ఇదీ క్రీడా స్ఫూర్తి.!

Japan Fans Clean up Dressing Room Stadium After Painful Loss Against Belgium - Sakshi

మాస్కో : ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.  అయితే ప్రస్తుత ప్రపంచకప్‌ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఔరా అని ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి.

బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ చివర్లో జపాన్‌ జట్టు ఆశలు గల్లంతుకావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్‌ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్‌ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్‌లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు.  ఈ మ్యాచ్‌ తర్వాత  నీలం రంగు ’సామురాయ్‌ డ్రెస్‌’ ధరించిన ఈ అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఎరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఓటమి చవిచూసిన జపాన్‌ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియం లోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్‌ రూమ్‌ లోని కుర్చీలు, సామాగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్‌ భాషలో ’ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్‌ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా  జపాన్‌ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్‌ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం  జపనీస్‌ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్‌ స్కాట్‌ మ్యాక్‌ఇన్‌టైర్‌ చెబుతున్నారు. జపాన్‌దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనగల్‌ అభిమానులు కూడా స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top