‘మీరిచ్చే ఆ 40 లక్షలు నాకొద్దు’

Former COA Member Ramachandra Guha Declines BCCI Payment - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ పూర్థి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం పూర్తిస్థాయిలో బాధ్యతలు చేప్పటడంతో సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడింది. అయితే ఇన్నాళ్లు భారత క్రికెట్‌ వ్యవహారాలు చూసిన సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌, సభ్యురాలు డయానా ఎడుల్జీకి 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలిని బీసీసీఐ నిర్ణయిచింది. వీరితో పాటు కొన్ని నెలలు సీఓఏలో సభ్యులుగా ఉన్న విక్రమ్‌ లిమాయేకు రూ. 50.5 లక్షలు, రామచంద్ర గుహకు రూ. 40 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ భావించింది. అయితే బీసీసీఐ నిర్ణయంపై రామచంద్ర గుహ భిన్నంగా స్పందించాడు. తనకు బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు. 

‘సీఓఏ సభ్యుడిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పదవిని డబ్బు కోసం చేపట్టలేదు. అయితే ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అదేవిధంగా 33 నెలలు పనిచేసి(వినోద్‌ రాయ్‌, ఎడుల్జీ) బీసీసీఐ ఇచ్చే భారీ వేతనాన్ని అంగీకరించడం కూడా సరైనదిగా భావించడం లేదు. ఇక నేను కమిటీ సభ్యుడిగా పనిచేసింది కొన్ని నెలలైనా క్రికెట్‌ అభివృద్దికి నా వంతు కృషి​ చేసా. నేను బాధ్యతలు చేపట్టే సరికి క్రికెట్‌ పరిపాలన గందరగోళంగా ఉంది. అయితే పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాను’అంటూ బీసీసీఐకి రామచంద్ర గుహ లేఖ రాశాడు. ఇక 2017లో టీమిండియా కోచ్‌-కెప్టెన్‌ మధ్య జరిగిన వివాదంలో రామచంద్ర గుహ కుంబ్లేకే మద్దతుగా నిలిచాడు. అయితే కుంబ్లేను తొలగించడంపై ‘సూపర్‌ స్టార్‌ సంస్కృతి మొదలైంది’అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  

బోర్డులో రోజువారి కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు 2017లో అప్పటి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించింది. జస్టిస్ లోథా సంస్కరణలు అమలు చేసేందుకు 2017 జనవరిలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ, రామచంద్ర గుహలతో కూడిన క్రికెట్ పరిపాల కమిటీ(సీఓఏ)ని నియమించింది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో 2017 జులైలో రామచంద్ర గుహ, అనంతరం విక్రమ్‌ లిమాయే కూడా సీఓఏ నుంచి తప్పుకున్నారు. అయితే వీర్దిదరూ పక్కకు జరిగినప్పటికీ వినోద్‌ రాయ్‌, ఎడుల్జీలు భారత క్రికెట్‌ వ్యవహారాలను సమర్థంగా చూసుకున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top