ఇంగ్లండ్‌ సాధించింది

England Won Second Test Match Against West Indies - Sakshi

రెండో టెస్టులో వెస్టిండీస్‌పై 113 పరుగులతో విజయం

సిరీస్‌ 1–1తో సమం

మూడో టెస్టు 24 నుంచి

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌తో రెండో టెస్టును ఎలాగైనా నెగ్గి సిరీస్‌ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్‌ దానిని చేసి చూపించింది. మ్యాచ్‌ చివరి రోజు సోమవారం దూకుడైన బ్యాటింగ్‌తో 11 ఓవర్లకే డిక్లేర్‌ చేసి ప్రత్యర్థికి 85 ఓవర్లు ఆడే అవకాశం ఇచ్చి ఇంగ్లండ్‌ సవాల్‌ విసరగా... 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అటు ధాటిగా ఆడలేక, ఇటు ‘డ్రా’ కోసం పూర్తి ఓవర్లు ఎదుర్కోలేక ఒత్తిడిలో విండీస్‌ తలవంచింది.

చివరకు 113 పరుగులతో గెలిచిన రూట్‌ సేన సిరీస్‌ను 1–1తో సజీవంగా ఉంచింది. ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. విండీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. చివరిదైన మూడో టెస్టు ఇదే మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతుంది.

11 ఓవర్లలో 92 పరుగులు...
వెస్టిండీస్‌కు ఊరించే లక్ష్యం విధించి ఒత్తిడిలోకి నెట్టాలని భావించిన ఇంగ్లండ్‌ అందుకు తగినట్లుగానే చివరి రోజు బ్యాటింగ్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 37/2తో ఆట కొనసాగగా, స్టోక్స్‌ దూకుడైన షాట్లతో చెలరేగడంతో వేగంగా పరుగులు వచ్చాయి. ఏకంగా ఓవర్‌కు 8.36 రన్‌రేట్‌తో ఇంగ్లండ్‌ ఆడటం విశేషం. ఈ క్రమంలో స్టోక్స్‌కు రూట్‌ (22), పోప్‌ (12 నాటౌట్‌) సహకరించారు. కేవలం 11 ఓవర్లు సాగిన ఆటలో స్టోక్స్‌ జోరు ప్రదర్శించాడు. రోచ్‌ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను గాబ్రియెల్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత హోల్డర్‌ బౌలింగ్‌లోనూ స్టోక్స్‌ వరుసగా సిక్స్, ఫోర్‌ బాదడంతో ఆధిక్యం 300 పరుగులు దాటింది. అనంతరం కొద్దిసేపటికే రూట్‌ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

బ్రాడ్‌ జోరు...
స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/42) అద్భుత బౌలింగ్‌తో ఆరంభంలోనే వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు. అతని ధాటికి విండీస్‌ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే బ్రూక్స్‌ (136 బంతుల్లో 62; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్లాక్‌వుడ్‌ (88 బంతుల్లో 55; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు. ఈ దశలో విండీస్‌ మ్యాచ్‌ను కాపాడుకొని ‘డ్రా’గా ముగించగలదని అనిపించింది. అయితే బ్లాక్‌వుడ్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాత టపటపా వికెట్లు చేజార్చుకున్న విండీస్‌ ఓటమిని ఆహ్వనించింది. కెప్టెన్‌ హోల్డర్‌ (35) కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top