ముంబై రంజీ@ 500

Mumbai Ranji @ 500 ranjy match - Sakshi

మైలురాయి మ్యాచ్‌ ఆడనున్న చాంపియన్‌ జట్టు

దేశవాళీ క్రికెట్‌లో తమదైన ముద్ర

41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై

ఎందరో దిగ్గజాలను అందించిన ఘనత

విజయ్‌ మర్చంట్, సునీల్‌ గావస్కర్, అజిత్‌ వాడేకర్, దిలీప్‌ వెంగ్సర్కార్, సచిన్‌ టెండూల్కర్, పాలీ ఉమ్రీగర్, వినూ మన్కడ్, ఫరూఖ్‌ ఇంజినీర్‌... ఒకరా, ఇద్దరా భారత్‌కు ముంబై క్రికెట్‌ అందించిన దిగ్గజాల జాబితాకు ముగింపు లేదు! బాంబే తొలి తరం నుంచి నేటి రహానే, రోహిత్‌ల వరకు భారత క్రికెట్‌తో ఆ జట్టుకు విడదీయరాని బంధం. రంజీ ట్రోఫీ
చరిత్రలో ముంబై సాధించిన విజయాలు, ఘనతలు, నెలకొల్పిన రికార్డులు మరే జట్టుకూ సాధ్యం కాలేదు. భారత దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై తమ 500వ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ బరిలోకి దిగనుంది.

ముంబై: రంజీ ట్రోఫీని 41 సార్లు సొంతం చేసుకున్న ముంబై జట్టు చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు ఇక్కడి వాంఖెడే మైదానంలో బరోడాతో జరిగే మ్యాచ్‌ రంజీల్లో ముంబైకి 500వది. చిన్న స్థాయి లీగ్‌ల నుంచి పటిష్టమైన వ్యవస్థ, పెద్ద సంఖ్యలో టోర్నీలు, ప్రతిభావంతులకు లభించే అవకాశాలు, అత్యుత్తమ కోచింగ్‌ సౌకర్యాలు... ఇలా అన్నీ వెరసి 83 ఏళ్లుగా రంజీల్లో ముంబైని ‘ది బెస్ట్‌’గా నిలబెట్టాయి. సన్నీ ఆట నేర్చిన మైదానాలతో, సచిన్‌ బ్యాట్‌కు పదును పెట్టిన పార్క్‌లతో కుర్రాళ్ల కలల కేంద్రం ముంబై క్రికెట్‌ దేశవాళీలో అద్భుతాలు చేసింది. ముంబై భాషలో ఆప్యాయంగా చెప్పుకునే ఖడూస్‌ (మొండి పట్టుదల) శైలి ఆ జట్టును, ఆటగాళ్లను కూడా ప్రత్యేకంగా మార్చింది. అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ఆటగాళ్లను అందించిన ముంబై, భారత జట్టులో అంతర్భాగంగా మారిపోయింది. తాజా మ్యాచ్‌ నేపథ్యంలో ముంబై రంజీ జట్టుకు సంబంధించిన కొన్ని విశేషాలు....

అత్యధిక పరుగులు: వసీం జాఫర్‌ (9759), అత్యధిక వికెట్లు: పద్మాకర్‌ శివాల్కర్‌ (361), అత్యుత్తమ బౌలింగ్‌: అంకిత్‌ చవాన్‌ (9/23), సీజన్‌లో అత్యధిక పరుగులు: శ్రేయస్‌ అయ్యర్‌ (1321), అత్యధిక స్కోరు: 855/6 డిక్లేర్డ్‌ (హైదరాబాద్‌పై).

టాప్‌–5 వ్యక్తిగత స్కోర్లు: సంజయ్‌ మంజ్రేకర్‌ (377), విజయ్‌ మర్చంట్‌ (359 నాటౌట్‌), సునీల్‌ గావస్కర్‌ (340), అజిత్‌ వాడేకర్‌ (323), వసీం జాఫర్‌ (314 నాటౌట్‌).
ఇతర దేశవాళీ జట్ల అత్యధిక టైటిల్స్‌: న్యూసౌత్‌వేల్స్‌ (ఆస్టేలియా–షెఫీల్డ్‌ షీల్డ్‌) 46; యార్క్‌షైర్‌ (ఇంగ్లండ్‌– 34); హైవెల్డ్‌ లయన్స్‌ (దక్షిణాఫ్రికా–29); ఆక్లాండ్‌ ఏసెస్, (న్యూజిలాండ్‌ –23).
1934–35లో జరిగిన తొలి రంజీ ట్రోఫీని ముంబై (నాటి బాంబే) గెలుచుకుంది. Üమొత్తం 83 సార్లు రంజీ ట్రోఫీ జరిగితే 41 టైటిల్స్‌ సాధించిన ముంబై మొత్తంగా 46 సార్లు ఫైనల్‌ చేరింది. కేవలం 5 ఫైనల్స్‌లో మాత్రమే ఆ జట్టు ఓటమి పాలైంది. Ü1958–59 సీజన్‌ నుంచి 1972–73 సీజన్‌ వరకు ముంబై వరుసగా 15 సార్లు విజేతగా నిలిచింది.  Üముంబై తమ 100, 200, 300, 400వ రంజీ మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది. Üఎనిమిది సార్లు రంజీ విజేతగా నిలిచిన జట్లలో వసీం జాఫర్‌ సభ్యుడు.

ముంబై క్రికెట్‌లో గట్టి పోటీ ఉండటమే ఆ జట్టు బలం. ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం. విఫలమైతే మరో అవకాశం దక్కడం చాలా కష్టం కాబట్టి ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు.     
– గావస్కర్‌

ముంబై రంజీ జట్టు ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్లను అందించింది. ఇక్కడే నేను ఎంతో నేర్చుకున్నాను. సింహం బొమ్మ ఉన్న జెర్సీని ధరించడాన్ని ప్రతీ ముంబై క్రికెటర్‌ గర్వంగా భావిస్తాడు. పాత విజయాలు చూసుకొని సంబరపడిపోకుండా మళ్లీ అంతే పట్టుదలతో ఆడటం వల్లే ముంబై వరుసగా టైటిల్స్‌ సాధించగలిగింది.    
 – సచిన్‌

మొత్తం 499 మ్యాచ్‌లలో ముంబై 242 గెలిచి 26 ఓడింది. మరో 231 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిశాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top