ఇప్పుడు చెప్పండ్రా.. మలింగా హేటర్స్‌! | Mahela Jayawardene Has Special Message for Lasith Malinga Haters | Sakshi
Sakshi News home page

ఇప్పుడు చెప్పండ్రా.. మలింగా హేటర్స్‌!

Jun 22 2019 11:40 AM | Updated on Jun 22 2019 1:45 PM

Mahela Jayawardene Has Special Message for Lasith Malinga Haters - Sakshi

మలింగా షర్ట్‌లెస్‌ ఫొటోపై విపరీతమైన ట్రోలింగ్‌..

లండన్‌ : లసిత్‌ మలింగా.. ఇప్పుడు శ్రీలంక అభిమానులకు ఆరాధ్య దైవం. శుక్రవారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఒంటి చేత్తో గెలిపించిన సీనియర్‌ ఆటగాడు. 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్‌ను 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించకుండా మట్టికరిపించిన బౌలర్‌. ప్రపంచకప్‌ టైటిల్‌ ఆశలను సజీవంగా నిలిపిన సూపర్‌ బౌలర్‌. కానీ వారం రోజుల క్రితం.. ఇదే మలింగా అభిమానుల దృష్టిలో అన్‌ఫిట్‌ ఆటగాడు. పొట్ట ఉన్న క్రికెటర్‌‌. రిటైర్మెంట్‌ ప్రకటించాల్సిన ఆటగాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీకెప్టెన్‌ మహేల జయవర్థనే ‘ఇప్పుడు చెప్పండ్రా మలింగా హేటర్స్‌’ అంటున్నాడు. ‘ఓ పుస్తకం కవర్‌ పేజీ చూసి దానిపై ఓ నిర్ణయానికి రాకుడదూ.. మలింగా నీ బౌలింగ్‌ అద్భుతం’ అంటూ మలింగా షర్ట్‌లెస్‌ ఫొటోను జత చేస్తూ ట్వీట్‌ చేశాడు. వారం రోజుల క్రితం ఈ షర్ట్‌లెస్‌ ఫొటోపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. అతని శరీరాకృతిని ప్రస్తావిస్తూ అభిమానులు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు.

ఈ విమర్శలకు మలింగా తన ఆటతోనే బదులిచ్చాడు. తాను ఎంత కీలకమైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. ఇక మలింగా బౌలింగ్‌ వీరంగానికి బెయిర్‌స్టో డకౌట్‌ కాగా.. విన్స్‌ (14), కెప్టెన్‌ మోర్గాన్‌ (21), బట్లర్‌ (10‌)లు పెవిలియన్‌ బాటపట్టారు. టాపర్డర్‌ను మలింగా దెబ్బతీయగా.. ధనంజయ డిసిల్వా (3/32) లోయర్‌ ఆర్డర్‌ పనిపట్టడంతో ఇంగ్లండ్‌ కోలుకోలేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ (89 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా.. శ్రీలంక పక్కా ప్రణాళికతో అతన్నికట్టడి చేసింది. స్టోక్స్‌ బ్యాటింగ్‌ గురించి మ్యాచ్‌ అనంతరం మలింగా మాట్లాడుతూ.. స్టోక్స్‌ ఎంత దాటిగా ఆడగలడో మాకు తెలుసు. అప్పటికే అతను వరుస బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో అతన్ని స్టాక్‌బాల్స్‌‌ వ్యూహంతో కట్టడి చేశాం. లూస్‌ బంతులు వేయకుండా.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు బౌన్సర్లతో కూడిన వైవిధ్యమైన బంతులు వేశాం. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రణాళిక. దాన్ని విజయవంతంగా అమలు చేశాం.’ అని మలింగా చెప్పుకొచ్చాడు. ఇక మలింగా దిగ్గజమంటూ (4/43) ప్రదర్శనను శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే కొనియాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement