మహా డిస్కంకు రూ.1,860 కోట్ల నష్టాలు | Rs .1,860 crore in losses to maha discoms | Sakshi
Sakshi News home page

మహా డిస్కంకు రూ.1,860 కోట్ల నష్టాలు

Jan 24 2015 12:01 AM | Updated on Sep 2 2017 8:08 PM

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మహాడిస్కం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,860 కోట్ల నష్టాల్ని చవి చూసింది.

ముంబై : రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మహాడిస్కం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,860 కోట్ల నష్టాల్ని చవి చూసింది. మహాడిస్కం వద్ద విద్యుత్‌ను కొనుగోలు చేసే పారిశ్రామిక వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుంచి చౌక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో ఈ నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. పారిశ్రామిక వినియోగదారులే తమకు ప్రధాన ఆదాయ వనరులని మహాడిస్కం మేనేజిగ్ డెరైక్టర్ ఓపీ గుప్తా చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత మహాడిస్కం నెట్‌వర్క్ పరిధిలో రెండున్నర కోట్ల మంది వినియోగదారులున్నారని చెప్పారు.
 
వీరిలో 1.6 కోట్ల మంది గృహ వినియోగదారులున్నారని తెలిపారు. సుమారు 40 లక్షల మంది రైతులుండగా, 12 నుంచి 13 లక్షల మంది వాణిజ్య వినియోగదారులున్నారని పేర్కొన్నారు. హై టెన్షన్ లేదా బడా పరిశ్రమల వినియోగదారులు 12 వేల మంది ఉన్నారని తెలిపారు. వీరే అత్యధికంగా 36 శాతం విద్యుత్‌ను వినియోగించి 56 శాతం ఆదాయాన్ని సమకూరుస్తారని చెప్పారు.

ఇంతవరకు 328 మంది వినియోగదారులు బహిరంగ మార్కెట్ వైపు మళ్లారని గుప్తా తెలిపారు. దీంతో తమకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,860 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. అంతకుముందు ఏడాది 1,723 కోట్ల నష్టాలు వచ్చాయని అన్నారు. నష్టాలు రాకుండా ఏదో పరిష్కారాన్ని కనుగొనాలని లేదా ఈ భారాన్ని మిగిలి ఉన్న వినియోగదారులపై వేయాల్సి ఉంటుందని చెప్పారు.

విద్యుత్ చట్టం 2003కు చేసిన సవరణ ప్రకారం ఓ విద్యుత్ ఉత్పత్తి సంస్థ తన వద్దనున్న మిగులు విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వమే తమను గట్టున పడేయాలన్నారు.

Advertisement
Advertisement