ఏకపక్ష నిర్ణయాలతో రా ష్ర్టంలో పార్టీ మనుగడను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ఆ పార్టీ నాయకులే ఆరోపించారు.
పార్టీకి తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణ
ముఖ్యమంత్రి వైఖరితో పార్టీకి నష్టమని ఫిర్యాదు
బెంగళూరు: ఏకపక్ష నిర్ణయాలతో రా ష్ర్టంలో పార్టీ మనుగడను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ఆ పార్టీ నాయకులే ఆరోపించారు. రాష్ర్ట కాం గ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమితి సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధరామయ్య పనితీరుపై ఈ సందర్భంగా అగ్రశ్రేణి నాయకులే మండిపడ్డారు. రాష్ట్రంలోని ధార్మిక సంస్థల నియంత్రణ కోసం రూపొందించిన ముసాయిదా బిల్లుపై పార్టీలో చర్చించకుండానే బెళగావి శాసనసభలో ప్రవేశపెట్టిన తీరుపై మంత్రి డి.కె.శివకుమార్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల రాష్ర్ట రాజకీయాలను శాసించే స్థా యిలో ఉన్న కొన్ని వర్గాల మద్దతు కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు. అదేవిధంగా కేపీఎస్‌సీ అధ్యక్ష, సభ్యుల నియామకం విషయాన్ని మాటమాత్రామైనా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు.
సుదర్శన్‌ను కేపీఎస్‌సీ అధ్యక్షుడిగా నియమించే విషయం మీడియాలకు లీక్ అయిన తర్వాతే తమకు తెలిసిందని నిష్టూరమాడారు. అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో విపక్షాలు రోజుకొక ఆరోపణలు చేస్తున్నా పార్టీ నాయకులు సమర్థంగా తిప్పికొట్టలేకపోవడానికి సిద్ధరామయ్య పాటిస్తున్న గోప్యతే కారణమని ఆరోపించారు. సమన్వయ సమితి సభ్యులు అందరూ తనను దోషి స్థానంలో నిలబెట్టడంతో సిద్ధరామయ్య ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అన్నింటినీ విన్న దిగ్విజయ్ సింగ్ అప్పటికప్పుడు మౌనంగానే ఉన్నా తర్వాత కేపీసీసీ నాయకులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు తాను ఇక్కడే ఉంటానని అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి సమస్యలను ఒక కొలిక్కి తీసుకువస్తానని అభయమిచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.