సీఎస్‌కేపై పంజాబ్‌ ఘన విజయం | Kings Punjab Beat CSK By 6 Wickets | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేపై పంజాబ్‌ ఘన విజయం

May 5 2019 7:28 PM | Updated on May 5 2019 7:29 PM

Kings Punjab Beat CSK By 6 Wickets - Sakshi

మొహాలీ: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌  ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో జరిగిన తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను కింగ్స్‌ ఘనంగా ముగించి అభిమానులకు కానుకగా ఇచ్చింది. సీఎస్‌కే నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్స్‌ పంజాబ్‌ విజయంలో కేఎల్‌ రాహుల్‌(71; 36 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా, క్రిస్‌ గేల్‌(28; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 108 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌ సునాయాసంగా గెలుపొందింది. ఓ దశలో రాహుల్‌, గేల్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరినా, నికోలస్‌ పూరన్‌(36; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు.

అంతకముందు టాస్‌ ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. చెన్నై ఆదిలోనే షేన్‌ వాట్సన్‌(7) వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రైనా రెండో వికెట్‌గా ఔటయ్యాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించిన రైనా అనవసరపు షాట్‌ను ఆడి వికెట్‌ను సమర్పించుకున్నాడు.

మరొకవైపు డుప్లెసిస్‌ ఆది నుంచి కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్‌.. సామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఇది డుప్లెసిస్‌కు ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈసారి ధోని(10 నాటౌట్‌) భారీ షాట్లకు రాకపోవడంతో సీఎస్‌కే  కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు.

Advertisement
 
Advertisement
Advertisement