రెరా చట్టం.. స్థిరాస్థి కొనుగోలుదారులకు వరం

RERA: All about the Big Brother to watch over realty sector - Sakshi

సాక్షి, నెల్లూరు: ఏదైనా వెంచర్‌లో ప్లాట్‌ బుక్‌ చేసుకుంటే నిర్మాణదారు మనకు ఎప్పుడు అప్పగిస్తాడో తెలియదు. ఒక వేళ డబ్బు తీసుకుని మనకు ఇంటిని సరైన సమయానికి అప్పగించకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకున్న బ్యాంకు రుణంపై వడ్డీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల కొత్తగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకువచ్చింది.

నియంత్రణ అధికారుల వద్ద నమోదు
ఈ చట్ట ప్రకారం చేపడుతున్న ప్రాజెక్టులను, ఇప్పటికీ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌(సీసీ)అందుకోని ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను నియంత్రణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. దీంతో నిర్మాణ రంగంలోని బిల్డర్లు చేసే మోసాల నుంచి కొగుగోలుదార్లను రక్షించవచ్చు. ఇంతకు ముందు కోర్టు కేసులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి మాత్రమే వినియోగదారులు తమకు రావాల్సిన డబ్బును రాబట్టుకునేందుకు వీలుండేది. ఇకపై ఈ ప్రయాసలకు కాస్త విముక్తి కలుగుతుంది.

రెరా చట్టంలోని కీలక ప్రతిపాదనలు
బిల్డర్లు తాము చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక(ఎస్క్రో) ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల, కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతం అదే ఖాతాలో ఉండాల్సిందే. ఈ సొమ్మంతా ప్రాజెక్టు నిర్మాణానికి, భూమి కొనుగోలుకు వెచ్చించాల్సిఉంటుంది. ఒక్క ప్లాట్‌ అమ్మిన తర్వాత దాని నిర్మాణంలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే తప్పనిసరిగా బిల్డర్‌ కొనుగోలుదారు నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దీంతో మధ్యలోనే మళ్లీ ధరలు పెంచే అవకాశం ఉండదు.

ప్రతి దశా ప్రాజెక్ట్‌ కిందే
ఈ చట్టం ప్రకారం భవన నిర్మాణంలోని ప్రతి దశా ప్రత్యేక ప్రాజెక్టు కింద లెక్క. ప్రతి దశకూ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఆ దశలను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

సమాచారం అందుబాటులో..
ప్రతి బిల్డర్‌ ప్రాజెక్టు ప్లాన్, లేఅవుట్, ప్రభుత్వ అనుమతులు, ప్రాజెక్టు నిర్మించే భూమిపై హక్కు, ప్రస్తుత స్థితిగతులు, ప్రాజెక్టు ఉప కాంట్రాక్టర్ల వివరాలు, ఎప్పటి లోపు పూర్తవుతుందనే వివరాలను ఆయా రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. ప్లాట్‌ కొనుగోలుకు ముందే కొనుగోలుదారులు ఈ వివరాలను ఆయా సంస్థ«ల నుంచి ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది.

నిర్మాణదారులకు జైలు, జరిమానా
రెరా చట్టం కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చే ఆదేశాలను పాటించి తీరాలి. లేనిపక్షంలో 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష అనుభవించాలి. అక్కడ కేసు తీవ్రతను బట్టి జరిమానా సైతం ఉండొచ్చు. అలాగే ఈ చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి ప్లాట్‌ చేతికందిన ఏడాది సమయం వరకూ తలెత్తే నిర్మాణలోపాలను సరిదిద్దే బాధ్యత బిల్డర్‌ తీసుకోవాల్సిఉంటుంది.

బుకింగ్‌ సొమ్ము ఇలా..
కొంత మంది బిల్డర్లు పూర్తి నిర్మాణ ఖర్చులో 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును బుకింగ్‌ కోసం అడుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మకపు ఒప్పందం తర్వాత జరుగుతోంది. కానీ రెరా చట్టం ప్రకారం ప్రమోటర్లు 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును డిమాండ్‌ చేయకూడదు. మొదట సేల్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకోవాల్సిందే. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే బ్యాంకు రుణం మీద వడ్డీ కట్టాల్సిన బాధ్యత నిర్మాణదారుపై పడుతుంది. దీంతో వినియోగదారునికి వడ్డీ భారం తగ్గుతుంది. 

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top