సరిగ్గా మూడేళ్ల క్రితం ధోని..!

december 30 in 2014, MS Dhoni stuns world cricket with Test retirement - Sakshi

న్యూఢిల్లీ:ఎంఎస్‌ ధోని.. భారత క్రికెట్‌ జట్టును ఉన్నత స్థానంలో నిలిపిన నాయకుడు. భారత్‌కు వన్డే వరల్డ్‌ కప్‌, టీ 20 వరల్డ్‌ కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలను సాధించి పెట్టిన ఏకైక నాయకుడు. ఈ క్రమంలోనే భారత తరపున మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌గా కెప్టెన్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ఇప్పటికీ టీమిండియా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న ధోని..  2014, డిసెంబర్‌ 30వ తేదీన టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. తనకు టెస్టు ఫార్మాట్‌ నుంచి వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైందని భావించిన ధోని ఏకంగా ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ముగిసిన తరువాత ధోని ఈ ఫార్మాట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఆనాడు ధోని తీసుకున్న నిర్ణయంతో విరాట్‌ కోహ్లి టెస్టు పగ్గాలను స్వీకరించాడు.

2005, డిసెంబర్‌ 2వ తేదీన చెన్నైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లోఅరంగేట్రం చేసిన ధోని.. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తన టెస్టు కెరీర్‌లో 38.09 యావరేజ్‌తో 4,876 పరుగుల్ని సాధించాడు.  33 హాఫ్‌ సెంచరీలను నమోదు చేసిన ధోని.. 6 టెస్టు సెంచరీలను సాధించాడు. కాగా, వికెట్‌ కీపర్‌గా 294 అవుట్లలో ధోని భాగస్వామ్యమయ్యాడు. ఇందులో 256 క్యాచ్‌లు పట్టడంతో పాటు 38 స్టంపింగ్‌లు చేశాడు. ఫలితంగా టెస్టు ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన వికెట్‌ కీపర్లలో ధోని ఐదో స్థానం సాధించాడు.  

టెస్టులు.. వన్డేలు..టీ20ల్లో కలిపి అత్యధికంగా 331 మ్యాచ్‌ల్లో జట్టుకు నేతృత్వం వహించిన ఏకైక కెప్టెన్‌. ఇందులో 178 విజయాలను ధోని సారథ్యంలోని భారత్‌ కైవసం చేసుకుంది. 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. 27 విజయాలను సాధిండాడు. ఇక 199 వన్డేలకు కెప్టెన్‌గా చేసి 110 విజయాలను నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్‌లో 72 మ్యాచ్‌లకు గాను 41 విజయాలు భారత్‌ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంచితే,  2013లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్‌ను ధోని సారథ్యంలోని భారత జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. తద్వారా 40 ఏళ్లలో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు పుస్తకాల్లోకి కెక్కింది. ఆ సిరీస్‌లో ధోని కెరీర్‌ బెస్ట్‌ స్కోరును సాధించాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోని(224) డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇలా చెప్పుకుంటూ ధోని సాధించిన ఘనతలు ఎన్నో.. నేటికి ధోనికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదంటే అతనికి ఆటపై ఉన్న నిబద్దతే ఉదాహరణ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top