విండీస్‌తో మ్యాచ్‌.. టీమిండియా రికార్డులు | Sakshi
Sakshi News home page

విండీస్‌తో మ్యాచ్‌.. టీమిండియా రికార్డులు

Published Mon, Oct 22 2018 12:12 PM

Rohit Sharma and Virat Kohli blitzkrieg steamrolls Windies - Sakshi

గువాహటి: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 323 పరుగుల లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (140; 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(152 నాటౌట్‌;117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్‌ చేసి టీమిండియాకు ‘రికార్డు’ విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే భారత జట్టు పలు ఘనతల్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ-కోహ్లి నెలకొల్పిన 246 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో  ఛేజింగ్‌ చేసే క్రమంలో ఏ వికెట్‌కైనా భారత్ తరపున ఇదే అత్యుత్తమంగా నిలిచింది. ఫలితంగా గతంలో కోహ్లి-గంభీర్‌ల జోడి మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం తెరమరుగైంది. మరొకవైపు రెండో వికెట్‌కు ఇది ఓవరాల్‌గా వన్డేల్లో రెండో అత్యుత్తమ భాగస‍్వామ్యంగా నమోదైంది. 2009లో షేన్‌ వాట్సన్‌-రికీ పాంటింగ్‌లు రెండో వికెట్‌కు నమోదు చేసిన 252 పరుగుల భాగస్వామ్యం తొలి స్థానంలో ఉంది. కాగా, వెస్టిండీస్‌పై  వక్తిగత స్కోర్లు పరంగా చూస్తే రోహిత్‌ సాధించిన 152 పరుగులు భారత్‌ తరపున రెండో అత్యుత్తమం. అంతకముందు వీరేంద్ర సెహ్వాగ్‌(219) నమోదు చేసిన విండీస్‌పై సాధించిన డబుల్‌ సెంచరీ మొదటి స్థానంలో ఉంది. ఇక వన్డేల్లో అత్యధిక సార్లు 150కు పైగా వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇలా రోహిత్‌ 150కు పైగా పరుగులు సాధించడం వన్డేల్లో ఆరోసారి.

ఈ క్రమంలోనే సచిన్‌ టెండూల‍్కర్‌-డేవిడ్‌ వార్నర్‌(ఐదేసి సార్లు) రికార్డును రోహిత్‌ అధిగమించాడు. మరొకవైపు  వన్డేల్లో రోహిత్‌ శర‍్మ-కోహ్లిలు జంటగా సెంచరీలు నమోదు చేయడం ఇది నాల్గోసారి.  దాంతో సచిన్‌ టెండూల్కర్-సౌరవ్‌ గంగూలీల సరసన రోహిత్‌-కోహ్లిల జోడి నిలిచింది. ఇక్కడ జంటగా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో ఏబీ డివిలియర్స్‌-హషీమ్‌ ఆమ్లా(ఐదుసార్లు) జోడి తొలి స్థానంలో ఉంది. వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 36 కాగా, ఈ జాబితాలో సచిన్‌ (49) మాత్రమే అతనికంటే ముందున్నాడు. కెప్టెన్‌గా కోహ్లికిది 14వ సెంచరీ. పాంటింగ్‌ (22) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఛేదనలో 22వ శతకం బాదిన కోహ్లి... ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 60వ సెంచరీ నమోదు చేశాడు.  వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీల సంఖ్య 20 కాగా, భారత్‌ తరఫున సచిన్‌ (49), కోహ్లి (36), గంగూలీ (22) తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ (194) మూడో స్థానానికి చేరాడు. మహేంద్ర సింగ్‌ ధోని (217), సచిన్‌ టెండూల్కర్‌ (195) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.   ఇక ఛేజింగ్‌లో ఆరువేల పరుగుల మార్కును కోహ్లి చేరడం మరో విశేషం. ఇక్కడ సచిన్‌ టెండూల్కర్‌ ఒక్కడే కోహ్లి కంటే ముందున్నాడు.

ఇక్కడ చదవండి: సెంచరీల సరదాట

మహ్మద్‌ షమీ చెత్త రికార్డు

Advertisement
Advertisement