రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ విజయం కోసం బీజేపీ సీనియర్ నేతలు ప్రచారానికి చివరిరోజైన గురువారం చెమట చిందించారు.
న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ విజయం కోసం బీజేపీ సీనియర్ నేతలు ప్రచారానికి చివరిరోజైన గురువారం చెమట చిందించారు. కిరణ్‌బేడీ పోటీచేస్తున్న కృష్ణ నగర్ నియోజకవర్గంలో పలు ర్యాలీలు నిర్వహించారు. కాగా ఉత్తర, దక్షిణ ఢిల్లీల్లోని మంగోల్‌పురి, సుల్తాన్‌పురి, కిరారి, నంగోలీ, మున్‌డ్కా ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో కిరణ్‌బేడీ పాల్గొన్నారు. ఆమె తన చివరి ర్యాలీని కృష్ణ నగర్‌లో నిర్వహించారు.ఈ ర్యాలీలో ఆమెతోపాటు కేంద్ర మంత్రి, స్థానిక నేత హర్షవర్ధన్, తూర్పుఢిల్లీ లోక్‌సభ సభ్యుడు మహేష్ గిరి కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా తనను కలిసిన లాయర్లతో బేడీ మాట్లాడుతూ.. బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ నగర్‌లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు తనను దీవించాలని కోరారు. అలాగే తన హయాంలో మంచి పాలనను అందిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, కిరణ్‌బేడీ గెలుపు కోసం పూర్తిస్థాయిలో కృషిచేయాలని స్థానికుడైన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది. గతంలో ఇక్కడి నుంచి హర్షవర్ధన్ పలుమార్లు గెలిచిన సంగతి తెలిసిందే.