన్ కగార్(Operation Kagar) అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే. ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం.ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు. ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈ విషయంలో ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. చివరి ఆరు నెలలు వీటిపై చర్చ జరుగుతోంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేదెలా?. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదు. కానీ, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైం పాస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే లు నియోజకవర్గాల్లో ఉండాలి.. అవసరం అయితేనే హైదరాబాద్ రావాలి -
బాధ్యతగా పాలించాం.. అద్భుతమైన పనులు చేశాం
‘60 ఏళ్ల సమైక్య పాలనలో ఎంతో వేదన, హింస, అణిచివేత చూశాం. గోదావరి, కష్ణా నీళ్లు దక్కకకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోదించారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్రం కల కూడా నెరవేరింది. తర్వాత ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. మనం అధికారం అనుభవించేందుకు తీసుకోలేదు. బాధ్యతగా తీసుకున్నాం. రాష్ట్రాన్ని మన చేతుల్లో పెడితే పదేళ్లలో ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకుని పోయాం.ఎన్ని రంగాల్లో ఎన్ని అవార్డులు వచ్చాయి. ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపించాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఎగతాళి చేయబడ్డ ప్రాంతం. పనికిమాలిన ప్రాంతం అని పేరుపెట్టబడిన ప్రాంతం. అలాంటిది రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3.50 లక్షలకు పెంచుకున్నాం. జీఎస్డీపీని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాం. బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం..’ అని కేసీఆర్ సభా వేదికగా గుర్తుచేశారు. పథకాలు కావాలని ఎవరూ అడగలేదు ‘రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడగలేదు. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను ఆగమేఘాలపై పని చేసి పూర్తి చేయించాం. పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకున్నాం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకుని పోయాం. వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీస మద్దతు ధర వచ్చేలా .. తడిసినా, రంగు పోయినా, మొలక వచ్చినా.. రైతులు మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్‌కు రూ.5 వేల కోట్ల నష్టం వచ్చినా ధాన్యం కొన్నాం..బాధ పడలేదు. వరంగల్ గడ్డ కోసం పెండింగ్‌లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ గడ్డకు నీరు తెచ్చుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం..’ అని మాజీ సీఎం చెప్పారు. రైతాంగాన్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నా.. పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండించాం. రైతు కష్టం ఏంటో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును కాబటే రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నా. ఈ దేశంలో షేర్సా సూరీ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చారు. చరిత్ర పొడుగూతా చూస్తే.. షేర్సా సూరీ నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా.. రైతుల వద్ద రకరకాల శిస్తులు వసూలు చేశాయి. రైతుల వద్ద డబ్బులు, తహసీల్, నీటి తీరువాలు వసూలు చేశారు కానీ.. రైతును చూడాలని ఎవరూ అనుకోలేదు.జై కిసాన్.. జై జవాన్ అన్నరు తప్ప పట్టించుకోలేదు. కానీ నన్ను ఎవరూ అడగలేదు. ఎన్నికల్లోనూ చెప్పలేదు. నాకు నేనుగా ఆలోచించి.. రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాను. బ్రహ్మాండంగా అమలు చేశాం. బ్యాంకుల్లో డబ్బులు పడి రైతుల సెల్ఫోన్లు మోగుతుండే. రైతాంగానికి ఎటువంటి కరెంటు ఇచ్చాం? ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడారు? తెలంగాణ వస్తే కారు చీకట్లు అయితయ్ అని చెబితే.. వాళ్ల నోర్లు మూయించేలా నాణ్యమైన కరెంటును 24 గంటలు సరఫరా చేశాం. పొలాల కాడ బోర్లు దుంకినయ్.. రైతులు ఇంట్ల కూసుంటే.. పొలాల కాడ బోర్లు దుంకినయ్. మూడెకరాలున్న రైతులకు ఏముంటది ఆదాయం? బీఆర్ఎస్ రాక ముందు వారు చనిపోతే పట్టించుకున్న నాథుడు లేడు. బీఆర్ఎస్ వచ్చాక రైతుబీమా ఇచ్చి 8 రోజుల్లోనే కుటుంబాలకు బీమా అందేలా చర్యలు తీసుకున్నాం. 7500 కేంద్రాల్లో వడ్లు కొని మూడునాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశాం. మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. ఇంటింటా నల్లా పెట్టి ప్రజలకు మంచినీరు అందించాం. చెరువుల్లో చేపలు పెంచాలని నన్ను ఎవరు అడిగారు ? మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువుల్లో చేపలు పెంచాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ధర్నా చేయలేదు. ఎవరూ అడగలేదు. ప్రభుత్వమే వారికి బ్రహ్మాండంగా చేసింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చింది..’ అని కేసీఆర్ వివరించారు. నేను చెప్పినవన్నీ మీ కళ్లెదుట జరిగినవే.. ‘పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాం. పెట్టుబడులు ఆకర్షించాం. సుమారు 20–25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాం. రూ.40 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచగలిగాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. వెయ్యికి పైగా గురుకులాలు తీసుకువచ్చాం. తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. 33 కాలేజీలకు పెంచాం. బీఆర్ఎస్ హయాంలో మత కల్లోలం లేదు. కర్ఫ్యూ లేదు.. కల్లోలం లేదు. శాంతిభద్రతలన్నీ బ్రహ్మాండంగా కాపాడి.. ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ నా డైలాగులు కాదు, స్టోరీలు కాదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయాలు. ఆర్బీఐ, కాగ్ వెల్లడించిన అధికారిక లెక్కలే. మీ కండ్ల ముందర జరిగినవే..’ అని మాజీ సీఎం పేర్కొన్నారు. పోలీసులెందుకు దుంకులాడుతున్నరు? లక్షన్నర మందిని రోడ్లపైనే లారీలు అడ్డుపెట్టి ఆపిన్రు. ఇన్ని అడ్డంకులా? ఈ ప్రభంజనాన్ని ఎట్ల ఆపుతారు? పోలీసులను అడుగుతున్న. మీరెందుకు దుంకులాడుతున్నరు? సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సైనికులు ప్రశి్నస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు. డైరీల్లో రాసిపెట్టుకోండి... మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దాన్ని ఆపడం ఎవడి తరం కాదు. ఎవడి వశం కాదు. సోషల్ మీడియా వారియర్స్‌ను కాపాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది. నేను కూడా ఊర్కోను. బయలుదేరుత. కమీషన్లు తీసుకుంటున్నారని కేటీఆర్ అసెంబ్లీలో చెపితే భుజాలు తడుముకున్నరు. తప్పు చేయనప్పుడు ఆర్థిక మంత్రి ఎందుకు ఉలిక్కి పడుతున్నరు? కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా అంటున్నరు. మా సభ్యులు అడిగితేనే సమాధానం చెపుతలేరు. బీజేపీతో మనకు వచ్చేది లేదు బీజేపీ 11 ఏళ్లుగా రాజ్యం చేస్తోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి లేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. బీజేపీతో మనకు వచ్చేది లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను ఊచకోత కోస్తున్నారు. బలం ఉంది కదా అని చంపుడేనా? నక్సలైట్లు చర్చలు జరుపుతం అంటున్నరు. చర్చలు జరపండి. దీనిపై ఢిల్లీకి ఉత్తరం పంపిద్దాం..’ అని కేసీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పెడితే, నేను అధికారంలోకి’ వచ్చిన తరువాత అధికారులను పిలిచి అడిగిన. ఆ పథకం మంచిదని చెప్పడంతో పేరు కూడా మార్చకుండా కొనసాగించిన. అసెంబ్లీలో చెప్పిన.. రాజశేఖరరెడ్డి తెచ్చిన మంచి పథకం అదని. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పథకాలను నిర్విర్యం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడగలేదు. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశాం. చెరువుల్లో చేపలు పెంచాలని నన్ను ఎవరు అడిగారు ? మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువుల్లో చేపలు పెంచాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ధర్నా చేయలేదు. ఎవరూ అడగలేదు. ప్రభుత్వమే వారికి బ్రహ్మాండంగా చేసింది.పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాం. పెట్టుబడులు ఆకర్షించాం. సుమారు 20–25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాం. రూ.40 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచగలిగాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. వెయ్యికి పైగా గురుకులాలు తీసుకువచ్చాం. తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. 33 కాలేజీలకు పెంచాం. సైడ్‌లైట్స్⇒ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర ముఖ్య నేతలంతా సాయంత్రం 4:30 గంటలకు సభావేదికపైకి చేరుకున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గాయకుల పాటలకు మాస్ స్టెప్పులతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.⇒ ‘ఉక్కు గుండెను ఒక్కసారన్నా తాకాలని ఉన్నది.. ఆ బక్క పలచని పెయ్యిని హత్తుకోవాలని ఉన్నది’ అనే పాటకు కవిత సహా సభా వేదికపై ఉన్న నేతలు సెల్ఫోన్లలో టార్చ్‌లైట్ ఆన్ చేసి ఊపడంతో సభికులు కూడా తమ సెల్ఫోన్లలో టార్చ్ ఆన్ చేసి చేతులతో పైకెత్తి ఊపారు. ⇒ సాయంత్రం 5:48 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చిన హెలికాప్టర్ సభా ప్రాంగణంలో ల్యాండ్ అయ్యింది.⇒ దాదాపు గంట తర్వాత 6:51 గంటలకు కేసీఆర్ సభావేదికపైకి చేరుకొని ప్రజలకు అభివాదం చేశారు. ⇒ ముందుగా పహల్గాం ఉగ్ర దాడి మృతుల కు నిమిషంపాటు సంతాపం తెలిపారు.⇒ కేసీఆర్ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా సీఎం, సీఎం అంటూ సభికుల నుంచి పలుమార్లు నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్ జర ఆగండి అంటూ సుతిమెత్తగా మందలించారు. ⇒ కాంగ్రెస్ ఏయే అంశాల్లో విఫలమైందో చెబుతూనే ప్రజల నుంచి చెప్పించే ప్రయత్నం చేశారు. ⇒ రాత్రి 7 గంటలకు మొదలైన కేసీఆర్ ప్రసంగం 7:59 గంటలకు ముగిసింది. ⇒ చివరగా ‘ఇక మీ లొల్లి షురూ చేయండి’ అని కేసీఆర్ అనడంతో సభికులు సీఎం, సీఎం అంటూ నినదించారు. ఇంకోవైపు బాణాసంచా మోత మోగించారు. – సాక్షి, వరంగల్ -
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఇవాళ అప్పు పుడత లేదని మాట్లాడుతుండ్రు. నా మనసు కాలుతోంది. బాధ పడుతోంది.దుఃఖం వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె.. ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్మాల్ దింపుట్ల,అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు, ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నరు. ఓట్లెప్పుడు వస్తయా అని చూస్తున్నరు.ఎల్కతుర్తి నుంచి సాక్షి ప్రతినిధి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా చేసుకుంటే, ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని, అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. మా అంత సిపాయిలు లేరు..కేసీఆర్‌కు మించి ఇస్తాం.. ఆరు చందమామలు తెచ్చి ఇస్తాం.. ఏడు సూర్యుళ్లు పెడతాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి ఏమీ చేయలేదని, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు. రైతుబంధు లాంటి పథకాలు కావాలని తననెవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రజలే వీపులు సాపు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్ వన్ విలన్ అని అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఇక తాను బయటకు వస్తానని ప్రకటించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. బుక్కులు పంచిండ్రు.. బాండ్లు రాసిచ్చిండ్రు హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరూరా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్నాయన జబ్బలు చరిచాడు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టారు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాలు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎంత మంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన్రు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నరు. ఊ అంటే ఆ అంటే అబద్ధాలు చెబుతున్నారు. నమ్మి బోల్తా పడ్డం..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అప్పుడెంత బాగుండె.. ఇప్పుడెట్లయింది? ‘ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు ఓ రైతు అలుకుతున్నడు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. పెద్ద మొగోడు అని ఒకర్ని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట. అట్లనే మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చి ఇస్తాం అన్నరు. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందిని అడుగుతున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? ఎంత వరకు ఇది కరెక్ట్..? తెలంగాణను బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత బాగుండె. ఇప్పుడెట్లయింది? నా మనసు కాలుతుంది. బాధయితంది. దుఃఖం వస్తోంది. కేసీఆర్ పక్కన పోంగనే ఇంత ఆగమయితదా? ఎందుకు ప్రజల గోస పోసుకుంటున్నరు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండె. కొనేటోళ్లు ఎక్కువుండె. అమ్మేటోళ్లు తక్కువుండే. నేను 24 గంటలు కరెంటు ఇయ్యలేదా? ఇప్పుడు ఎందుకు ఇయ్య శాతనయిత లేదు? మళ్లీ తెల్లందాక కరెంటు పెట్టడానికి పోవాల్నా..? మంచినీళ్లు కూడా ఇయ్య శాతనయితలేదు. కానీ మేం ఇంత సిపాయిలం, అంత సిపాయిలం అంటున్నరు..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.ఎన్నెన్ని చెప్పిరి.. ఏమన్నా చేసిన్రా? ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె..ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాం«దీలు, డూప్లికేట్ గాం«దీలు ఢిల్లీకెళ్లి దిగిరి. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేసిన్రు. కేసీఆర్ రైతుబంధు కింద ఏం ఇస్తుండు..రూ.10 వేలు ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తమని చెప్పిన్రు. పెన్షన్లు రూ.2 వేలు ఇస్తుండు మేం వస్తే రూ.4 వేలు ఇస్తమని చెప్పిరి. ఇద్దరు ఉంటే కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమనిరి. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తుండు.. మేం రూ.6 వేలు ఇస్తమన్నరు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నరు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తమని చెప్పిరి. ఇక ఒకరెనుక ఒకరు ఉరికి.. రూ.2 లక్షల లోన్ తెచ్చుకోండి.. డిసెంబర్ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తం అన్నరు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చిన్రు. ఏమన్నా చేసిన్రా .. ఏం చేయలేదు. మాట్లాడితే బీఆర్ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు.తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చారు ‘ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. 2001 నుంచి గులాబీ పార్టీ పెట్టి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తమని నమ్మబలికిన్రు. మళ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన్రు. 14 సంవత్సరాలు ఏడిపించిన్రు. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన్రు. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సుడి గాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన్రు..’ అని మాజీ సీఎం గుర్తు చేశారు. -
డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు. ‘మీరు డేట్ ఫిక్స్ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలన్ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తామేదో బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ అడ్డుకొని ఉంటే బీఆర్ఎస్ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ లేదన్నారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్ డేట్‌ఫిక్స్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలను సవాల్ చేశారు. అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే లేకుంటే కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు. -
మా వాళ్లు కరెక్ట్‌గా లేకే అధికారంలోకి రాలేదు: రాజాసింగ్
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో భాగంగా మాట్లాడిన రాజాసింగ్.. ‘ సభలో కేసీఆర్ ఆడిన ప్రతి మాట అబద్ధం. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయిలు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది. కేసీఆర్ ఫాంహౌస్ లో మంచిగా ఉన్నారు. మీరు అక్కడ ఉంటేనే మంచిది.కేసీఆర్ రాష్ట్రాన్ని మత్తుగా మార్చారు. తెలంగాణ అంటే బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే జరుగుతుంది’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్ -
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?: కేసీఆర్‌కు మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని ప్రసంగించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తిలో కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పుల అంశాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదంటూ పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను కేసీఆర్ విలన్లా చూపిస్తూ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.‘‘కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఎప్పుడూ రాలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్లు మొక్కిన విషయం గుర్తుకు లేదా?. దొరపాలన చేసింది మీరు కాదా?. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది. వరి వస్తే ఉరి అన్నది మీరు కాదా?. సర్పంచ్‌లకు బకాయిలు పెట్టింది మీరు కాదా?’’ అంటూ పొంగులేటి ప్రశ్నాస్త్రాలు సంధించారు.‘‘అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ పదేళ్లలో కలిపి లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేదు. మేం నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా? మంత్రి సీతక్కఒక నియంత అధికారని కోల్పోయి మాట్లాడినట్లు ఉంది కేసీఆర్ స్పీచ్. నీ కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించింది. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా?. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదు. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయావు. ధర్నా చౌక్‌లలో కేసీఆర్ ధర్నాలు కూడా చేయనీయలేదు. కేసీఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు. అసెంబ్లీని సొల్లు కబురు అని కేసీఆర్ అవమానించారు. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా?. అసెంబ్లీ సొల్లు కబురు అయితే నీ కొడుకు, నీ అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు?‘విలన్’ వ్యాఖ్యలు కేసీఆర్ ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ విలన్ అంటూ చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం నెట్టడం సరైనది కాదు. అగ్గిపెట్ట రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నీవాళ్లు అర్పించారా?. కేసీఆర్ సభకు జనం రాకపోవడం వల్లే... అర్థగంటసేపు ఆయన ప్రాంగణానికి వచ్చి కూడా వేదిక పైకి రాలేదు. -
కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని.. ఏడాదిన్నర పాలనలో ఏం చేశారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిలదీశారు. సంచులు నింపుడు.. మోయడంలోనే కాంగ్రెస్ పాస్ అయ్యిందంటూ మండిపడ్డారు. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని.. 25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం.. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.. అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించామని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే‘‘తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు.. పెదవులు మూశారు. బీఆర్ఎస్ నేతలు పదవులను త్యాగం చేశారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే. ప్రజలు ప్రాణం పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం. బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది’’ అని కేసీఆర్ గుర్తు చేశారు.డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు..‘‘పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం. తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం. మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం. పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం. పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. గోల్మాల్ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు. మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు..‘‘కల్యాణ లక్ష్మికి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు. ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేవారు.ఇక నుంచి నేను కూడా ఊరుకోను..యూనివర్శిటీ భూములను ఎవరైనా అమ్ముతారా?. కేసీఆర్ కిట్స్‌ను ఎందుకు బంద్ చేశారు? ఎవరైనా వాటిని ఆపుతారా?. ఇవాళ హైదరాబాద్ యూనివర్శిటీ రేపు ఉస్మానియా యూనివర్శిటీ అమ్మేస్తారు. వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీని కొనసాగించాలని చెప్పాను. ఆరోగ్యశ్రీ పథకం మంచిది.. కొనసాగించాలని నేను సీఎం అయ్యాక చెప్పాను. ఇప్పుడున్న సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఇక నుంచి నేను కూడా ఊరుకోను. ఎక్కడ ఎవరు బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో పోరాడదాం. కమీషన్లు అడుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ సోది కబుర్లు వినడానికి నేను అసెంబ్లీకి రావాలా?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి..ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. మావోయిస్టులను ఏరిపారేస్తామనడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలి. తెలంగాణను మళ్లీ అద్భుతంగా చేసుకుందాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్ సంగతేంటో ప్రజలే తేలుస్తారు. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చేస్తున్నారు. పోలీసులు డైరీల్లో రాసుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ రాకుండా ఎవరు కూడా ఆపలేరు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. మీ డ్యూటీ మీరు చేయండి’’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. -
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేసీఆర్
కేసీఆర్ ప్రసంగం:👉ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను👉25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం👉ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం👉అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించాం👉తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా👉ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు.. పెదవులు మూశారు👉బీఆర్ఎస్ నేతలు పదవులను త్యాగం చేశారు👉ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్👉ప్రజలు ప్రాణం పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం👉బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సేకాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం..👉నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది👉పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం👉తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం👉మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం👉మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం👉పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం👉పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం👉రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం👉కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఏం చేశారు?👉గోల్మాల్ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు👉మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు👉ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు👉కల్యాణ లక్ష్మికి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు👉పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?👉ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు👉లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు.👉మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు👉ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు👉మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు👉తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు👉తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు👉హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారుపహల్గామ్ మృతులకు నివాళులర్పించిన కేసీఆర్👉ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన కేసీఆర్👉పహల్గాం మృతులకు సంతాపం👉మౌనం పాటించి సంతాపం తెలిపిన సభ👉పహల్గామ్ మృతులకు నివాళులర్పించిన కేసీఆర్ఎల్కతుర్తికి చేరుకున్న కేసీఆర్👉కాసేపట్లో సభా ప్రాంగణానికి కేసీఆర్‌సభ ఏర్పాట్లు ఇలా..👉కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ👉బీఆర్ఎస్ కటౌట్లు,ఫ్లెక్సీలతో వరంగల్ ఎల్కతుర్తి గులాబీమయం👉సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు👉మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు👉 ప్రధాన వేదికపై సీటింగ్: 500 మందికి 👉వాహనాల పార్కింగ్ : 1,059 ఎకరాలు 👉సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్ బాటిళ్లు: 10.80 లక్షలు👉మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు 👉సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు👉మెడికల్ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం👉ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జాం👉వరంగల్ ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం👉ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.👉రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం👉ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.👉తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి.👉14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పారీ్టగా ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.👉సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్ పారీ్టయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది.👉అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.👉2024 మార్చి 31న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.👉రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.👉సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పారీ్టవర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు. -
పాతికేళ్లుగా కేసీఆర్ వెంటే ఉన్నా..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, పేద ప్రజలకు సంక్షేమాన్ని పంచిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్పార్టీ పాతికేళ్ల పండుగ సందర్భంగా శనివారం ఆయన ‘సాక్షి’తో తన ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు. ⇒ ప్రజలు ఒక్కసారి చేసే పొరపాటుతో కాంగ్రెస్‌ను ఐదేళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొం ది. దీంతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కేసిఆర్ అని, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా మరోసారి రుజువు కానుంది. ⇒రెండున్నర దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో పదవుల కంటే తెలంగాణ రాష్ట్ర సాధన కల సంతృప్తి ఇచి్చంది. హైదరాబాద్ పాతబస్తీ నుంచి పాతికేళ్లుగా కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం కంటే ముందు పత్రికలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం రాబోతున్నట్లు చదివి వెంటనే ఆయన ఇంటికి వెళ్లి కలిశా..⇒హైదరాబాదీ ముస్లిం – తెలంగాణ ఉద్యమంలో ఎలా కలిసివస్తావని పలువురు ప్రశి్నంచారు. అప్పుడు నేను విద్యార్ధి దశలోనే 1969 తెలంగాణ ఉద్యమ్యంలో కీలక పాత్ర పోషించా. ఆ తర్వాత ఉద్యమం చల్లారడం కుటుంబ వ్యాపారంలో నిమగ్నమయ్యా. ⇒తెలంగాణ వస్తే ఆంధ్ర పాలకుల పెత్తనం పోయి మా నీళ్లు. మా విద్యుత్, మా ఉద్యోగాలు మాకు వర్తిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశా. అప్పుడు నన్ను పై ఫ్లోర్‌కు తీసుకేళ్లి నా పేరు అడిగి మహమూద్ భాయి.. మాతో జత కలవండి ...కోట్లాది తెలంగాణ సాధిద్దామని చెప్పి భరోసా ఇచ్చాÆరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పిలుపు.. ⇒ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక తండ్రిగా కేసీఆర్ ను గౌరవిస్తూ వ్యూహాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నా. పార్టీ ఆవిర్భావం నుంచి తన నివాసంలోని అఫీస్‌లో కేసీఆర్‌కు ప్రత్యేక చాంబర్, కుర్చీ ఉందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పారీ్టలో జీవిత కాలం రెండో సభ్యత్వం నాదే.. ⇒ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తుంటే తన తల్లి, సతీమణి మినహా బంధువులు, మిత్రులు, తోటి వ్యాపారులందరూ ఉద్యమం పేరుతో తూటాలు, లాఠీ దెబ్బలు ఎందుకు తింటావు... ప్రశాంతంగా వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ⇒ కానీ, తెలంగాణ సాధన కల లక్ష్యంతో ముందుకు సాగితే.. ప్రత్యేక రాష్ట్ర సాకారంతో పాటు ఊహించని విధంగా డిప్యూటీ సీఎం,హోం మంత్రి లాంటి కీలక పదవులు నిర్వహించే భాగ్యం కలిగింది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడికి బయలుదేరినా.. ఆయన చేతికి ఇమామ్–ఎ–జామీన్ కడుతున్నా.⇒ఒక సారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1000 కార్ల ర్యాలీ బయలు దేరినప్పడు తాను జ్వరంతో ఇమామ్–ఏ జామిన్ కట్టడం మర్చిపోగా.. మహమూద్ భాయి దట్టీ తేలేదా అని అడిగి చాంద్రాయణ గుట్ట వద్ద అరగంట సేపు ర్యాలీ నిలిపి వేశారు .దట్టి తీసుకొచ్చి కట్టి తర్వాత ర్యాలీ ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు. -
కొత్త నాయకత్వం కావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పాత తరం రాజకీయాలకు కాలం చెల్లిందని.. అందుకే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజకీయ నాయకత్వం రావాలని.. దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అందుకు భారత్ సమ్మిట్–2025 వేదిక కావాలని ఆకాంక్షించారు. రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్లీనరీకి ముఖ్యఅతిథిగా రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ విధానాలను మార్చుకుంటున్నాయని చెప్పారు. భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులతోపాటు యాత్రకు ముందు, ఆ తర్వాత తనలో రాజకీయంగా వచ్చిన మార్పుల గురించి వివరించారు. దేశంలోని పాలకపక్షం ద్వేషం, కోపాలను విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తోందని రాహుల్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలేనని స్పష్టం చేశారు.దేశ ప్రజల్ని కలిసేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టా‘ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు మౌలిక విధానాలను మార్చుకుంటున్నాయి. పదేళ్ల క్రితం నాటి ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత తరం రాజకీయం చనిపోయింది. ఇప్పుడు కొత్త రకం రాజకీయాలు రావాలి. ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక సవాల్ లాంటిది. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓ వలయంలో చిక్కు కొని ఒంటరైంది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయా లనే ఆలోచనలో భాగంగా మా అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించా. అందుకే దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడక ద్వారా ప్రజలను కలవాలనే నిర్ణయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీ. పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో ఓపిక, ప్రేమ గురించి నేర్చుకున్నా. రాజకీయ నాయకులకు ఈ రెండు లక్షణాలు ఉండాలి. ప్రజలు ఏం చెబుతు న్నారన్నది ఓపికగా వినగలగాలి. ప్రజలపట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించగలగాలి. విధానాల రూపంలో ప్రజలతో పరోక్షంగా కలిసి ఉండటం కంటే వారిపట్ల ప్రేమ బంధం ఏర్పరచుకోగలగాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్‌కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు. -
సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: దేశంలో సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని.. రాబోయే 30 ఏళ్ల కాలంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సాక్షికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారాయన.2006లో పార్టీలో అడుగుపెట్టినప్పుడు కనీసం మంత్రి కూడా అవుతానని, ఈ స్థాయి గౌరవం లభిస్తుందని ఊహించలేదు. ఈనాటికి సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు. వచ్చే ఎన్నికల్లోనూ మా సీఎం అభ్యర్థి కేసీఆరే. ఆయన మా ట్రంప్ కార్డు. తురుపు ముక్క. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కాంగ్రెస్ హయాంలో పాడైపోయిన వ్యవస్థను బాగు చేయడమే మా ముందు ఉన్న లక్ష్యం అని స్పష్టం చేశారాయన. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 420 హామీలు ఇచ్చినా ఒక్కటి అమలు చేయలేదు. 15 నెలల పాటనలో సంక్షేమం అమలు చేయలేదు. అధికారం కోసం ఇష్టమున్నట్లు హామీలు ఇచ్చారు. పథకాలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నికృష్టంగా పని చేస్తోంది. నా వరకు నేను ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు ఇస్తాను. లిక్కర్ విషయంలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది. కేసీఆర్ సర్కార్‌ది సంక్షేమం.. రేవంత్ సర్కార్‌ది సంక్షోభం అన్నారు.హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలు అయ్యింది. తులం బంగారం లేదు.. స్కూటీ లేదు. ఫార్ములా రేసులో ఎలాంటి అవినీతి జరగలేదు. సీఎం పదవి వచ్చాక సమర్థవంతంగా పని చేయొచ్చు కదా. ఫార్ములా ఈ కోసం ఖర్చు చేస్తే తప్పైతే.. అందాల పోటీతో ఖర్చు చేయడం కరెక్టా?. ఫార్ములా ఈ రేసు కోసం చేసిన ఒప్పందాలతో పెట్టుబడులు తెచ్చాం. అందాల పోటీతో ఎంత మందికి ఉపాధి లభిస్తుంది. లైవ్‌లో డిబేట్ పెడితే.. ఎవరిది మోసమో అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని కేటీఆర్ జోస్యం పలికారు.కేసీఆర్ పథకాలను పక్క రాష్ట్రాల్లో కాపీ కొట్టారు. దేశం మొత్తం ఆ పథకాలు అమలు కావాలనే.. పార్టీని దేశ స్థాయిగా విస్తరించాలనుకున్నాం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా విస్తరించాం. బీఆర్ఎస్ మీదనే మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మళ్లీ పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. బీఆర్ఎస్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. అలాగే.. హరీష్‌రావుతో నాకు ఎలాంటి విబేధాల్లేవ్. మా అందరికి కావాల్సినంత పని ఉంది. ఎజెండా తిరిగి తెలంగాణలో పట్టాలెక్కాలి. రాష్ట్రం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోంది. కేసీఆర్ ఉన్నంతదాకా.. ఆ ప్రస్తావన రాదు.తెలంగాణ వచ్చాక.. మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం. త్రిముఖ పోటీ(బీజేపీ+జనసేన+టీడీపీ), కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ ప్రభావం మా మీద ఉండదని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఒంటరిగానే పోటీ చేస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. -
ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం వంటివి టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమంవైపు ఆకర్షితుడినయ్యా.సాక్షి, హైదరాబాద్ : కుటుంబ పార్టీ అంటూ బీఆర్ఎస్పై చేసే విమర్శలు అర్థ రహితమని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన తాము.. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు చేపట్టామన్నారు. బ్యాక్‌డోర్‌లో తాము పదవులు పొందలేదని చెప్పారు. కేటీఆర్, కవిత సహా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచి్చన నివేదిక ఎన్డీఏ ప్రభుత్వ నివేదిక తరహాలో ఉందని తెలిపారు.మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులో ఉద్దేశపూర్వకంగా కాలయాపన జరుగుతోందన్నారు. ఏడాదిన్నరలోనే రేవంత్ పాలన తేలిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నడిచిన హరీశ్‌రావు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో నెమరువేసుకున్నారు. ఉద్యమంలో తన అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నాటి పరిస్థితులతోనే టీఆర్ఎస్ స్థాపన తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం తదితరాలు టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమం పట్ల ఆకర్షితుడిని అయ్యా. ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో జరిగిన చర్చల్లో అనేక అంశాల పట్ల అవగాహన ఏర్పడటంతో ఉద్యమం పట్ల ఆకర్షణ, పాల్గొనాలనే ఉత్సాహం పెరిగింది.తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆకళింపు చేసుకునే క్రమంలో కేసీఆర్ వందలాది మందితో గంటల కొద్దీ సంప్రదింపులు జరిపారు. వారిని సమన్వయం చేయడం నా ప్రధాన బాధ్యతగా ఉండేది. టీఆర్ఎస్ ఆరంభంలోనే పార్టీ కోశాధికారిగా, ప్రచార కార్యదర్శిగా మీడియా బాధ్యతలు, ఆర్థిక అంశాలు, ఎన్నికల బాధ్యతలు చూసేవాడిని. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు జెడ్పీటీసీ సభ్యులతో క్యాంప్‌ల నిర్వహణ బాధ్యత కేసీఆర్ నాకు అప్పగించారు. వైఎస్ మంత్రివర్గంలోకి అనగానే..నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరమని కేసీఆర్ ఆదేశించినప్పుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యా. మంత్రివర్గంలో కొనసాగుతూ పార్టీ బలోపేతం చేయమని ఆదేశిస్తూ టీఆర్ఎస్ తరఫున మంత్రివర్గంలో చేరే వారి జాబితాను నాతోనే కేసీఆర్ రాయించి కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చారు. 33 ఏళ్ల వయసులోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా, పాలన కంటే ఉద్యమం మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మంత్రిగా పనిచేస్తూనే 2004 అక్టోబర్‌లో సిద్దిపేట ఉప ఎన్నికలో తొలిసారి పోటీ చేశాం. అంతకు మునుపే కేసీఆర్‌కు సంబంధించిన 2001 ఉపఎన్నిక, 2004 అసెంబ్లీ ఎన్నిక బాధ్యతలను నేనే చూశా. దీంతో నాకు సిద్దిపేట, ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో ఉన్న సన్నిహిత సంబంధం ఉండటం కలిసొచి్చంది. నివేదికల పేరిట పార్టీని దెబ్బతీసే కుట్ర తెలంగాణలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో మిషన్ కాకతీయతోపాటు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆయకట్టును పెంచాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పనులు వేగంగా పూర్తి చేసేందుకు సైట్ వద్దే నిద్రించిన సందర్భాలు అనేకం. ఈడీ, సీబీఐతరహాలోనే ఎన్డీఎస్ఏ కూడా ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక, రజతోత్సవ సందర్భంలో తుది నివేదిక అంటూ మా పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. పదవులొస్తాయని అనుకోలేదు కుటుంబ పార్టీ, ఆ నలుగురు అంటూ మాపై చేసే విమర్శలు అర్థ రహితం. రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించడం మినహా, అధికారం, పదవులు వస్తాయని మాలో ఎవరూ అనుకోలేదు. మేము వెనుక డోర్ నుంచి పదవుల్లోకి రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వాళ్లం. కేసీఆర్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో కార్యకర్తలుగా పనిచేస్తాం. నాతో సహా పార్టీలో అందరమూ కేసీఆర్ సైనికులమే.బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుంది ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితే వారి పాలన సామర్థ్యం ప్రజలకు మరింత అర్థమవుతుంది. ఇప్పటికే బీజేపీ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు వల్లే మనుగడలో ఉంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వచి్చనా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. బీఆర్ఎస్ బలమైన శక్తిగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. మహాగర్జన అపురూప జ్ఞాపకంHarish Rao ,Interview with Sakshi, telanganaఉద్యమ సమయంలో వరంగల్‌లో 25 లక్షల మందితో నిర్వహించిన మహాగర్జన అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది. కేసీఆర్ ఈ సభకు సిద్దిపేట నుంచి సైకిల్‌పై వచ్చారు. అలాంటి సభలు ఈ రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. పార్టీ వద్ద అప్పట్లో పెద్దగా డబ్బులు లేకున్నా ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. -
ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. -
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్ఎస్ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్ఎంసీ వద్ద మోహరించాయి.