రాష్ట్రంలో రెండు, మూడు వారాలుగా తీవ్ర ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
► కానరాని లోకానికి చోరామస్వామి
► అశ్రునయనాలతో అంతిమవీడ్కోలు
► వరుసగా శోకాలే
రాజధాని నగరం చెన్నైలో వరుస విషాదాలు ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారుు. మొన్నటికి మొన్న సంగీత గాన గంధర్వుడి మరణం. నిన్నటికి నిన్న అందరి అమ్మ జయలలిత అనంత లోకాలకు చేరడం యావత్ తమిళావని గుండెల్ని బరువెక్కించింది. ఈ సమయంలో బుధవారం వేకువ జామున మరో విషాదం. అమ్మ జయలలితకు గురువుగా, సలహాదారుడిగా వ్యవహరించిన చో రామస్వామి(82) ఇక లేరన్న సమాచారం సర్వత్రా విషాదంలోకి నెట్టింది. - సాక్షి, చెన్నై
రాష్ట్రంలో రెండు, మూడు వారాలుగా తీవ్ర ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో తరచూ పుకార్లు షికార్లు చేస్తుండడం ఓ వైపు ఆందోళనకు దారి తీస్తూ వచ్చింది. ఈ సమయంలో అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలక్షి నెడుంజెలియన్ ఇక లేరన్న సమాచారం అన్నాడీఎంకే వర్గాల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో అమ్మ ఆరోగ్యంపై ఆందోళన సర్వత్రా పెరిగింది. తదుపరి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వాంసుడు బాలమురళీ కృష్ణ ఇక లేరన్న సమాచారం తెలుగు, తమిళ, కర్ణాటక సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఈ ఘటన తదుపరి డీఎంకేలో విషాదం ఆవహించే విధంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోశిమణి మరణం కలవరాన్ని రేపింది. అలాగే, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆసుపత్రిలో చేరడం ఉత్కంటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో యావత్ తమిళ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టే రీతిలో అందరి అమ్మ జయలలిత కానరాని లోకాలకు చేరడం ప్రతి గుండెల్ని బరువెక్కింది. అమ్మ మరణం, అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే నటులు , విశ్లేషకులు, తుగ్లక్ సంపాదకులు చో రామస్వామి ఇక లేరన్న సమాచారం తీవ్ర విషాదంలోకి నెట్టింది.
మరో విషాదం: రంగస్థలం, సినీ, పత్రికా రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విషయం తెలిసిందే. శ్రీనివాస అయ్యర్ రామసామి అన్న సొంత పేరు మరుగున పడి తెర మీదకు చో రామస్వామిగా, తుగ్లక్ రామస్వామిగా చివరకు ’చో’ అంటే గుర్తు పట్టే విధంగా మారిందని చెప్పవచ్చు. 1934లో చెన్నైలో జన్మించి ’చో’ న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడై, నాటక రంగంలో రాణించి, నటుడిగా ఎదిగి, రచరుుతగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అనేక చిత్రాలలో హీరోగా, మరెన్నో చిత్రాల్లో విలక్షణ నటుడిగా తనదైన శైలిలో నటించి అందరి మదిలో సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్న చో రామ స్వామి తుగ్లక్ నాటకంలో ఔరంగ జేబు పాత్ర పోషించి రక్తికట్టించారు.
ఆ నాటకం పేరుతోనే తదుపరి తుగ్లక్ పత్రికను స్థాపించి ఎన్ని ఒడిదొడుగులు ఎదురైనా నిర్విరామంగా ఈ రాజకీయ వార పత్రికను ముందుకు నడిపించారు. ముక్కుసూటిగా, నిష్పక్షపాతంగా విమర్శలను ఎత్తి చూపించడంలో చో వెనక్కు తగ్గిన సందర్భాలే లేవు. ఇక, అందరూ అమ్మ జయలలిత ఆశీస్సుల కోసం ఎదురు చూసే రోజుల్లో, చో ఆశీర్వచనం కోసం అదే అమ్మ ఆయన ఇంటి గడప తొక్కిన సందర్భాలు అనేకం. అందుకే ఆయన్ను జయలలితకు మరో గురువుగాను, రాజకీయ సలహదారుడిగాను సర్వత్రా భావిస్తుంటారు. అదే సమయంలో ఏదేని నిర్ణయం తీసుకునే సమయంలో తప్పనిసరిగా చోతో చర్చించడం జరిగేది. గతంలో చో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే, స్వయంగా అమ్మ జయలలిత వెళ్లి పరామర్శించడమే కాకుండా ఆయన ఆరోగ్యం మెరుగు పడేందుకు తగ్గట్టు అత్యాధునిక వైద్యసేవలు సాగే రీతిలో చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు.
అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చో మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం అదే అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో సోమవారం రాత్రి అమ్మ జయలలిత అనంత లోకాలకు చేరడం యావత్ తమిళావనిని కన్నీటి రోదనలో ముంచింది. అమ్మ అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే చో కూడా ఇక లేరంటూ వచ్చిన సమాచారం మరో విషాదాన్ని నింపింది.
అశ్రునయనాలతో వీడ్కోలు: అపోలో ఆసుపత్రిలో బుధవారం ఉదయాన్నే చో మరణ సమాచారం రాజకీయ వర్గాల్నే కాదు, తమిళ సినీ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెన్నై రాజా అన్నామలైపురం ఎంఆర్‌సీ నగర్ వసంత అవెన్యూరోడ్డులోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ వర్గాలు తరలి వచ్చారుు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటుగా పలువురు మంత్రులు, డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ ఎంపీ కనిమొళి, ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి, బీజేపీ రాష్ట్ర కార్శదర్శి తమిళిసై సౌందర్‌రాజన్, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, వీసీకే నేత తిరుమావళన్, సీపీఐ నేత ముత్తరసన్, పీఎంకే యువజన నేత, ఎంపీ అన్భుమణి రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కాంగ్రెస్ సీనియర్ నేత కుమరి ఆనందన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ చో పార్తీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
రజనీకాంత్, నటులు శివకుమార్, సూర్య, కార్తీ, రాధారవి, ఎస్‌వీ.శేఖర్, వైజీ.మహేంద్రన్ తమ నివాళులర్పించారు. రాజకీయ విశ్లేషకుడిగా చో సంధించిన ప్రశ్నలు, ఎత్తి చూపిన అంశాలు, విమర్శలను గుర్తు చేస్తూ ఆయనతో తమ అనుబంధాన్ని రాజకీయ వర్గాలు మీడియాతో పంచుకున్నారుు. ఇక, సీనీ, నాటక రంగంలో చో సహకారం, ఆయన నటన , అభిమానాన్ని గుర్తు చేస్తూ ఆ రంగాలకు చెందిన ప్రముఖులు, దక్షిణ భారత నటీ నటుల సంఘం ప్రతినిధులు, తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి వర్గాలు తమ సానుభూతి తెలియజేశారుు. ఇక, అశ్రునయనాల నడుమ బుధవారం సాయంత్రం బీసెంట్ నగర్‌లోని స్మశాన వాటికలో చో పార్తీవ దేహానికి అంత్యక్రియలు జరిగారుు.