బహు భాషా నటి రమ్య ఎన్నికల రంగంలోకి అడుగిడారు. శాసనసభ ఎన్నికల్లో తన తల్లికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆమె ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ మండ్య ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బహు భాషా నటి రమ్య ఎన్నికల రంగంలోకి అడుగిడారు. శాసనసభ ఎన్నికల్లో తన తల్లికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆమె ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ మండ్య ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. మండ్యతో పాటు బెంగళూరు లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజైన శనివారం ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లను దాఖలు చేశారు.
బెంగళూరు గ్రామీణ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శివ కుమార్ సోదరుడు డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి నామినేషన్లు సమర్పించారు. మండ్య జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టరాజు శుక్రవారం నామినేషన్‌ను దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌తో అవగాహన కుదరవచ్చని వినిపిస్తున్నప్పటికీ బీజేపీ తన అభ్యర్థులను రంగంలోకి దించింది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గానికి ఎం. కృష్ణప్ప, పారిశ్రామికవేత్త మునిరాజు, మండ్య స్థానానికి దొరస్వామిలు ఆ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గతంలో ఈ స్థానాలకు జేడీఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన హెచ్‌డీ. కుమారస్వామి. ఎన్. చలువరాయస్వామి శాసన సభకు ఎన్నిక కావడంతో ప్రస్తుతం ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
లోక్‌సభలో నోరు మెదపలేదేం.. : కుమారపై సిద్ధు
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి లోక్‌సభలో ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ నామినేషన్‌ను దాఖలు చేయడానికి ముందు రామనగరలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనవసరంగా జరుగుతున్న ప్రస్తుత ఉప ఎన్నికకు కుమారస్వామే కారణమని ఆరోపించారు. దీని వల్ల ఖజానాపై కూడా భారం పడుతుందన్నారు.
ఓటములతో కుంగిపోయిన దేవెగౌడ కుటుంబానికి రామనగర అండగా నిలిచిందని, అయితే ఆ కుటుంబం నుంచి ఈ పట్టణానికి దక్కిందేమీ లేదని విమర్శించారు. జేడీఎస్, బీజేపీల అపవిత్ర పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం వల్ల ప్రజలు నానా బాధాలు పడ్డారని దుయ్యబట్టారు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని అన్నారు. దేవెగౌడ కుటుంబం ఏనాడూ బహిరంగ రాజకీయాలు చేయలేదని, నిగూఢ ఒప్పందాలతోనే రాజకీయాలు చేసిందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.