ఈశాన్య ఢిల్లీ ఎంపీ, ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్‌తివారీకి... ప్రాణాలు తీస్తామంటూ ఓ బెదిరింపు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ ఎంపీ, ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్‌తివారీకి... ప్రాణాలు తీస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యల వల్ల తనకు ఈ బెదిరింపు లేఖ వచ్చిందని మనోజ్ తివారీ చెప్పారు. ఈ విషయాన్ని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాను వారణాసిలో ఉన్నానని, బుధవారం ఢిల్లీకి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా, రాహుల్‌గాంధీ సెలవులో వె ళ్లడంపై మనోజ్ తివారీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ అవివాహితుడు.
ఆయన్ని బ్యాంకాక్, పటాయాలో విహరించనివ్వండి. ఆయన గురించి ఆందోళన చెందకండి’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. దీంతో ఢిల్లీలోని తన నివాసానికి బెదిరింపు లేఖ వచ్చినట్లు మనోజ్ తివారీ చెప్పారు. రోడ్డు యాక్సిడెంట్ చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం సరికాదు. ప్రాణాలు పోగొట్టుకుంటావు’ అని లేఖలో హెచ్చరించారని ఎంపీ తెలిపారు.