ప్రయాణానికి మెట్రో రెడీ


సాక్షి, ముంబై: రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ‘ముంబై మెట్రో’ రైలుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) బృందం సోమవారం సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో అంతా సవ్యంగా ఉన్నట్లు అధికారులు సంతృప్తివ్యక్తం చేశారు. ఇక భద్రతాపరమైన సామర్థ్యాన్ని సూచించే ధ్రువపత్రం (సేఫ్టీ సర్టిఫికెట్) జారీ చేయడమే మిగిలిపోయింది.  మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన దీనిని జారీ చేయనున్నట్లు ఇదివరకే సంకేతాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సేవలు ప్రారంభించేందుకు రైల్వే పరిపాలనా విభాగం నుంచి అనుమతి రావాల్సి ఉంది.



ఆ తరువాత ముంత్రులు లేదా వీఐపీల నుంచి అపాయింట్‌మెంట్ లభించగానే ముహూర్తం ఖరారు చేస్తారు. లోకల్ రైళ్లలో నిత్యం రద్దీ, ఉక్కపోతతో సతమతమవుతున్న ముంబైకర్లకు మెట్రో సేవలు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవి ఎండల కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబైకర్ల మెట్రో ఏసీ బోగీల్లో సౌకర్యంగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.



 ఎమ్మెమ్మార్డీయే తొలిసారిగా మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తుండడంతో వీటి కోసం నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెట్రో-1 ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ మధ్య నిర్మిస్తున్న 11 కిలోమీటర్లు పొడవైన కారిడార్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అనేక డెడ్‌లైన్లు కూడా వాయిదా పడటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో సీఎంఆర్‌ఎస్ బృందం భద్రతా పరీక్షలు నిర్వహించింది. సేఫ్టీ సర్టిఫికెట్ మంజూరు కాగానే ముహూర్తం ఖరారు చేస్తామని మెట్రో రైల్వే భద్రతా విభాగం కమిషనర్ పి.ఎస్.వాఘేలా చెప్పారు.



 విమానసేవలకు ఓకే

 రత్నగిరి-ముంబై ప్రాంతాల మధ్య 1991లో నిలిచిపోయిన విమానసేవలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ‘ఇండియాపూల్’ కంపెనీ విమానం ద్వారా ఈ రెండు ప్రాంతాలను ఇటీవల సందర్శించింది. ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రభుత్వమూ అనుమతులు ఇవ్వడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య త్వరలోనే విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఎనిమిది సీట్ల సామర్థ్యమున్న తేలికపాటి విమానాలను నడపాలని యోచిస్తున్నారు. ఈ సేవలను స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నామని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) వర్గాలు తెలిపాయి.



అప్పట్లో ఎంఐడీసీ ఆధ్వర్యంలో 1991 వరకు ముంబై-రత్నగిరి జిల్లా మధ్య విమాన సేవలు నడిచేవి. ఈ చిన్న విమానాలను రత్నగిరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు వినియోగించేవారు. కాలక్రమేణా వాటి  వినియోగం తగ్గిపోయింది. అదేవిధంగా రన్‌వే కూడా విమానాలకు అనుకూలంగా లేదు. దీనికి మరమ్మతులు చేపట్టాలని ఎంఐడీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఎంఐడీసీ 1991లో రత్నగిరి విమానాశ్రయంలో ప్రైవేటు విమానాల ల్యాండింగ్‌ను నిలిపివేసింది. అయితే ప్రస్తుతం రత్నగిరి జిల్లా వేగంగా విస్తరిస్తోంది. అనేక ప్రాజెక్టులు వచ్చాయి. జాతీయ ర హదారులు, రైల్వే, జలరవాణా ద్వారా రాకపోకలు, వాణిజ్య లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి.



 వాహనాల సంఖ్య భారీగా పెరగడం, ర హదారిపై ప్రమాదకర మలుపులు, రోడ్డు ప్రమాదాలు, విలువైన సమయం వృథా తదితరాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే విమానసేవల ప్రాధాన్యమేమిటో తెలిసి వచ్చిందని ఎంఐడీసీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అందుకే ముంబై-రత్నగిరి మధ్య తేలికపాటి విమానాల సేవలను ప్రారంభిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదేవిధ ంగా కొంకణ్ ప్రాంతం కూడా పర్యాటకపరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అందమైన సముద్ర తీరాలు ఉన్నాయి. ఇక్కడికి నిత్యం దేశ, విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. విమానసేవలు ప్రారంభిస్తే కొంకణ్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇంచార్జి మంత్రి ఉదయ్ సామంత్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇండియాపూల్‌తో చర్చించామని అన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top