కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు! | Power wings of Solar panels | Sakshi
Sakshi News home page

కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు!

Oct 4 2016 3:18 AM | Updated on Oct 22 2018 8:26 PM

కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు! - Sakshi

కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు!

కాలుష్యాన్ని తగ్గించేందుకు, వేసవిలో కరెంటు కోతల ఇబ్బందులను తప్పించుకునేందుకూ సౌరశక్తిని వాడటం మేలు.

కాలుష్యాన్ని తగ్గించేందుకు, వేసవిలో కరెంటు కోతల ఇబ్బందులను తప్పించుకునేందుకూ సౌరశక్తిని వాడటం మేలు. అయితే ఒక ఇంటికి అవసరమైన సోలార్ ప్యానెల్స్‌ను బిగించుకునేందుకైనా చాలా ఎక్కువ స్థలం అవసరమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవలే ఓ సోలార్ చెట్టును ఆవిష్కరించింది.
 
దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసేంత విద్యుత్తును ఈ సోలార్ చెట్టు పది చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ ఉత్పత్తి చేస్తుంది. చెట్ల మాదిరిగానే దీంట్లో ఒక బలమైన లోహపు కాండం ఆధారంగా కొన్ని కొమ్మల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిపై సోలార్ ప్యానెల్స్‌ను బిగిస్తారన్నమాట. ఒక్కో సోలార్ చెట్టుతో దాదాపు 5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ప్యానెల్స్‌పై పడే దుమ్మూ ధూళిని ఎప్పటికప్పుడు కడిగేసేందుకు దీంట్లో ఓ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉంది.

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవలే ఢిల్లీలో ఈ సోలార్ చెట్టును ప్రారంభించారు. ఈ తరహా సోలార్‌ట్రీ ఒక్కో దాని ఖరీదు దాదాపు 5 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని మూడు చోట్ల ఈ చెట్లను ప్రయోగాత్మకంగా వాడనున్నారు. భవిష్యత్తులో సూర్యుడి కదలికలకు అనుగుణంగా సోలార్ ప్యానెల్స్ తమ దిశ మార్చుకునేట్టు సరికొత్త సోలార్ చెట్టును అభివృద్ధి చేస్తామని సీఎస్‌ఐఆర్ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement