
కోహ్లి ఫిటెనెస్ రహస్యం వెల్లడి!
అత్యంత ఫిటెనెస్ కలిగిన ప్రపంచ క్రీడాకారుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు.
న్యూఢిల్లీ: అత్యంత ఫిటెనెస్ కలిగిన ప్రపంచ క్రీడాకారుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు. చెక్కిన శిల్పంలా ఉంటుంది అతడి దేహదారుఢ్యం. అయితే దీనివెనుకున్న రహస్యాన్ని 'ఛేజింగ్ స్టార్' బయట ప్రపంచానికి వెల్లడించాడు. ఫిట్‌గా ఉండేందుకు వ్యాయమశాలలో ఎటువంటి కసరత్తులు చేస్తాడో, ఎలాంటి ఆహారం తీసుకుంటాడో వీడియో ద్వారా బయటపెట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫిట్‌నెస్ కోచ్ శంకర్ బసు శిక్షణలో కోహ్లి తన దేహాన్ని తీర్చిదిద్దుకున్నాడు. జిమ్‌లో కోహ్లి చేయాల్సిన పనుల గురించి శంకర్ బసు వైట్ బోర్డు రాస్తాడు. అందులో రాసిన వాటిని పాటిస్తూ కసరత్తులు చేస్తూ వీడియోలో కనబడతాడు కోహ్లి. గంటల పాటు జిమ్‌లో గడుపుతూ అతడు చేసే ఎక్సైర్‌సైజులు చూస్తే ఫిట్‌నెస్ పట్ల కోహ్లికి ఉన్న అంకితభావం అర్థమవుతుంది. 28 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ తన ఆటతో ప్రపంచ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు. స్వల్ప కాలంలోనే మూడు ఫార్మాట్లలో 50పైగా బ్యాటింగ్ సగటు కలిగిన ఏకైక క్రికెటర్‌గా అతడు ఎదిగాడు.