శతకాలతో మెరిసిన డు ప్లెసిస్, మిల్లర్‌ 

Australia v South Africa: Tourists win by 40 runs to win  - Sakshi

హొబార్ట్‌: డేవిడ్‌ మిల్లర్‌ (108 బంతుల్లో 139; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (114 బంతుల్లో 125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత శతకాలతో చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఆసీస్‌ గడ్డపై 2009 అనంతరం దక్షిణాఫ్రికాకు ఇదే తొలి వన్డే సిరీస్‌ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిల్లర్, డుప్లెసిస్‌ దూకుడుతో 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది.

55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 252 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఏ వికెట్‌కైనా నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. చివరి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 174 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్, స్టొయినిస్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్‌ 9 వికెట్లకు 280 పరుగులు చేసి ఓడింది. షాన్‌ మార్‌‡్ష (106; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి తోడు స్టొయినిస్‌ (63; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో అలెక్స్‌ క్యారీ (42), మ్యాక్స్‌వెల్‌ (35) పోరాడినా లాభం లేకపోయింది. సఫారీ బౌలర్లలో స్టెయిన్, రబడ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top