మహ్మద్‌ షమీ భావోద్వేగం..

Mohammed Shami leaves a heartfelt message for his daughter - Sakshi

టీమిండియా పేసర్‌ మహ్మద్ షమీ తన కుమార్తెని చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు. మహ్మద్ షమీతో గొడవలు కారణంగా అతని భార్య హసీన్ జహన్ గత మూడు నెలల నుంచి పాపతో కలిసి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కి కూడా పాల్పడినట్లు హసీన్ జహన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షమీపై కోల్‌కతా పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇద్దరూ విడిగా ఉంటున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే షమీకి రోడ్డు ప్రమాదం జరగగా.. అతడ్ని చూసేందుకు పాపతో కలిసి ఆసుపత్రికి వచ్చిన హసీన్ జహన్‌తో షమీ మాట్లాడలేదు. అయితే.. పాపతో మాత్రం కాసేపు మాట్లాడినట్లు అప్పట్లో హసీన్ వెల్లడించింది.

 ఫిక్సింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ షమీకి క్లీన్‌చిట్ ఇస్తూ ఐపీఎల్ 2018 సీజన్ ఆడేందుకు అనుమతిచ్చింది. దీంతో.. బిజీగా మారిపోయిన క్రికెటర్ మళ్లీ పాపని కలవలేకపోయాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత.. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుకి ఎంపికైనా యో-యో టెస్టులో ఫెయిలవడంతో.. జట్టుకి దూరమయ్యాడు. ఇటీవల కాలంలో కుటుంబానికి దూరమవడం, జట్టులో చోటు కోల్పోవడం వంటి సమస్యలతో మానసికంగా కుంగిపోయిన మహ్మద్ షమీ.. తన కూతురితో వీడియో ‌కాల్‌లో మాట్లాడగానే భావోద్వేగానికి గురయ్యాడు. ‘ ఐ లవ్‌ యూ మై హార్ట్‌ బీట్‌.. నిన్న మూడు నెలల తర్వాత చూసినందుకు ఆనందంగా ఉంది’ అని  కుమార్తెపై ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నాడు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top