ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన | Delhi: Congress gets into Opposition mode, protests price rise | Sakshi
Sakshi News home page

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన

Jul 7 2014 10:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలో

సాక్షి, న్యూఢిల్లీ:ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలో సోమవారం జంతర్‌మంతర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ  కాంగ్రెస్ కార్యకర్తలు ఆగకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రైలు చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని, దీనికితోడు ఢిల్లీవాసులు విద్యుత్ సరఫరాలో కోతలతో ఇబ్బందిపడుతున్నారని ఈ సందర్భంగా లవ్లీ ఆరోపించారు. ఢిల్లీవాసులను బీజేపీ దోచుకుంటుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి కొంత సమయమివ్వడానికి  సుముఖంగా ఉన్నామన్నారు.
 
 ఎట్టిపరిస్థితుల్లో ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయి, మూడో స్థానానికి దిగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కొత్త బాట పట్టింది. కోల్పోయిన ప్రజాదరణను చూరగొనేందుకు ఆందోళనల పరంపరను కొనసాగిస్తోంది. ఓటర్లతో సరైన అనుబంధం లేకపోవడం వల్లనే ఓడిపోయామన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ఆమ్ ఆద్మీ పార్టీ తమను గద్దె దింపిందనే విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా విద్యుత్ కోతలు, నీటి సమస్యలు వంటి ప్రజా సమస్యలపై  నగరంలో రోజుకోచోట నిరసన ప్రదర్శనలు  నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఈ ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా స్థానిక  కార్యకర్తలలో ఉత్సాహం నింపడంతోపాటు పనిలో పనిగా ఓటర్ల మెప్పు కూడా పొందవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
 
 విద్యుత్ కోతలు, నీటి సమస్యలకు తోడుగా ఇటీవల రైలు చార్జీలు పెరగడంతో కాంగ్రెస్‌కు మరో అస్త్రం లభించింది. ఆ తరువాత డీజిల్ , పెట్రోలు ధరలు పెరిగాయి. ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు పెరగడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల  మొదటి రోజున రైలు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ జంతర్‌మంతర్ వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిపింది. కాగా పరిస్థితులు అదుపు తప్పకుండా చేసేందుకుగాను ఆందోళనకు దిగినవారిలో 40 నుంచి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలియజేశారు. ఆ తర్వాత వారిని విడుదల చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement