ఆస్పత్రిలోనే అమ్మ

ఆస్పత్రిలోనే అమ్మ - Sakshi


ఆరోగ్యం కుదుట పడ్డా, అమ్మ జయలలిత ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆదివారం వైద్యుల బృందం అమ్మకు పరీక్షలు జరిపారు. ఇక, ప్రభుత్వ వ్యవహారాల్ని ఆస్పత్రి నుంచి అమ్మ పరిశీలించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా పోయెస్ గార్డెన్‌కు చేరాలని అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో లీనమయ్యారు.



సాక్షి, చెన్నై: తీవ్ర జ్వరం, డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైన సీఎం జయలలిత శుక్రవారం వేకువజామున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఆమెకు నలుగురు వైద్యులతో కూడిన బృందం వైద్య పరీక్షల్ని అందిస్తున్నారు. నాలుగో రోజుగా ఆదివారం కూడా ఆమెకు వైద్య పరీక్షలు జరిగాయి. కాగా అమ్మను పరామర్శించి వచ్చిన వాళ్లంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన వద్దని స్పందిస్తుండడం గమనార్హం. ఇక, ఆస్పత్రి పరిసరాల్లోకి అన్నాడీఎంకే వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. అటు వైపుగా వచ్చే వాహనాలను గ్రీమ్స్ రోడ్డులో నిలుపుదల చేస్తున్నారు.



ప్రముఖులు, అంబులెన్స్‌లను మాత్రం ఆస్పత్రి వైపు అనుమతించగా, మిగిలిన వాహనాల్లో వచ్చిన ఇతర రోగుల బంధువులు, ఇతరుల్ని అక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీ కారులో ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అయినా, అన్నాడీఎంకే వర్గాలు పలువురు ఆసుపత్రి వద్దకు చేరుకుని , వెలుపల మోకాలి మీద నిలబడి ప్రత్యేక ప్రార్థన చేశారు. అమ్మ ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి త్వరితగతిన ఇంటికి చేరుకోవాలని కాంక్షించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పూజలు సాగాయి. ఆలయాల్లో అమ్మ పేరిట అర్చనలు, రథం లాగడం, హోమాది పూజల్లో ఆ పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి. కొవ్వొత్తులు వెలిగించి చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి. అనేక ఆలయాల్లో 1,008 కొబ్బరి టెంకాయల్ని కొట్టి అమ్మ కోసం వేడుకున్నారు.



 కొన్ని చోట్ల మేరి మాత ఆలయాల్లో అమ్మ కోసం అన్నాడీఎంకే వర్గాలు ప్రార్థన చేశారు. ఆస్పత్రిలో ఉన్న అమ్మను ఆర్థికమంత్రి ఓ పన్నీరు సెల్వం, రెవెన్యూ మంత్రి ఆర్‌బీ. ఉదయకుమార్, ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, సలహదారు షీలాబాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధా కృష్ణన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవహారాలకు తగ్గ సూచనలు, సలహాలను అమ్మ అధికారులు, సీనియర్ మంత్రి పన్నీరు సెల్వంకు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.



అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే మహిళా నాయకురాలు, సినీ నటి సీఆర్ సరస్వతి మీడియాతో స్పందిస్తూ, అమ్మ సంపూర్ణ ఆర్యోగవంతు రాలు అయ్యారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలో ఆమె ఇంటికి చేరుతారని వ్యాఖ్యానించారు. అమ్మ రాత్రికి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వచ్చినా, ఏ ఒక్కరూ ధ్రువీకరించ లేదు.



వదంతులు నమ్మొద్దు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సాగుతున్న వదంతుల్ని నమ్మోద్దు అని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం  ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, అపోలో వైద్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ బామా, చీఫ్ సుబ్బయ్య విశ్వనాథన్, డాక్టర్ వెంకట్, డాక్టర్ రమేష్ మీడియా ముందుకు వచ్చారు. అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.  ఇది వరకు విడుదల చేసిన బులిటెన్‌లలో పేర్కొన్న మేరకు తాము అందించిన వైద్య సేవలకు సీఎం ఆరోగ్యం మెరుగు పడిందని ప్రకటించారు.



తమ వైద్య పరీక్షలు, పరిశోధనలకు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఆమెకు మరి కొద్ది రోజుల విశ్రాంతి తప్పని సరి అని పేర్కొన్నారు. విశ్రాంతి మేరకు తాము ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే, సోషల్ మీడియాల్లో సాగుతున్న వదంతుల్ని నమ్మ వద్దని స్పష్టంచేశారు. విదేశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయాల్సినంత అవసరం లేదని, విదేశాలకు తరలించడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ తప్పుడు సమాచారాలు, వదంతులు అని, సీఎంకు విదేశీ చికిత్స, వైద్య అనవసరం అని స్పష్టం చేశారు. కొన్ని రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తంచేశారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top