సూపర్‌ ఓవర్‌ను కివీస్‌ కొనితెచ్చుకుంది!

Extras Defeat New Zealand In Series Decider Match Against England - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. సిరీస్‌ నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లడంతో ఇంగ్లండ్‌ ఇక్కడ అవకాశాన్ని వదల్లేదు. అయితే సూపర్‌ ఓవర్‌కు ముందు బ్యాటింగ్‌లో మెరిసింది మాత్రం కచ్చితంగా న్యూజిలాండే. చివరి టీ20కి వరుణుడు పలుమార్లు ఆటంకం కల్గించడంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్దానికి 146 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌(50; 20 బంతుల్లో 3 పోర్లు, 5 సిక్సర్లు), మున్రో(46; 21 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. చివర్లో టిమ్‌ సీఫెర్ట్‌( 39; 16 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించి కాపాడుకునే స్కోరునే ఇంగ్లండ్‌ ముందుంచింది.

ఈ ఛేదనలో ఇంగ్లండ్‌ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు చివరి వరకూ ఉండటంతో తప్పితే అద్భుతాలు ఏమీ చేయలేదు. బెయిర్‌ స్టో(47; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడు మినహాయించి సామ్‌ కరాన్‌(24; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) , మోర్గాన్‌(17; 7 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు), టామ్‌ కరాన్‌( 12; 9 బంతుల్లో 1 సిక్స్‌), క్రిస్‌ జోర్డాన్‌(12 నాటౌట్‌; 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), శామ్‌ బిల్లింగ్స్‌(11 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌)లు తలో చేయి వేశారు. కాకపోతే న్యూజిలాండ్‌ను కొంప ముంచింది మాత్రం కచ్చితంగా ఎక్స్‌ట్రాలే. అసలు మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లడానికి కారణం కివీస్‌ బౌలర్లు వేసిన ఎక్స్‌ట్రాలు.  సూపర్‌ ఓవర్‌కు ముందు ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 పరుగులు మాత్రమే ఎక్స్‌ట్రాలుగా రాగా, ఒక్క కివీస్‌ 9 ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకుంది. మరి ఇంగ్లండ్‌ కేవలం ఒకే ఒక్క ఎక్స్‌ట్రా పరుగును ఇచ్చింది.  అది కూడా లెగ్‌ బై.  ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో వైడ్లు కానీ, నో బాల్స్‌ కానీ లేకపోవడం విశేషం.(ఇక్కడ చదవండి: ఇంగ్లండ్‌ ‘సూపర్‌’ దెబ్బకు కివీస్‌ మటాష్‌)

దాంతోనే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అసలు కివీస్‌ బౌలర్లు ఇన్ని ఎక్స్‌ట్రాలు వేయకపోతే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అదే సమయంలో కివీస్‌ సునాయాసంగా గెలిచేది కూడా. మరి న్యూజిలాండ్‌ను ఈసారి ఎక్స్‌ట్రాలే కొంపముంచాయి. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో బౌండరీ రూల్‌ కివీస్‌కు శాపంగా మారితే.. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన తొలి ద్వైపాక్షిక సిరీస్‌ చివరి మ్యాచ్‌ ఎక్స్‌ట్రాల కారణంగా సూపర్‌ ఓవర్‌కు దారి తీయడం, ఇక్కడ పరాజయం వెక్కిరించడం ఆ జట్టుకు మింగుడు పడటం లేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top