కోహ్లి ‘వీక్‌’ పాయింట్‌ అదేనా?

Virat Kohli Has Struggled Against Leg Spin Over The Years - Sakshi

హామిల్టన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి అసలు పరిచయమే అక్కర్లేదు. దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత పరుగుల మోత మోగిస్తూ రికార్డులు మీద రికార్డులు కొల్లగొడుతూ తన కెరీర్‌లో అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెండూల్కర్‌(100), పాంటింగ్‌(71)ల తర్వాత స్థానం కోహ్లిదే. అయితే కోహ్లి సెంచరీ చేసి చాలాకాలమే అయ్యింది. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ఆగస్టులో విండీస్‌పై శతకం సాధించాడు. ఆపై ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కానీ, న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల  సిరీస్‌లో కానీ కోహ్లి బ్యాట్‌ నుంచి సెంచరీ రాలేదు. ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్‌లో సెంచరీ సాధించని కోహ్లి.. కివీస్‌తో సుదీర్ఘ సిరీస్‌ కాబట్టి శతకం ఖాయమనుకున్నారు. ఈ టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసినా కోహ్లి తన తొలి అంతర్జాతీయ టీ20 శతకాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాడు. (ఇక్కడ చదవండి: సెహ్వాగ్‌ తర్వాత అయ్యర్‌..)

అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 78 పరుగులు చేసిన కోహ్లి.. మూడో వన్డేలో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో కోహ్లి రాణించడంతోనే భారత్‌ సిరీస్‌ను గెలుచుకుంది. తొలి వన్డేను టీమిండియా కోల్పోయినా.. ఆపై కోహ్లి బ్యాట్‌ నుంచి విలువైన పరుగులు రావడంతో సిరీస్‌ను సునాయాసంగానే చేజిక్కించుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో ఔటైన కోహ్లి.. రెండో వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించినా జంపాకే చిక్కాడు. దాంతో  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లిని ఎక్కువగా ఔట్‌ చేసిన సక్సెసఫుల్‌ బౌలర్‌గా జంపా నిలిచాడు. కోహ్లిని ఇప్పటివరకూ జంపా ఏడుసార్లు ఔట్‌ చేశాడు. ఇదిలా ఉంచితే,  కోహ్లి ఆడిన గత నాలుగు వన్డేలను పరిశీలిస్తే లెగ్‌ స్పిన్నర్‌కు మూడు సందర్భాల్లో ఔటయ్యాడు. రెండుసార్లు జంపాకు చిక్కితే, మరొకటి న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో చోటు చేసుకుంది. 

కివీస్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోథీ బౌలింగ్‌లో కోహ్లి బౌల్డ్‌ అ‍య్యాడు. 51 పరుగుల స్కోరు వద్ద ఉండగా సోథీ వేసిన బంతిని అంచనా వేయడంలో కోహ్లి తడబడ్డాడు.  ఓవరాల్‌గా కోహ్లి తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకూ 185సార్లు ఔటైతే అందులో 17 సార్లు లెగ్‌స్పిన్నర్లకే చిక్కడం ఇక్కడ గమనార్హం. సాధారణంగా హాఫ్‌ సెంచరీలను సెంచరీలగా మలచుకోవడంలో కోహ్లి దిట్ట. హాఫ్‌ సెంచరీలను ఎలా భారీ స్కోర్లుగా మార్చుకోవాలో కోహ్లిని చూసి నేర్చుకోవాలనే క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడిన సందర్భాలు ఎన్నో. మరి కోహ్లి ఇప్పుడు అర్థశతకాల్ని సెంచరీలు మార్చుకోవడంలో విఫలమవుతున్నాడనే చెప్పాలి. చివరి నాలుగు వన్డేల్లో మూడుసార్లు హాఫ్‌ సెంచరీలు సాధించినా అందులో కోహ్లి ఒక్కసెంచరీ కూడా చేయలేదు. ఆసీస్‌తో రెండు, మూడు వన్డేల్లో సెంచరీ చేస్తాడనుకున్న తరుణంలో కోహ్లి విఫలమయ్యాడు. కివీస్‌తో తొలి వన్డేలో కూడా కోహ్లి మంచి టచ్‌లో ఉన్న సమయంలో వికెట్‌ సమర్పించుకున్నాడు. (ఇక్కడ చదవండి: ఇరగదీసిన టీమిండియా)

ఈ మూడు సమయాల్లో లెగ్‌స్పిన్నర్‌కే కోహ్లి వికెట్‌ను ఇచ్చాడు.  2018లో ఇంగ్లిష్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌ కోహ్లి స్టంపౌట్‌ అయ్యాడు. అది కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లోనే తొలి స్టంపౌట్‌గా నిలవగా, ఆ తర్వాత కూడా లెగ్‌ స్పిన్నర్లకే కోహ్లి ఎక్కువ ఔట్‌ అవుతూ  వస్తున్నాడు.  2018 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌.. కోహ్లిని పలుమార్లు ఔట్‌ చేశాడు. ప్రధానంగా ఆ సీజన్‌లో అందరికంటే ఎక్కువగా స్పిన్‌ బౌలింగ్‌లో ఔటైన అపప్రథను కోహ్లి మూటగట్టుకున్నాడు. ఇప్పటికీ లెగ్‌ స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడుతున్న కోహ్లికి ఇదే వీక్‌ పాయింట్లలా ఉంది.  కివీస్‌తో తొలి వన్డేలో ఔటైన తర్వాత సోథీ  వేసిన బంతిపై హెడ్‌కోచ్‌ రవిశాస్త్రితో కోహ్లి చర్చించాడు. ఆ బంతి ఎలా వచ్చింది.. దాన్ని ఎలా ఆడాలి అనేది కూడా రవిశాస్త్రి చెప్పడం కనబడింది. లెగ్‌ స్పిన్‌ను ఆడటమే కోహ్లి వీక్‌ పాయింట్‌గా గడిచిన కొన్నేళ్లుగా వస్తూ ఉండటంతో ఇప్పుడు దానిపై సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top