పంచ్‌ అదరాలి..

Mixed martial Arts Brave 20 in Gachibowli Stadium - Sakshi

హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ ఈవెంట్‌కు వేదిక కానుంది.ఈ మేరకు ఈ నెల 22న గచ్చిబౌలి స్టేడియంలో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ‘బ్రేవ్‌–20’ నిర్వహించనున్నారు. కండలు తిరిగిన ఫైటర్లు...కళ్లు చెదిరే పంచ్‌లతో రింగ్‌లో అద్భుతమైన విన్యాసాలు చూడొచ్చనినిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ పోరులో పాల్గొనేందుకు  15 దేశాల నుంచి ప్రముఖ ఫైటర్లు నగరానికి రానున్నారు.∙22న మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ‘బ్రేవ్‌–20’ ∙వేదికైన గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం  ∙15 దేశాల నుంచి ఫైటర్స్‌ హాజరు∙మన దేశ ఫైటర్లకు గేమ్‌లో చోటు  ∙21న నెక్లెస్‌ రోడ్డులో ఫ్రీ ట్రైల్‌

కండలు తిరిగిన ఫైటర్లు.. పళ్లు బిగించి రింగ్‌లో పంచ్‌లు విసురుతుంటే చూస్తున్న వారి ఒళ్లు జలదరించాల్సిందే. ఇటువంటి ఫైటింగ్‌ వీడియోలు చూసే ఉంటాం. లైవ్‌ ఫైట్స్‌ అన్నీ ఇప్పటి దాకా ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ చానల్‌లో మాత్రమే చూసి ఉంటాం. వివిధ రకాల మార్షల్‌ ఆర్ట్స్‌ విదేశాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, కెన్యా, సౌతాఫ్రికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్నవాటిలో ఈ క్రీడలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సరికొత్త ఆట నగరవాసులను అలరించనుంది. భారతదేశంలో తొలిసారి ‘మెర్క్యుర్‌ స్పోర్ట్స్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌(ఎంఎంఏ) ‘బ్రేవ్‌–20’కి గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. ఈ పోరులో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి కండలు తిరిగిన ఫైటర్లు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ‘ఎంఎంఏ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – చైతన్య వంపుగాని

 ఎక్కడిది ఈ ‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’
‘బెహరైన్‌’ దేశంలో అక్కడి యువరాజు ‘షేక్‌ ఖాలీద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా’ మూడేళ్ల క్రితం ‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’(ఎంఎంఏ)ను ‘బ్రేవ్‌–20’ పేరుతో ఈ ఆటను అక్కడ ప్రారంభించారు. ఇలా ఇప్పటి దాకా 22 దేశాల్లో 19 గేమ్స్‌ జరిగాయి. ఇప్పుడు ‘గ్లోబల్‌ ప్రమోషన్‌’ పేరుతో మన దేశంలో ఏర్పాటు చేసేందుకు ‘ఆల్‌ ఇండియా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫెడరేషన్‌’ అనుమతి ఇచ్చింది. దీంతో దీన్ని సిటీలో నిర్వహించేందుకు ‘మెర్క్యూర్‌ స్పోర్ట్స్‌’ సీఈఓ అక్బర్‌ రషీద్‌ ముందుకు వచ్చారు. ప్రమోటర్స్‌ వంశీరాజ్, శ్రీనివాస్, ఆదిత్యతో కలసి ఈ నెల 22న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటను ప్రారంభించనున్నారు. భారతేదశంలో తొలిసారి నగర వేదికపై ఈ క్రీడ జరుగుతుండడంతో క్రేజ్‌ పెరిగిపోయింది.  

బాక్సింగ్‌ను పోలినట్టు..
అందరికీ తెలిసిన బాక్స్‌ంగ్‌ మాదిరిగానే ఈ ఆట కూడా ఉంటుంది. అయితే, ఇందులో ముష్టిఘాతాలతో పాటు కర్రసాము కూడా అదనం. ఈ క్రీడ మిడిల్‌ వెయిట్‌ బౌట్, లైట్‌ వెయిట్‌ బౌట్, బంటమ్‌ వెయిట్‌ బౌట్, స్ట్రావ్‌వెయిట్‌ బౌట్, ఫిదర్‌ వెయిట్‌ బౌట్‌.. ఇలా మొత్తం 12 కేటగిరీల్లో జరుగుతుంది. అండర్‌ కార్డ్‌ విభాగంలో ‘హైవెయిట్‌ బౌట్, బంటమ్‌ వెయిట్‌ బౌట్, మిడిల్‌ వెయిట్‌ బౌట్, లైట్‌ వెయిట్‌ బౌట్, ఫ్లైవైయిట్‌ బౌట్‌’ కేటగిరిల్లో ఇద్దరు చొప్పున తలపడతారు. ఐదు నిమిషాలకు ఓ రౌండ్‌ చొప్పున మూడు రౌండ్స్‌ ఉంటాయి. ఒక్కో గేమ్‌ను 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో ఓ నిమిషం బ్రేక్‌ ఉంటుంది.   

150 మంది ఆటగాళ్లు రాక
గతంలో ‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆటగాళ్లు కూడా ఇప్పుడు జరిగే పోటీలో పాల్గొనేందుకు సిటీకి రానున్నారు. అలాంటి వారు 150 మంది ఉన్నట్టు అక్బర్‌ రషీద్‌ తెలిపారు. వీరిలో మన దేశానికి చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వారిలో లియోన్‌ అలియూ, కాంతరాజ్‌ శంకర్, నెల్సన్‌ ఫయీస్, సతేందర్‌ బంకురా, జాసన్‌ సాల్మన్, సరబ్‌జిత్‌ సింగ్, సత్య బహారియా, నిథిన్‌ కోషీ ఉన్నారు.

21న ఆటగాళ్లతో పరిచయం
ఈ ఆటను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ‘మెర్క్యూర్‌ స్పోర్ట్స్‌’ సిద్ధమైంది. క్రీడాకారులను నగరవాసులకు పరిచయం చేసేందుకు సన్నహాలు చేస్తున్నాం. ఈ నెల 21న మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో ట్రయల్‌ ఫైట్స్‌ ఉంటాయి. దీనికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదు.    – అక్బర్‌ రషీద్, మెర్క్యూర్‌ స్పోర్ట్స్‌ సీఈఓ

టికెట్లు ఇలా..
ఈ ఆట టికెట్‌ ధరలు రూ.499 నుంచి రూ.4999 వరకు ఉన్నాయి. గ్యాలరీ టిక్కెట్‌ రూ.499, ప్రీమియం టిక్కెట్‌ రూ.3500, వీవీఐపీ టికెట్‌ రూ.4999. కావాల్సిన వారు  www.meraevents.com లో బుక్‌ చేసుకోవచ్చు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top