కెమెరాలతో నిఘా | cámaras de vigilancia | Sakshi
Sakshi News home page

కెమెరాలతో నిఘా

Nov 14 2013 2:51 AM | Updated on Aug 24 2018 1:52 PM

నగరంలోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరుగనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించనుంది.

 = మోడీ సభకు భద్రత కట్టుదిట్టం
 = పాట్నాలో పేలుళ్ల దృష్ట్యా     తనిఖీలు ముమ్మరం
 = సభకు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం

 
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరుగనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించనుంది. సభ మైదానంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బీహార్‌లో ఇటీవల మోడీ సభకు కొద్ది గంటల ముందు సంభవించిన వరుస పేలుళ్ల దృష్ట్యా పోలీసులు ఏ చిన్న అవకాశానికి కూడా తావు లేకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా పోలీసులకు యూనిఫారాలను సరఫరా చేసే ఓ టైలర్ నుంచి ఎవరో అపరిచిత వృద్ధుడు పది జతలను కొనుగోలు చేశారని వెల్లడవడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడిగా భావిస్తున్న ఆ వృద్ధుడు యూనిఫారాలతో పాటు కానిస్టేబుళ్లు ధరించే టోపీ, లాఠీలను కూడా కొనుగోలు చేశారని తెలియ వచ్చింది. దీంతో మోడీకి అత్యంత సమీపంలో విధులు నిర్వర్తించబోయే పోలీసు అధికారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ నిర్ణయించారు. వృద్ధుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
 
నాకాబందీ


 నగరంలో వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశారు. మెజిస్టిక్ బస్టాండు, రైల్వే స్టేషన్లలో నిఘా వేసి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా బహిరంగ సభ జరిగే ప్యాలెస్ మైదానాన్ని పోలీసులు స్వాధీన పరచుకున్నారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. బీజేపీ కార్యకర్తలు, వేదిక నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికులను తనిఖీ చేసి లోనికి వదులుతున్నారు. ఇప్పటికే 300 మంది సాయుధ పోలీసులు మైదానం చుట్టూ మోహరించారు.

బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశాలున్నందున, మైదానంలో నిఘా టవర్లను ఏర్పాటు చేశారు. మూల మూలన సీసీటీవీ కెమెరాలను నెలకొల్పారు. కొందరు పోలీసులు హ్యాండీ కెమెరాలతో చిత్రీకరణలో నిమగ్నమయ్యారు. భద్రత దృష్ట్యా ఆదివారం బ్యాగులు, నీటి సీసాలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. మైదానం వద్ద ఆ రోజు మొత్తం ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement