క్రీడాస్పూర్తి చాటిన అభిమానులు

Sri Lankan Fans Cleaned The Pallekele Stadium  - Sakshi

పల్లెకెలె : క్రికెట్‌ అంటేనే ఓ పిచ్చిగా ఆరాధిస్తారు. తమ అభిమాన జట్టుకు ఆశించిన మేర ఫలితం రాకపోతే మైదానంలో వీరంగం సృష్టిస్తారు. అభిమాన ఆటగాళ్లనే నిందిస్తారు. ఇలా మైదానంలో బాటిళ్లు విసురుతూ.. మ్యాచ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఘటనలున్నాయి. అభిమాన క్రికెటర్‌ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి క్రికెట్‌లో శ్రీలంక అభిమానుల ప్రవర్తించిన తీరు ఔరా అనిపిస్తోంది. వారి చర్య యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. వారి ప్రవర్తన అసలు సిసలు క్రీడాస్పూర్తికి అద్దం పడుతోంది.

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శ్రీలంక వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. పల్లెకెలె మైదానంలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌ లంక ఓడినా ఆ దేశ అభిమానులు చేసిన పనికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం గర్వపడుతోంది. ఓటమిని లెక్క చేయకుండా అభిమానులు స్టేడియంలోని చెత్త ఏరుతూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఈ వీడియోను శ్రీలంక క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఇలా అభిమానులు క్రీడా స్పూర్తి చాటడం ఇదే తొలిసారి కాదు.

ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్‌ అభిమానులు తమ జట్టు ఓడినా.. పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్‌లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. దీంతో అప్పట్లో వారిపై ప్రశంసల జల్లు కురిసింది. మూడో వన్డేలో సఫారీ అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ రీజా హెండ్రీక్స్‌ అజెయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 78 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. రీజా హెండ్రీక్స్‌ 89 బంతుల్లో 102 పరుగులు చేయడంతో సఫారీ 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బరిలోకి దిగిన  ఆతిథ్య జట్టు 285 పరుగులకు కుప్పకూలింది. 

చదవండి: ఇదీ క్రీడా స్ఫూర్తి.!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top