వీడియో కాన్ఫరెన్స్‌కు ఓకే!

Court Acceptance Sashikala Request - Sakshi

కోర్టుకు నేరుగా రాలేనన్న శశికళ పిటిషన్‌పై ముగిసిన విచారణ

విదేశీ మారకద్రవ్యం మోసం కేసు విచారణపై

న్యాయ స్తానం అంగీకారం

సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశీ మారకద్రవ్యం మోసం కేసులో శశికళను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాల్సిందిగా మద్రాసు హైకోర్టు గురువారం ఆదేశించింది. చార్జిషీటు పత్రాలను బెంగళూరు జైలుకు పంపి శశికళ సంతకాలను తీసుకోవాల్సిందిగా సూచిం చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, అమె అక్క కుమారుడు భాస్కరన్‌ 1996, 1997 సంవత్సరాల్లో జేజే టీవీ కోసం విదేశాల నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల మోసం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అలాగే కొడనాడు టీ ఎస్టేట్‌ కొనుగోలులో అనేక కోట్లరూపాయలు విదేశీ మారకద్రవ్యం లావాదేవీలు అక్రమంగా సాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జేజే టీవీ అక్రమాలకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ అధికారులు శశికళపై మూడు కేసులు, కొడనాడు టీ ఎస్టేట్‌ కొనుగోలులో విదేశీ మారకద్రవ్యం మోసంపై మరో కేసు పెట్టారు. చెన్నై ఎగ్మూరులోని ఆర్థికనేరాల కోర్టులో ఈ కేసులపై అనేక ఏళ్లుగా వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ కేసులో ప్ర«ధాన నిందితుడైన భాస్కరన్‌పై 2017 జూలైలో చార్జిషీటు దాఖలు చేశారు. అలాగే బెంగళూరు జైలు అధికారుల అనుమతిలో శశికళతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి చార్జిషీటు పెట్టారు.

అయితే చార్జిషీటు దాఖలు తరువాత శశికళ తరఫున ఎవ్వరూ కోర్టుకు హాజరుకావడం లేదని, చార్జిషీటులో శశికళ సంతకం చేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జనవరిలో శశికళతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మరో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ సమయంలో శశికళ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఇంటెలిజెన్స్‌ అధికారులను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయాలని కోరారు. శశికళ కోర్కె మేరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కూడా ముగిసింది. కాగా, క్రాస్‌ ఎగ్జామిన్‌ కోరినందుకు శశికళను ఈనెల 13నహాజరుపరచాలని బెంగళూరు జైలు అధికారులను చెన్నైలోని ఆర్థికనేరాల కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో శశికళ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

అనారోగ్య కారణాల వల్ల మద్రాసు కోర్టుకు నేరుగా హాజరుకాలేనని, న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు బదులివ్వలేనని కోరుతూ సదరు ఆదేశాలపై స్టే విధించాలని శశికళ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చార్జిషీటు ఎలా దాఖలు చేశారో విచారణను కూడా అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శశికళ పిటిషన్‌ న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేష్‌ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. ఇంటెలిజెన్స్‌ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, శశికళతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చార్జిషీటుపై సంతకాల కోసమే ఆమెను నేరుగా హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. ఈ వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ, శశికళను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించండి, చార్జిషీట్‌ పత్రాలను బెంగళూరు జైలుకు పంపి ఆమె సంతకాలు తీసుకోండని ఆదేశించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top