పాక్‌ బోర్డు కుట్రపూరితంగా వ్యవహరించింది

Will Appeal To Ganguly On Life Ban Says Danish Kaneria - Sakshi

ఇస్లామాబాద్‌ : అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఎన్నికైతే తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరతానంటూ తెలిపాడు. ఆదివారం ఓ లోకల్‌‌ చానల్‌తో మాట్లాడిన కనేరియా.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్టు (పీసీబీ) తనపై కుట్రపూరితంగా వ్యవరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎన్నికైతే తనకు సాయం చేస్తాడనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని తొలగించాలని పాక్‌ క్రికెట్‌ బోర్డులోని ప్రతి ఒక్కరి కాళ్లావేళ్లా పడ్డనని, కానీ ఏ ఒక్కరూ కరునించలేదని తన గోడును వెల్లబోసుకున్నాడు. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!)

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు సైతం ఎన్నోసార్లు తన సమస్యను విన్నవించానని, కానీ మాజీ క్రికెటర్‌ అయిఉండి కూడా ఆయన నుంచి సానుకూల స్పందన కరువైందని ఆవేదన చెందాడు. ఇప్పటికే అనేక మంది ఐసీసీ పెద్దలను సైతం కలిశానని, ఏ ఒక్కరూ కూడా తనను ఆదుకోలేదని కనేరియా గుర్తుచేశాడు. గంగూలీ తన బాధను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తనపై నిషేధం తొలగించినా ప్రస్తుతం మైదానంలోకి దిగే ఆలోచన తనకు లేదని, పాక్‌ పౌరుడిగా గౌరవం దక్కితేచాలని వ్యాఖ్యానించారు. కాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ (2009) సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు స్పిన్నర్ డానిష్ కనేరియాపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జీవిత కాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విధించిన బహిష్కరణపై కనేరియా చేసుకున్న అప్పీల్‌ పీసీబీ తిరస్కరించి నిషేధాన్ని సమర్థించింది. 

క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో కనేరియా ఎలాంటి జోక్యం చేసుకోకుండా జీవిత కాలంపాటు బహిష్కరించామని పీసీబీ 2009లో ప్రకటించింది. అయితే ఈ కేసులో ఆది నుంచీ పీసీబీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని బలిపశువును చేసిందని లెగ్ స్పిన్నర్‌ కనేరియా అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువును కావడం వల్లే  తమ దేశ క్రికెట్ బోర్డు సాయం చేయలేదని బహిరంగానే విమర్శలు గుప్పించారు. కాగా అతను 61 టెస్టుల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించి 261 వికెట్లు పడగొట్టాడు. కాగా గంగూల్‌ ఐసీసీ చైర్మన్‌ రేసులోకి వచ్చాడంటూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top