‘ఐపీఎల్‌ను ముడిపెట్టి.. ఒత్తిడి తెచ్చారు’

Afridi Accuses IPL Of Threatening Sri Lankan Players - Sakshi

కరాచీ: తమ దేశంలో శ్రీలంక క్రికెటర్లు పర్యటించకుండా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఒత్తిడి తీసుకొస్తుందని పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది విమర్శించాడు. ఐపీఎల్‌ను ముడిపెట్టి.. శ్రీలంక క్రికెటర్లపై ఒత్తిడి తేవడం వల్లే ఆ దేశానికి చెందిన 10 క్రికెటర్లు పాక్‌ పర్యటనకు రాలేమంటూ తెగేసి చెప్పారని అఫ్రిది మండిపడ్డాడు. ఒకవైపు శ్రీలంక క్రికెట్‌ బోర్డు తమ దేశ పర్యటనకు అనుమతి ఇచ్చినా దాన్ని కూడా లెక్కచేయడం లేదంటే అందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కారణమన్నాడు. పాక్‌ పర్యటనకు వెళితే ఐపీఎల్‌ కాంట్రాక్టులు రద్దు చేస్తామంటూ శ్రీలంక క్రికెటర్లకు బెదిరింపులు వచ్చాయంటూ అఫ్రిది మరోసారి అక్కసు ప్రదర్శించాడు.

ఒక వీడియో ఇంటర్యూలో అఫ్రిది మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్‌ పర్యటనకు రాలేమంటూ చెప్పడానికి ఐపీఎలే కారణం. ఐపీఎల్‌లో మీ కాంట్రాక్ట్‌ ఉండదని బెదిరించడంతోనే శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు పాక్‌ పర్యటన నుంచి వెనక్కి తగ్గారు. శ్రీలంక క్రికెటర్లపై ఐపీఎల్‌ ఒత్తిడి చాలా ఉంది. అలా కాకపోతే గతంలో పీఎస్‌ఎల్‌లో ఆడటానికి ఎందుకు వచ్చారు. అప్పుడు పాక్‌ పర్యటనకు రావాలని ఉందని వారే చెప్పారు. ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ల పాక్‌ పర్యటనకు డుమ్మా కొట్టడం వెనుక ఐపీఎల్‌ యాజమాన్యం ఉంది. పాక్‌ టూర్‌కు వెళితే ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వమని బెదిరింపులకు పాల్పడి ఉంటారు’ అని అఫ్రిది తెలిపాడు. తాము  ఎప్పుడూ శ్రీలంక క్రికెట్‌ జట్టుకు అండగా ఉ‍న్నామన్నాడు. శ్రీలంక భయానక వాతావరణం చోటు చేసుకున్న సందర్భాల్లో మేము అక్కడ పర్యటించామన్నాడు.

ఇదిలా ఉంచితే, తమ జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి శ్రీలంక క్రికెట్‌ బోర్డు గురువారం నిర్ణయం తీసుకుంది. గతవారం శ్రీలంక జట్టు సెక్యూరిటీ సంబంధించి అనుమానాలు తలెత్తడంలో పాక్‌తో సిరీస్‌ డైలమాలో పడింది. కాకపోతే అక్కడ భద్రతకు సంబంధించి ఎటువంటి భయం లేదని భరోసా లభించడంతో శ్రీలంక క్రికెట్‌ పెద్దలు ఎట్టకేలకు తమ జట్టును పాక్‌ పర్యటనకు పంపడానిక అంగీకరించారు. అయితే సీనియర్‌ క్రికెటర్లైన లసిత్‌ మలింగా, మాథ్యస్‌, కరుణరత్నే తదితరులు పాక్‌ పర్యటనకు వెళతారా.. లేదా అనేది ఇంకా సందిగ్థంలోనే ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top