కుర్రాళ్లకు ఇదో సవాల్‌! 

Indian Under-19 coach Dravid - Sakshi

భారత అండర్‌–19 కోచ్‌ ద్రవిడ్‌  

ప్రపంచకప్‌ కోసం నేడు న్యూజిలాండ్‌కు పయనం

ముంబై: అండర్‌–19 ప్రపంచకప్‌కు భారత  జట్టును సన్నద్ధం చేసిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తమ సేనలోని కుర్రాళ్లను త్వరలోనే భారత్‌ ‘ఎ’జట్టులో చూడాలనుకుంటున్నారు. న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చే ఈ జూనియర్‌ ప్రపంచకప్‌ కోసం భారత అండర్‌–19 జట్టు గురువారం ఉదయం బయల్దేరనుంది. ఈ సందర్భంగా కోచ్‌ ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ఎంపికైన కుర్రాళ్లెవరికీ కివీస్‌లో ఆడిన అనుభవమే లేదు. దీంతో ఈ ప్రపంచకప్‌ వాళ్లకు పెద్ద చాలెంజ్‌. అక్కడ రాణిస్తే తిరుగుండదు. బహుశా వచ్చే 6–8 నెలల్లో భారత్‌ ‘ఎ’ జట్టుకు ఆడినా ఆడవచ్చు. వాళ్లకది గొప్ప ఘనత అవుతుంది. ఆపై సీనియర్‌ జట్టుకూ ఎంపిక కావచ్చు’ అని అన్నారు. అయితే వీళ్లలో ఎవరు మేటి ఆటగాళ్లవుతారు? ఎవరు జాతీయ జట్టులోకి ఎంపికవుతారని చెప్పడం తగదన్నారు. ఈ యువ జట్టు కెప్టెన్‌ పృథ్వీ షా ఇప్పటికే భారత్‌ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాడు. ‘భారత ‘ఎ’, అండర్‌–19 జట్ల కోచ్‌గా నేనెంతో నేర్చుకున్నాను. ఈ తరం కుర్రాళ్లది పూర్తిగా భిన్నమైన నేపథ్యం. వాళ్ల ఆలోచనలు కూడా భిన్నమే. మూడు ఫార్మాట్లను ఆకళింపు చేసుకోగలరు. నిజంగా ఇది పెను సవాల్‌. ఎందుకంటే ఇప్పుడు ఆట ఎంతో మారింది’ అని ద్రవిడ్‌ అన్నారు.

వచ్చే నెల 13 నుంచి కివీస్‌లో జరిగే మెగా ఈవెంట్‌లో పృథ్వీ షా సేన చక్కగా రాణిస్తుందనే విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు. ముందుగా కివీస్‌ పరిస్థితులకు అలవాటు పడాలన్నారు. బెంగళూరులో నిర్వహించిన శిబిరంలో అలాంటి వాతావరణం కల్పించినప్పటికీ భౌగోళిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. కెప్టెన్‌ పృథ్వీ షా మాట్లాడుతూ ‘సారథిగా నాకు ఇది సువర్ణావకాశం. అంచనాలకు అనుగుణంగా జట్టును నడిపిస్తాను. ప్రతి ఆటగాడికి తమ వంతు బాధ్యత తెలుసు. భారత్‌ను విజేతగా నిలిపేందుకు వారం తా కష్టపడతారు’ అని అన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో స్థానిక వాతావరణానికి అలవాటు పడతామని చెప్పాడు. అండర్‌–19 మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యుగినియా జట్లతో కలిసి గ్రూప్‌ ‘బి’లో ఉంది. మరోవైపు సీనియర్‌ జట్టు కెప్టెన్‌ కోహ్లి అండర్‌–19 ఆటగాళ్లతో ప్రత్యే కంగా ముచ్చటించి వాళ్లలో స్ఫూర్తి నింపాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top