
‘జయ’ నర్సు ఆత్మహత్యాయత్నం
అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స అందించిన నర్సు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
చెన్నై: అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స అందించిన నర్సు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటిలో వందకు పైగా నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జయలలిత మృతి మిస్టరీగా మారిన నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు కారు డ్రైవర్‌తో సహా వరుసగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జయకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి నర్సు గ్లోరియా (33) చెన్నై ఐనావరం నాగేశ్వర గురుస్వామి వీధిలో నివసిస్తోంది. భర్త విజయకుమార్ (35), అదే ప్రాంతంలో స్టేషనరీ దుకాణం నడుపుతున్నాడు. కుమారులు ప్రవీణ్‌కుమార్ (07), సుజిత (06) ఉన్నారు.
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు చికిత్స అందించిన నర్సులలో గ్లోరియా ఒకరు. ఇదిలా ఉండగా గత గ్లోరియా భర్త విజయకుమార్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. గుండెనొప్పితో అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో భర్త మృతిపై గ్లోరియా మనోవేదనతో కనిపించేది. గత ఆదివారం గ్లోరియా తన ఇద్దరు కుమారులకు నిద్రమాత్రలు మింగించి తాను మింగింది. వీరిద్దరూ ట్యూషన్‌లో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే వారిని చెన్నై అన్నానగర్‌లో గల సుందరం ఆసుపత్రిలో చేర్పించి అనంతరం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అదే సమయం గ్లోరియాను చెన్నై రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్థితి కొంచెం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. భర్త మృతి చెందడం వలన గ్లోరియా ఆత్మహత్యకు యత్నించిందా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.