
కంటతడి పెట్టిన కిరణ్ బేడీ
బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కంటతడి పెట్టారు. ఆమె బుధవారం తాను పోటీ చేస్తున్న కృష్ణనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారిగా అక్రమాలపై కొరడా ఝుళిపించి కఠిన ఖాకీ అని పేరు తెచ్చుకున్న బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కంటతడి పెట్టారు! బుధవారం న్యూఢిల్లీలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తనను ప్రేమిస్తున్న ప్రజలను, ప్రజాసేవ రూపంలో తిరిగి ప్రేమిస్తానని అన్నారు.
తను పోటీ చేస్తున్న కృష్ణానగర్‌లో రోడ్‌షోకు వెళ్లిన బేడీ కోసం కొందరు ప్రజలు ఫ్లాస్కుల్లో టీ తేవడంతో ఆమె కన్నీటిపర్యంతయ్యారు. 'నాపై కురిపిస్తున్న ప్రేమ గురించి చెప్పడానికి మాటలు లేవు. వారి ప్రేమను కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా. మేం నిజాయితీతో వారికి సేవ చేస్తా' అని కంటతడితో అన్నారు.