ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో నేపథ్యంలో అశోక్‌చవాన్‌కు కీలక బాధ్యతలను అప్పగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది.
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో నేపథ్యంలో అశోక్‌చవాన్‌కు కీలక బాధ్యతలను అప్పగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడిగాగానీ లేదా ఎన్నికల ప్రచార ప్రముఖుడి బాధ్యతలుగానీ అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఏ పదవి అప్పగిస్తారనేది త్వరలోనే తేలనుంది. నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో మార్పులుచేర్పులు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కొంతమేర అనుకూలంగానే ఉన్నప్పటికీ పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే అధిష్టానం దృష్టిసారించింది. పార్టీని విజయపథంలో నడిపించే నాయకుడికోసం అన్వేషిస్తోంది. మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులెవరూ కాంగ్రెస్‌కు లభించలేదని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్... మచ్చ లేని నాయకుడిగా పేరు పొందినప్పటికీ ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేననే భావన ఉంది. ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో మరోసారి అశోక్ చవాన్‌కు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మార్గం సుగమమైంది. ఎన్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అశోక్ చవాన్‌లాంటి నాయకుడి నేతృత్వం అవసరమని భావిస్తున్నట్టు సమాచారం.