
టీ.నగర్: చెన్నై హార్బర్ నుంచి బయలుదేరాల్సిన ప్రైవేటు కార్గో షిప్ దారి తెలియకుండా వచ్చిన కోతి కారణంగా మూడు రోజులు ఆగిపోయింది. చెన్నై హార్బర్‌లో కంటైనర్ల లోడింగ్, అన్‌లోడింగ్ కోసం నౌకలను నిలిపేందుకు వార్ప్ ప్రాంతంలో స్థలం కేటాయించారు. ఈ ప్రాంతంలో లంగరు వేసి నిలిపేందుకు హార్బర్ రవాణా శాఖ అధికారుల అనుమతి పొందాలి. వాణిజ్యపరంగా ఇక్కడ నౌకలు నిలుపుతున్నందున అద్దె వసూలు చేస్తారు. హార్బర్‌లో నిలిపేందుకు అనుమతి తీసుకునే ముందు తగిన ఏర్పాట్లను నౌక యాజమాన్యాలు చేస్తాయి.
అంతవరకు హార్బర్ వెలుపల నౌకలను నిలిపి ఉంచుతారు. ఇలాఉండగా ప్రైవేటు సంస్థకు చెందిన కార్గో నౌక గత వారం చెన్నై హార్బర్ చేరుకుంది. హార్బర్ రవాణా విభాగం అనుమతితో స్థలాన్ని పొంది నౌక నిలిపిఉంచారు. సరుకులను దింపే పనులు ముగిసిన తర్వాత శుక్రవారం నౌక బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో నౌకలోకి ఒక కోతి ప్రవేశించినట్లు సిబ్బంది కెప్టెన్‌కు సమాచారం తెలిపారు. దీంతో కెప్టెన్ హార్బర్ అటవీ శాఖ అధికారుల సాయం కోరారు. దీంతో చెన్నై అటవీ శాఖ రేంజర్ మోహన్ ఆధ్వర్యంలోని అధికారులు శనివారం నౌకలో తనిఖీలు చేశారు. కోతి కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారు. మళ్లీ కోతి ఉందని సమాచారం అందడంతో ఆదివారం మళ్లీ తనిఖీలు చేశారు. చివరిగా నౌకలో కోతి లేదని వెల్లడించడంతో శుక్రవారం బయల్దేరాల్సిన ఆ నౌక సోమవారం బయల్దేరి వెళ్లింది.