‘నైకీ’ నచ్చడం లేదు!

‘నైకీ’ నచ్చడం లేదు!


టీమ్‌ కిట్‌పై భారత ఆటగాళ్ల ఫిర్యాదు

∙ కొత్త దుస్తులు పంపించిన నైకీ
ముంబై: మైదానంలో అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న భారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు తమకు సంబంధించిన ఒక కొత్త ఫిర్యాదును ముందుకు తెచ్చింది. అధికారిక అపెరల్‌ పార్ట్‌నర్‌ ‘నైకీ’ తమకు అందజేస్తున్న కిట్‌లపై ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్‌ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉన్న ‘నైకీ’ 2006 నుంచి భారత క్రికెట్‌ టీమ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలలుగా వివిధ మ్యాచ్‌లలో తాము ధరిస్తున్న జెర్సీలు ‘నాసిరకంగా’ ఉన్నాయని కెప్టెన్‌ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు బీసీసీఐకి తెలియజేశారు. భారత క్రికెట్‌ జట్టుతో 2020 సెప్టెంబర్‌ వరకు కాంట్రాక్ట్‌ ఉన్న ‘నైకీ’... అందుకోసం గత ఏడాది బోర్డుకు రూ. 370 కోట్లు చెల్లించింది. మొత్తంగా తమ బ్రాండ్‌ను ధరిస్తున్నందుకు కాంట్రాక్ట్‌ అమల్లో ఉన్న సమయంలో జరిగే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు నైకీ దాదాపుగా రూ. 87 లక్షల 34 వేలు బీసీసీఐకి చెల్లిస్తోంది.  భారత ఆటగాళ్ల ఫిర్యాదు గురించి తెలుసుకున్న ‘నైకీ’ వెంటనే స్పందించింది. తమ బ్రాండ్‌కు చెందిన కొత్త జెర్సీలు, ఇతర దుస్తులను బెంగళూరు నుంచి హడావిడిగా పంపించింది. పల్లెకెలె మైదానంలో మంగళవారం క్రికెటర్ల ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సమయానికి కిట్‌లు మైదానం చేరుకున్నాయి. నలుగురు సభ్యుల ‘నైకీ’ బృందం టీమిండియా ఆటగాళ్లు, అధికారులతో కూడా అక్కడే చర్చించింది. ధోని, రోహిత్‌ శర్మలు కొత్త జెర్సీలను పరిశీలించిన తమ అభిప్రాయాలు, సూచనలు వారికి తెలియజేశారు.   కోహ్లి కోసమేనా...

భారత కెప్టెన్‌గా, నంబర్‌వన్‌ ఆటగాడిగా శిఖరాన ఉన్న విరాట్‌ కోహ్లి ఇప్పుడు ఏం చేసినా, చెప్పినా అది చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కోచ్‌గా కుంబ్లేను తొలగించడం అలాంటి పరిణామమే. తాజాగా ‘నైకీ’ గురించి ఆటగాళ్లు గళమెత్తడం వెనక కూడా కోహ్లినే కారణమని వినిపిస్తోంది. బయటికి నాణ్యతాలోపం గురించి చెప్పినా అసలు విషయం కోహ్లి బ్రాండ్‌ ‘పూమా’కు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అంతర్గత సమాచారం. ‘పూమా’తో గత ఫిబ్రవరిలో కోహ్లి రూ. 110 కోట్ల భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవలే అది అమల్లోకి వచ్చింది.అయితే ఉసేన్‌ బోల్ట్‌ సహా పలువురు స్టార్‌ ఫుట్‌బాలర్లు ‘పూమా’కు అంబాసిడర్లుగా ఉన్నా...నైకీ, అడిడాస్‌లతో పోలిస్తే ఆ బ్రాండ్‌ మార్కెట్‌ భారత్‌లో చాలా తక్కువ. దానిని పెంచుకునే ప్రయత్నంలోనే అది కోహ్లిని ఎంచుకుంది. భారత్‌లో ఎక్కువ మందికి చేరువ కావాలంటే క్రికెట్‌తో జత కట్టాల్సిన అవసరాన్ని ‘పూమా’ గుర్తించింది. నంబర్‌వన్‌ బ్రాండ్‌ను పదేళ్లకు పైగా వాడుతున్న తర్వాత జెర్సీల నాణ్యత గురించి ఆటగాళ్లు ప్రశ్నించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ సాకుతో ఒప్పందంలో ఉన్న ‘అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయవచ్చు’లాంటి క్లాజ్‌ను ఉపయోగించించి ఇప్పుడు నైకీని కూడా పక్కన పెడతారా, ఆ తర్వాత కోహ్లి కోరితే పూమాను ముందుకు తెస్తారా అనేది చూడాల్సిందే.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top