 
															గెలిస్తే కన్నీళ్లు వస్తాయ్
మహిళల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో జపాన్ స్మిమ్మర్ కనేటో రీ స్వర్ణం సాధించింది. వివాదాస్పద (రెండుసార్లు డోపింగ్ నిషేధం
జయహో కనేటో
	
	మహిళల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో జపాన్ స్మిమ్మర్ కనేటో రీ స్వర్ణం సాధించింది. వివాదాస్పద (రెండుసార్లు డోపింగ్ నిషేధం ఎదుర్కొన్న) రష్యా అథ్లెట్ యులియా ఎఫిమోవా కన్నా 1.67 సెకన్ల ముందు రేసు పూర్తి చేసింది. విజయం తర్వాత ఆనందాన్ని తట్టుకోలేక ఈమె ఉద్వేగానికి గురైంది. అయితే విజయం ఆనందాన్నిచ్చినా.. మరింత ఉత్తమ టైమింగ్ నమోదు చేయనందుకు బాధగా ఉందని కనేటో తెలిపింది. చైనాకు చెందిన షీజింగ్ లిన్ మూడో స్థానంతో కాంస్యాన్ని అందుకుంది.
	16 ఏళ్లకే స్వర్ణం
	అమెరికా స్విమ్మర్.. పదహారేళ్ల సిమోన్ మాన్యుయెల్ మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో బంగారు పతకం గెలుపొందింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి ఆఫ్రో-అమెరికన్‌గా రికార్డులకెక్కింది. చిన్నవయసులో ప్రపంచ అత్యుత్తమ క్రీడా వేదికపై అవార్డు అందుకునే అవకాశం రావటంతో సిమోన్ ఆనందం పట్టలేక ఏడ్చేసింది. అయితే ఈ రేసులో సిమోన్‌తో పాటు కెనడా స్విమ్మర్ పెన్నీ ఒలెక్సియాక్ ఒకే సమయంలో (52.70 సెకన్లు) రేసు పూర్తి చేయటంతో ఇద్దరికీ స్వర్ణపతకాన్ని అందించారు.
	
	మా లాంగ్.. మహదానందం
	టీటీలో చైనా హవా కొనసాగుతోంది. ప్రపంచ నెంబర్ వన్ మా లాంగ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్లో చైనాకే చెందిన డిఫెండింగ్ చాంపియన్ ఝాంగ్ జైక్‌పై 4-0 (14-12, 11-5, 11-4, 11-4) తేడాతో గెలిచి.. టీటీలో ఐదో మేల్ గ్రాండ్‌స్లామ్ (ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ కప్, ఒలింపిక్ గోల్డ్) విజేతగా నిలిచాడు. లాంగ్‌కు ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణం. ఇది రియోలో చైనాకు 11వ బంగారు పతకం. లండన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లోనే ఇంటిబాట పట్టిన లాంగ్.. ఈసారి ఏకంగా డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించాడు.
	
	సిమోనా మజాకా!
	అమెరికా జిమ్నాస్టిక్ సంచలనం సిమోన్ బైల్స్ రియోలో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఆల్‌రౌండ్ టైటిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బైల్స్ రియోలో 62.198 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఓ ప్రపంచ చాంపియన్.. ఒలింపిక్స్ గోల్డ్ గెలవటం 1996 తర్వాత ఇదే తొలిసారి కావటం విశేషం. టీమ్ ఆల్‌రౌండ్ ఈవెంట్లోనూ అమెరికా స్వర్ణం గెలవటంలో సిమోన్ బైల్స్ పాత్ర కీలకం.
	వారెవా.. అలెగ్జాండ్రియా
	లండన్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఈవెంట్లో టైబ్రేక్‌తో తృటిలో పోడియం అవకాశాన్ని కోల్పోయిన అమెరికా జిమ్నాస్ట్ అలెగ్జాండ్రియా రైజ్‌మాన్... ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా రజతాన్ని అందుకుంది. అప్పటి పతకం మిస్సైన బాధేంటో ఆమెకు తెలుసు. అందుకే రజతం అందుకోగానే కన్నీటితో ఆనందాన్ని వ్యక్తపరిచింది. రష్యన్ జిమ్నాస్ట్ ముస్తాఫినా ఆలియా.. మూడో స్థానంలో నిలిచింది. 2012లో ముస్తాఫినా కారణంగానే.. అలెగ్జాండ్రియా పతకం మిస్సైంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
