
కోహ్లీ నెం1.. ధోని నెం10..
సిరీస్ ఘనవిజయం అనంతరం ఐసీసీ ర్యాంకుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ఘనవిజయంతో సిరీస్‌ను 5-0 తేడాతో సొంతం చేసుకున్న అనంతరం ఐసీసీ ర్యాంకుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకతో సిరీస్ క్లీన్‌స్వీప్ అనంతరం మూడు పాయింట్లు పెంచుకున్నా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. భారత్‌కు కూడా 117 పాయింట్లు ఉన్నా దశాంశాల్లో మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియా రెండోస్థానంలో ఉంది. రెండు పాయింట్లు కోల్పోయిన శ్రీలంక 86 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఇంక చివరి స్థానంలో ఐర్లాండ్ ఉంది.
బ్యాట్‌మెన్‌ల విషయానికి వస్తే శ్రీలంక సిరీస్‌లో 330 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 887 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆష్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోని టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. 749 పాయింట్లతో పదోస్థానంలో ఉన్నాడు.
బౌలింగ్‌లో భారత యువ కెరటం జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 27స్థానాలు మెరగుపరుచుకొన్నాడు. 687 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హజల్‌ఉడ్ 732 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్ రెండోస్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్క్ మూడో స్థానంలో ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా రెండు స్ధానాలు మెరుగు పరుచుకొని 61వ స్థానాకి చేరాడు. ఇంక ఆల్ రౌండర్ల జాబితాలో భారత్‌కు చెందిన ఏ ఒక్క ఆటగాడు స్థానం దక్కించకోలేదు.