భూములన్నీ బీడు.. ఆశలన్నీ మోడు

YV Subba Reddy Slams On Chandrababu Naidu Prakasam - Sakshi

‘‘చెరువులన్నీ ఎడారులను తలపిస్తున్నాయి.. సాగు భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి..రైతులు కూలీలుగా మారిపోతున్నారు. వెలిగొండ పూర్తయితే ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువుకు ప్రాజెక్టు నుంచి నీరు నింపే అవకాశం ఉంది. తురిమెళ్ళ, రాచర్ల చెరువుల్లాంటి ఎన్నిటినో నీటితో నింపి తాగునీరు ఇవ్వొచ్చు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే వెలిగొండ పూర్తి కాలేదు. ముడుపులు వచ్చే ప్రాజెక్టులపై  దృష్టి తప్ప రైతు సంక్షేమానికి ఉపయోగపడే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర సోమవారం కంభం, అర్ధవీడు మండలాల్లో సాగింది. 

కంభం/అర్థవీడు(ప్రకాశం) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రజలకు తాగు, సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అందులో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన రూ.3500 కోట్లతో 75 శాతం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్ల పాలన పూర్తవుతున్నా ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తవ్వలేక పోయారని విమర్శించారు. 2014 నుంచి ఏటా మరో సంవత్సరానికి వెలిగొండను పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా నిదులు కేటాయించ లేదని ఆరోపించారు. ఇటీవల జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ నాటికి వెలిగొండ పూర్తి చేసి నీరిస్తామని హామీ ఇచ్చారని, నాలుగున్నరేళ్లలో జరగని పనులు నాలుగు నెలల్లో ఏవిధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు.

ప్రజాపాదయాత్రలో భాగంగా సోమవారం మండల కేంద్రం కంభంలోని కందులాపురం కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని దీంతో పాటు ప్రజలకు తాగునీరు అందుతుందని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు, కంభం మండలంలో 19 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని అన్నారు. కంభం చెరువు 32 అడుగులు ఉండగా ప్రస్తుతం 20 అడుగుల పైన పూడికతో నిండిపోయిందని. కనీసం పూడిక తీత పనులు చేపట్టాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వెలిగొండ పూర్తి చేస్తామని, సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్‌ రహిత సమాజాన్ని రూపొందిస్తామన్నారు. వ్యవసాయాన్ని సస్యశామలం చేస్తామని తెలిపారు

అశోక్‌రెడ్డికి పుట్టగతులు లేకుండా చేయండి..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన బిక్షతో ఫ్యాను గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయి చంద్రబాబు సంకనెక్కాడని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఇలాంటి నాయకులకు పుట్టగతులు లేకుండా చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్రాంతికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీరిస్తామని చెబుతున్న టీడీపీ నాయకులు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. సంక్రాంతి తర్వాత నీరు ఇవ్వకపోతే టీడీపీ సర్కారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇంకా 14 నెలల పదవీకాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ఎంపీ పదవిని త్యజించిన గొప్ప నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీరందించాలన్న లక్ష్యంతో కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు 207 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నారన్నారు. ఎన్నికలు నాలుగునెలలు ఉందన్న ఉద్దేశంతో చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు అన్న క్యాంటీన్లు, నిరుద్యోగభృతి ఇప్పుడు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్‌ శాఖా మంత్రి దేవినేని ఉమా తన శాఖ పనికంటే ఇరిగేషన్‌కు చంద్రబాబుకు మధ్య బ్రోకర్‌ గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
 
వైఎస్సార్‌ సీపీతోనే న్యాయం..
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న పోరాటం ఎనలేనిదన్నారు. వైఎస్సార్‌ సీపీతోనే పేద ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఫ్యాను గుర్తుపై గెలుపొంది పార్టీ మారిన అశోక్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేందు సిద్ధంగా ఉన్నారన్నారు.

కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు..
వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లో అత్యంత ఆదరణ కనిపిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా అన్నారు. సీఎం చంద్రబాబు పట్టిసీమ పేరుతో వేలకోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పక్కనబెట్టి కొత్త ప్రాజెక్టులను తయారు చేస్తూ అందులో కమీషన్లు నొక్కుతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక ఎక్కడైనా వర్షాలు కురిశాయా, చెరువులు నిండాయా? అని ప్రజలను ప్రశ్నించారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యాళ్ళూరి వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, కామూరి రమణారెడ్డి, పిడతల అభిషేక్‌రెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కేవీ రమణారెడ్డి, చుండూరు రవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా.చేరెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి చెన్నువిజయ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పఠాన్‌సుభాన్‌ఖాన్, మండల కన్వీనర్లు లాయర్‌ శ్రీనివాసులరెడ్డి, బొల్లాబాలిరెడ్డి, పఠాన్‌ జఫల్లా ఖాన్, బోయళ్ళ జనార్దన్‌ రెడ్డి, కర్నూలు జిల్లా నేతలు గౌరు వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
వైవీ ఎదుట సమస్యల మొర..
పాదయాత్రగా వస్తున్న వైవీకి స్థానికులు సమస్యలు విన్న వించారు. ప్రధానంగా సూరేపల్లె, కందులాపురం, కంభం గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని, ట్యాంకర్లు వస్తేనే నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వర్షాభావం కారణంగా ఇటుకల పరిశ్రమ మూతపడే స్థాయికి వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.  తాగునీరు లేక జీవాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గొర్రెల కాపరులు వాపోయారు. గ్రాసం లేక వందల మైళ్లు వెళ్లి నల్లమల అడవుల్లో గ్రాసం తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

హోరెత్తిన హోదా నినాదం..
పాదయాత్రలో ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగాయి. విద్యార్థులు, యువకులు ఫ్లకార్డులు పట్టుకొని యాత్ర కొనసాగించారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, వైఎస్సార్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆట పాటల ద్వారా కోలాట భజన బృందాలు చేసిన ప్రదర్శనలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. కందులాపురం సెంటర్‌లోని అంబేడ్కర్, వైఎస్సార్, శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top