వన్డేలకు వేళాయె...

India VS New Zealand First ODI Match On 05/02/2020 - Sakshi

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి పోరు

కొత్త ఓపెనింగ్‌ జోడితో టీమిండియా

విలియమ్సన్‌ లేకుండానే బరిలోకి కివీస్‌

ఉదయం గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా పనికొస్తుందని మేం భావించడం లేదు. అందు కోసం ఐపీఎల్‌ ఉంది... తొలి మ్యాచ్‌కు ముందు రోజు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యతోనే ఈ పోరుకు ఏమాత్రం ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను విజయవంతంగా క్లీన్‌స్వీప్‌ చేసిన జోరులో దానికి కొనసాగింపుగా భారత్‌ వన్డే సిరీస్‌ బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై టి20ల్లో కోల్పోయిన పరువును కివీస్‌ వన్డేల్లోనైనా కాపాడుకుంటుందా చూడాలి.

హామిల్టన్‌: భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో రెండో దశ పోరుకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ‘పొట్టి ఫార్మాట్‌’లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లి సేన ఆత్మవిశ్వాసం అంబరాన్ని చుంబిస్తుండగా, అటు న్యూజిలాండ్‌ టి20 గాయాలను మరచి కొత్తగా ఆటను మొదలు పెట్టాలని భావిస్తోంది. భారత్‌ సొంతగడ్డపై ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించగా... న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ‘బౌండరీ పరాజయం’ తర్వాత ఇదే తొలి వన్డే కావడం విశేషం.

షా, మయాంక్‌ అరంగేట్రం... 
సుదీర్ఘ కాలం తర్వాత విజయవంతమైన ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు ఇద్దరూ లేకుండా కొత్త ఆటగాళ్లతో భారత జట్టు ఇన్నింగ్స్‌ ప్రారంభం కానుంది. రాహుల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా సరే... వికెట్‌ కీపర్‌గా అదనపు బాధ్యత ఉంది కాబట్టి అతను ఐదో స్థానంలోనే ఆడతాడని కెప్టెన్‌ కోహ్లి ప్రకటించాడు. దాంతో మయాంక్, షా ఓపెనింగ్‌ చేయడం ఖాయమైపోయింది. ఆ తర్వాత కోహ్లి, అయ్యర్‌లతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఆరో స్థానంలో మరోసారి పాండే కీలక బాధ్యతను పోషించాల్సి ఉంటుంది. టి20 సిరీస్‌లో చక్కటి ఇన్నింగ్స్‌ల తర్వాత పాండే కూడా ఉత్సాహంతో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా జడేజా స్థానానికి ఢోకా లేకపోగా, చహల్‌కు బదులుగా కుల్దీప్‌కు వన్డేల్లో ప్రాధాన్యత లభించడం ఖాయం. షమీ, బుమ్రా జోరు చూపిస్తే కివీస్‌కు ఇబ్బందులు తప్పవు.

విలియమ్సన్‌ అవుట్‌... 
న్యూజిలాండ్‌ కూడా గాయాలతో సతమతమవుతోంది. టి20ల్లో ఆడని బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ ఇప్పటికీ కోలుకోకపోగా, కెప్టెన్‌ విలియమ్సన్‌ కూడా గాయంతో తొలి రెండు వన్డేల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో లాథమ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీతో పాటు విలియమ్సన్‌ బ్యాటింగ్‌ సేవలు కోల్పోవడం జట్టుకు పెద్ద లోటు. లాథమ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం చెప్పుకోదగ్గ అంశం. వన్డేల్లో టేలర్‌ ప్రభావవంతమైన బ్యాట్స్‌మన్‌ కాబట్టి అతడిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), పృథ్వీ షా, మయాంక్, అయ్యర్, రాహుల్, పాండే, జడేజా, శార్దూల్, షమీ, కుల్దీప్, బుమ్రా.
న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్‌), గప్టిల్, నికోల్స్, చాప్‌మన్, టేలర్, గ్రాండ్‌హోమ్, నీషమ్, సాన్‌ట్నర్‌/సోధి, జేమిసన్, బెన్నెట్, కుగ్‌లీన్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top