సాంబా...హో | Brazil Beats Chile in Shootout at World Cup | Sakshi
Sakshi News home page

సాంబా...హో

Jun 29 2014 1:39 AM | Updated on Oct 22 2018 5:58 PM

సాంబా...హో - Sakshi

సాంబా...హో

ఆరోసారి ప్రపంచకప్ దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న బ్రెజిల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన నాకౌట్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజేతగా నిలిచింది.

క్వార్టర్స్‌లో బ్రెజిల్
 పెనాల్టీ షూటౌట్‌లో చిలీపై గెలుపు
 
 నరాలు తెగే ఉత్కంఠ... హిచ్‌కాక్ సినిమాను తలదన్నే సస్పెన్స్... నాకౌట్ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్, చిలీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసిన అభిమాని పరిస్థితి ఇది. నిర్ణీత సమయంలో ఫలితం తేలలేదు. అదనపు సమయంలోనూ మరో గోల్ కాలేదు. దాంతో పెనాల్టీ షూటౌట్‌కు వె ళ్లగా బ్రెజిల్ ఆటగాళ్లు పైచేయి సాధించారు.
 
 గోల్‌కీపర్ జూలియో సీజర్ సూపర్ సేవర్‌గా మారి అభిమానుల దృష్టిలో హీరోగా నిలిచాడు. తద్వారా ప్రపంచకప్ నాకౌట్ దశలో చిలీపై తమకున్న అజేయ రికార్డును ఈ సారి కూడా బ్రెజిల్ జట్టు పునరావృతం చేసింది. అలాగే సొంత గడ్డపై అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న సాంబా సేన సగర్వంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
 
 బెలో హారిజోంట్: ఆరోసారి ప్రపంచకప్ దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న బ్రెజిల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన నాకౌట్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజేతగా నిలిచింది.
 
  శనివారం అర్ధరాత్రి  జరిగిన ఈ మ్యాచ్‌లో చిలీపై 3-2 తేడాతో గెలిచింది. నిర్ణీత సమయంలో 1-1తో స్కోరు సమమైంది. బ్రెజిల్ తరఫున డేవిడ్ లూయిజ్ గోల్ చేయగా చిలీ తర ఫున అలెక్సిస్ సాంచెజ్ గోల్ సాధించాడు. నిర్ణీత సమయానికి ఇదే స్కోరు ఉండడంతో 30 నిమిషాల అదనపు సమయం ఆడాల్సి వచ్చింది. దీంట్లోనూ గోల్స్ నమోదు కాకపోవడంతో షూటౌట్‌కు వెళ్లారు. షూటౌట్‌లో బ్రెజిల్ 3-2 తేడాతో చిలీని చిత్తు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బ్రెజిల్ గోల్ కీపర్ జూలియో సీజర్ నిలిచాడు.
 
 చిలీపై తమకు ఘనమైన రికార్డు ఉన్న నేపథ్యంలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన బ్రెజిల్ అదే స్థాయిలో విజృంభించింది. ఆది నుంచే బంతిపైపట్టు సాధించి ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దాడులు ప్రారంభించింది.
 
 దీంతో 6వ నిమిషంలో మార్సెలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గురి తప్పింది. 9వ నిమిషంలో నెయ్‌మార్ మోకాలి నొప్పికి చికిత్స తీసుకున్నాడు.
 
 18వ నిమిషంలో నెయ్‌మార్ కార్నర్ కిక్‌ను థియాగో సిల్వ హెడర్ గోల్‌కు యత్నించినా అది గురి తప్పగా గోల్ పోస్టుకు సమీపంలోనే ఉన్న డేవిడ్ లూయిజ్ తన మోకాలితో నెట్‌లోనికి పంపాడు.అంతే అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది.
 
 26వ నిమిషంలో నెయ్‌మార్ పిచ్ మధ్యలో నుంచి డిఫెండర్లను తప్పిస్తూ గోల్ కోసం ప్రయత్నించినా సరైన షాట్‌ను కొట్టకపోవడంతో వైడ్‌గా వెళ్లింది.
 
 అయితే 32వ నిమిషంలో చిలీ షాక్ ఇచ్చింది. వర్గస్ నుంచి అందుకున్న పాస్‌ను స్ట్రయికర్ అలెక్సిస్ సాంచెజ్ పెనాల్టీ ఏరియా నుంచి సులువుగా గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. 1998 తర్వాత నాకౌట్ స్టేజిలో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకోవడం బ్రెజిల్‌కు ఇదే తొలిసారి.
 
 36వ నిమిషంలో నెయ్‌మార్ హెడర్ గోల్ ప్రయత్నం వెంట్రుక వాసిలో తప్పిపోయింది.
 39వ నిమిషంలో ఫ్రెడ్ కొట్టిన షాట్ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లిపోయింది.
 
 ద్వితీయార్ధంలో ఆధిక్యం సాధించేందుకు బ్రెజిల్ తమ దాడులను తీవ్రం చేసింది.
 55వ నిమిషంలో ఈ జట్టు స్ట్రయికర్ హల్క్ గోల్ చేసినా అసిస్టెంట్ రిఫరీ అంగీకరించలేదు. కొంచెం ఎత్తులో వచ్చిన బంతిని హల్క్ తన ఛాతీతో అదుపు చేసి గోల్ పోస్టులోకి తన్ని సంబరాల్లో మునిగాడు. అయితే అది హ్యాండ్‌బాల్‌గా రిఫరీ ప్రకటించారు. రీప్లేలో భుజంతో ఆపినట్టుగా తేలింది.
 
 చివర్లో చిలీ పూర్తి రక్షణాత్మక ఆటతీరుకు ప్రాధాన్యమిచ్చింది. 80వ నిమిషంలో నెమ్‌మార్ హెడర్‌ను, 84వ నిమిషంలో హల్క్ ప్రయత్నాన్ని చిలీ గోల్ కీపర్ క్లాడియో బ్రావో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా ఉండడంతో ఎక్స్‌ట్రా సమయం అవసరమైంది. 1998లో చివరిసారిగా నాకౌట్ స్టేజిలో బ్రెజిల్... నెదర్లాండ్స్‌పై ఎక్స్‌ట్రా సమయం ఆడి నెగ్గింది.
 
 తొలి 15 నిమిషాల అదనపు సమయంలో బ్రెజిల్ ప్రమాదకరంగా కనిపించినా గోల్ సాధించలేకపోయింది. 101వ నిమిషంలో ఆస్కార్ హెడర్ నేరుగా కీపర్ బ్రావో చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఇరు జట్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement