క్రికెట్‌లో ‘కొల్పాక్’ ఖేల్ ఖతం

యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ వైదొలగడమే కారణం
కేప్‌టౌన్: గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ను బాగా దెబ్బ తీసిన కొల్పాక్ ఒప్పందం కథ ముగిసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాలకు చెందిన వ్యక్తులకు వర్క్ పర్మిట్‌తో ఈయూ ఉద్యోగుల తరహాలోనే అన్ని హక్కులు వర్తిస్తాయి. దీనిని ఉపయోగించుకొని కైల్ అబాట్, ఒలివర్, రిలీ రోసో, సైమన్ హార్మర్‌వంటి పలువురు కీలక ఆటగాళ్లు సహా 45 మంది క్రికెటర్లు సునాయాసంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడే అనుమతి పొంది బాగా డబ్బులు సంపాదించుకున్నారు. కొల్పాక్ ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లకు మళ్లీ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం ఉండదు. ఈ కారణంగా దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్ బాగా బలహీన పడింది.
అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకుంది. దాంతో కొల్పాక్ ఒప్పందాలకు ఇకపై అవకాశం లేదు. ఇప్పుడు సఫారీ ఆటగాళ్లంతా సొంతగడ్డపైనే తమ సత్తాను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే వెళ్లిపోయిన వారి పట్ల కూడా తాము కఠిన వైఖరి అవలంబించమని, తిరిగి వస్తే స్వాగతిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ కొత్త డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రకటించాడు. ‘కొల్పాక్ కథ ముగిసిపోయింది కాబట్టి మా దేశపు అత్యు త్తమ ఆటగాళ్లంతా ఇక్కడే ఆడాలని కోరుకుంటున్నాం. వస్తారా లేదా అనేది వారిష్టం. వారిని ప్రోత్సహించడం మా బాధ్యత. వారంతా మళ్లీ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ఆడితే వారి ప్రదర్శనను బట్టి జాతీయ జట్టులోకి ఎంపిక చేయడానికి అభ్యంతరం లేదు’ అని స్మిత్ స్పష్టం చేశాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి